Maharaja: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోన్న మహారాజ - స్ట్రెయిట్ సినిమాలను దాటేసిన విజయ్ సేతుపతి డబ్బింగ్ మూవీ
17 June 2024, 9:50 IST
Maharaja: విజయ్ సేతుపతి మహారాజ తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. గత వారం రిలీజైన తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు మించి వసూళ్లను రాబడుతోన్న ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసింది
విజయ్ సేతుపతి మహారాజ కలెక్షన్స్
Maharaja: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయ్ సేతుపతి మహారాజ కుమ్మేస్తోంది. స్ట్రెయిట్ సినిమాలకు మించి ఈ తమిళ డబ్బింగ్ మూవీ కలెక్షన్స్ రాబడుతోంది. మౌత్ టాక్ బాగుండటంతో రోజురోజుకు వసూళ్లు పెరుగుతోన్నాయి. మూడు రోజుల్లో విజయ్ సేతుపతి మూవీ ఆరున్నర కోట్లకుపైగా గ్రాస్‌ను మూడు కోట్ల ఇరవై లక్షల వరకు షేర్‌ను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
ఆదివారం రోజు ఈ మూవీ మూడు కోట్ల వరకు గ్రాస్, కోటి యాభై లక్షలకుపైగా షేర్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. ఫస్ట్ డేతో పోలిస్తే మూడో రోజు ఈ మూవీ కలెక్షన్స్ దాదాపు మూడింతలు పెరిగాయి. తొలిరోజు మహారాజ తెలుగు వెర్షన్ కేవలం 60 లక్షల షేర్ కలెక్షన్స్ మాత్రమే దక్కించుకున్నది.
మూడు కోట్ల బ్రేక్ ఈవెన్...
దాదాపు మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విజయ్ సేతుపతి మహారాజ మూవీ తెలుగులో రిలీజైంది. ఆదివారం నాటి కలెక్షన్స్‌తో మహరాజ తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటి లాభాల్లోకి అడుగుపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. విజయ్ సేతుపతి తెలుగు డబ్బింగ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా మహారాజ నిలిచింది. వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లో మహారాజ మూవీ 21.45 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. ఆదివారం రోజు ఈ సినిమాకు మొత్తంగా 9 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి.
తెలుగు సినిమాలకు మించి...
ఏడు స్ట్రెయిట్ మూవీస్‌తో పాటుగా గత శుక్రవారం మహారాజ ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్ట్రెయిట్ సినిమాలకు మించి డబ్బింగ్ సినిమా అయిన మహారాజనే ఎక్కువగా కలెక్షన్స్ రాబడుతోంది. ఈ స్ట్రెయిట్ సినిమాల్లో ఒక్క సుధీర్ బాబు హరోంహర మాత్రమే మోస్తారు వసూళ్లను రాబడుతోంది.
ఈ యాక్షన్ మూవీ మూడు రోజుల్లో దాదాపు నాలుగు కోట్ల పది లక్షలకుపైగా పైగా గ్రాస్‌ను...రెండు కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. మహారాజ, హరోంహర రెండు ఒకే రోజు రిలీజ్ అయినా...డబ్బింగ్ మూవీకంటే సుధీర్ బాబు సినిమా కోటి వరకు తక్కువే కలెక్షన్స్ దక్కించుకున్నది. మిగిలిన సినిమాలు ఏవి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి.
రివేంజ్ థ్రిల్లర్...
మహారాజ సినిమాకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామి కీలక పాత్రల్లో నటించారు. తన కూతురిపై జరిగిన అన్యాయానికి ఓ తండ్రి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే పాయింట్‌తో రివేంజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు నితిలన్ సామినాథన్ మహారాజ మూవీని తెరకెక్కించాడు.
మహారాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. తన కూతురితో కలిసి సిటీకి దూరంగా ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. ఓ రోజు తన ఇంటిపై కొందరు దాడిచేసి లక్ష్మిని ఎత్తుకుపోయారని మహారాజ పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. ఇంతకు లక్ష్మి ఎవరు? అతడి కంప్లైంట్‌ను పోలీసులు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు అన్నదే ఈ మూవీ కథ.
50వ మూవీ...
కథలోని మలుపులతో పాటు విజయ్ సేతుపతి యాక్టింగ్‌పై ప్రశంసలు దక్కుతోన్నాయి. చాలా రోజుల తర్వాత మహారాజతో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ సేతుపతి. హీరోగా విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ సినిమా ఇది.