Magadheera rerelease collection: మగధీర రీరిలీజ్.. అప్పుడు ఇండస్ట్రీ హిట్.. ఇప్పుడు డిజాస్టర్
28 March 2024, 21:31 IST
- Magadheera rerelease collection: టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మగధీర మూవీ రీరిలీజ్ లో మాత్రం దారుణంగా బోల్తా పడింది. చరణ్ బర్త్ డే సందర్భంగా బుధవారం (మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను చూసేవారే కరవయ్యారు.
మగధీర రీరిలీజ్.. అప్పుడు ఇండస్ట్రీ హిట్.. ఇప్పుడు డిజాస్టర్
Magadheera rerelease collection: రామ్ చరణ్ కెరీర్లో తొలి బిగ్గెస్ట్ హిట్ మగధీర. రాజమౌళిని దర్శక ధీరుడిని చేసిన మూవీ ఇది. 2009లో ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసింది. చరణ్ యాక్టింగ్, కాజల్ అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ అదే సినిమా ఇప్పుడు రీరిలీజ్ లో మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. చరణ్ 39వ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ మరోసారి రిలీజైన విషయం తెలిసిందే.
మగధీర డిజాస్టర్
స్టార్ల బర్త్ డేలనాడు కెరీర్లో బెస్ట్ మూవీస్ రీరిలీజ్ కావడం ఈ మధ్య ఆనవాయితీగా నిలిచిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా మగధీర రీరిలీజైంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కొన్ని రోజుల ముందే ప్రారంభమయ్యాయి. పైగా ఈ మూవీకి ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్దగా పోటీ కూడా ఏమీ లేదు.
దీంతో రీరిలీజ్ లోనూ మగధీర రికార్డులను బ్రేక్ చేస్తుందనుకుంటే.. దారుణంగా బోల్తా పడింది. అక్కడక్కడా కొన్ని ఫ్యాన్స్ షోలు తప్ప.. చాలా వరకూ షోల ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉండటం గమనార్హం. 2009లోనే రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన సూపర్ డూపర్ హిట్ మూవీని ఇప్పుడెందుకు ప్రేక్షకులు పట్టించుకోలేదు అన్నది అంతుబట్టని విషయమే.
ఆరెంజ్ హిట్.. మగధీర ఫట్
నిజానికి చరణ్ కెరీర్లో ఓ పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయిన సినిమా ఆరెంజ్. ఈ మగధీర తర్వాత రిలీజైన మూవీ ఇది. కానీ ఈ మూవీని ప్రేక్షకులు తిరస్కరించారు. మూవీకి నిర్మాతగా ఉన్న నాగబాబు మొత్తం పోగొట్టుకున్నాడు. అలాంటి సినిమా గతేడాది చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజైంది. ఊహకందని విధంగా ఈ సినిమా రీరిలీజ్ లో మంచి వసూళ్లు సాధించింది.
మొత్తంగా రూ.3.2 కోట్ల వసూళ్లతో ఆరెంజ్ దూసుకెళ్లింది. తొలిసారి రిలీజైనప్పుడే డిజాస్టర్ గా మిగిలిన సినిమా ఇప్పుడు హిట్ కావడమే ఆశ్చర్యమనుకుంటే.. అప్పట్లో హిట్ అయిన మగధీర ఇప్పుడిలా డిజాస్టర్ కావడం మరో ఆశ్చర్యం. ఆరెంజ్ స్టోరీ నచ్చకపోయినా.. పాటలు మాత్రం ఊపేశాయి. మగధీర స్టోరీతోపాటు పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.
ఆరెంజ్ రీరిలీజ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అదనంగా థియేటర్లను కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. అన్ని షోలూ హౌజ్ ఫుల్ అయ్యాయి. ఇప్పుడు మగధీర షోలు వెలవెలబోయాయి. ఈ డిజాస్టర్ వెనుక కారణాలేంటో తెలియాల్సి ఉంది. మరోవైపు చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత ఆర్సీ16ని బుచ్చిబాబు సానాతో, ఆర్సీ17ని సుకుమార్ తో చేస్తున్న విషయం తెలిసిందే.
చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి జరగండి అనే పాట కూడా రిలీజైంది. అయితే ఈ సాంగ్ కు కూడా ఊహించినంత రెస్పాన్స్ రాలేదు. తొలి 24 గంటల్లో 4.5 మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఇక గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కు మరో నాలుగైదు నెలలు పడుతుందని కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పాడు.