Laapataa Ladies: ఆస్కార్ రేసు నుంచి లాపతా లేడీస్ ఔట్.. మరో హిందీ మూవీకి ఛాన్స్.. ఇండియాకు నిరాశే
18 December 2024, 7:41 IST
Laapataa Ladies: ఆస్కార్స్ 2025 రేసు నుంచి ఆమిర్ ఖాన్ నిర్మించిన, అతని మాజీ భార్య కిరణ్ రావ్ డైరెక్ట్ చేసిన మూవీ లాపతా లేడీస్ తప్పుకుంది. బుధవారం (డిసెంబర్ 18) ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో పోటీ పడే 15 సినిమాల జాబితా రిలీజ్ చేసింది.
ఆస్కార్ రేసు నుంచి ఆ హిందీ మూవీ ఔట్.. మరో మూవీకి ఛాన్స్
Laapataa Ladies: లాపతా లేడీస్.. ఈసారి ఆస్కార్స్ 2025కు ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్లింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈసారి అవార్డుపై ఆశలు రేపింది. కానీ తాజాగా ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ చేసిన షార్ట్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయింది. దాని స్థానంలో మరో హిందీ మూవీ సంతోష్ (Santosh) ఈ కేటగిరీలో ఎంపికవడం విశేషం.
లాపతా లేడీస్ ఔట్.. సంతోష్ ఇన్
లాపతా లేడీస్ మూవీ ఈ ఏడాది అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అయిన మూవీ. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నిర్మించిన, అతని మాజీ భార్య కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడంతోపాటు తర్వాత నెట్ఫ్లిక్స్ లోనూ దుమ్మురేపింది. దీంతో ఈ సినిమాను ఆస్కార్స్ 2025 కోసం అధికారిక ఎంట్రీగా పంపించారు. దీంతోపాటు అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి మొత్తం 85 సినిమాలను నామినేట్ చేశారు. వాటి నుంచి తాజాగా 15 సినిమాలను మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు.
అయితే ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయిన హిందీ మూవీ సంతోష్.. యూకే నుంచి అధికారిక ఎంట్రీ కావడం విశేషం. ఈ ఏడాది మేలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ మూవీని ప్రదర్శించారు. నార్త్ ఇండియాలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన స్టోరీ ఇది. సంధ్య సూరి ఈ మూవీకి కథ అందించి దర్శకత్వం వహించింది. మూవీలో నటించిన షహానా గోస్వామి దీనిపై స్పందిస్తూ.. 85 సినిమాల నుంచి తమ మూవీ ఎంపికవడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.
సంతోష్ మూవీ స్టోరీ ఏంటంటే?
సంధ్య సూరి డైరెక్ట్ చేసిన సంతోష్ మూవీలో షహానా నటించింది. భర్తను కోల్పోయిన ఆమె.. ఓ ప్రభుత్వ పథకం వల్ల అతని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తుంది. అందులో చేరిన తర్వాత ఆమెకు అసలు సవాళ్లు మొదలవుతాయి. అక్కడి అవినీతితోపాటు తన సీనియర్ ఇన్స్పెక్టర్ శర్మ (సునితా రాజ్వార్)తో పని చేయడం ఆమెకు సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఓ దళిత టీనేజర్ హత్య కేసును విచారించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ సంతోష్ మూవీ స్టోరీ. ఈ సినిమాకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది.
సంతోష్ హిందీ మూవీయే అయినా.. ఇది యూకే నుంచి నామినేట్ అయిన సినిమా. దీంతో ఈసారి ఆస్కార్స్ లో ఇండియా నుంచి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఒక్క మూవీ కూడా లేకుండా పోయింది. నార్వే, సెనెగల్, ఫ్రాన్స్, లాత్వియా, పాలస్తీనా, డెన్మార్క్, థాయ్లాండ్, బ్రెజిల్, ఐర్లాండ్, యూకే, జర్మనీ, ఐస్లాండ్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఇటలీలాంటి దేశాల సినిమాలు ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. ఈ షార్ట్ లిస్ట్ అయిన మూవీస్ నుంచి ఆస్కార్స్ ఫైనల్ నామినేషన్లను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి జనవరి 12 వరకు జరుగుతుంది. జనవరి 17న నామినేషన్లను అనౌన్స్ చేస్తారు.
టాపిక్