Lal Salaam: ఆ దేశంలో రజినీకాంత్ మూవీ నిషేధం!
04 February 2024, 19:27 IST
- Rajinikanth - Lal Salaam Movie: లాల్ సలాం సినిమాపై ఓ దేశంలో నిషేధం పడింది. రజినీకాంత్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ఆయన కూతురు ఐశ్వర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
లాల్ సలాం పోస్టర్
Lal Salaam Movie: కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ కీలకపాత్ర పోషించిన లాల్ సలాం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 9వ తేదీ ఈ చిత్రం రిలీజ్ కానుంది. రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. మోయిద్దీన్ భాయ్ అనే పాత్రను ఈ చిత్రంలో చేశారు రజినీ. క్రికెట్ యాక్షన్ డ్రామాగా లాల్ సలాం మూవీ ఉండనుంది.
లాల్ సలాం సినిమాలో మతకలహాల అంశం కూడా ఉండనున్నట్టు సమాచారం. దీంతో ఈ చిత్రంపై అరబ్ దేశమైన ‘కువైట్’ నిషేధం విధించినట్టు తెలుస్తోంది. ముస్లింలకు వ్యతిరేకంగా కొంచెం కంటెంట్ ఉన్నా.. ఆ సినిమాలను కువైట్ బ్యాన్ చేస్తుంటుంది. ఇప్పుడు లాల్ సలాం విషయంలోనూ అదే చేసింది. మరిన్ని అరబ్ దేశాలు కూడా ఈ చిత్రంపై ఇలాంటి నిర్ణయం తీసుకుంటాయని టాక్ వినిపిస్తోంది.
లాల్ సలాం సినిమా ఫిబ్రవరి 9వ తేదీన తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ థియేటర్లలో రిలీజ్ కానుంది. దర్శకత్వానికి సుమారు ఏడేళ్ల బ్రేక్ తీసుకున్న ఐశ్వర్య.. ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. ముస్లిం మతపెద్ద మొయిద్దీన్ భాయ్ క్యారెక్టర్ చేశారు రజినీకాంత్. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఈ చిత్రంలో క్యామియో రోల్‍లో కనిపించనున్నారు.
లాల్ సలాం చిత్రంలో ధన్యబాలకృష్ణన్, జీవిత రాజశేఖర్, విఘ్నేశ్, లివింగ్‍స్టన్, సెంథిల్, అనంతిక సనిల్‍కుమార్, కేఎస్ రవికుమార్, తంబి రామయ్య కీరోల్స్ చేశారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
జనవరిలోనే లాల్ సలాం చిత్రం రిలీజ్ కావాల్సింది. అయితే, అప్పటికి సిద్ధం కాకపోవడంతో ఫిబ్రవరి 9కి మేకర్స్ వాయిదా వేశారు. అయితే, ఇప్పటికీ ప్రమోషన్లను అంతగా చేయడం లేదు టీమ్.
వివాదం రేపిన వ్యాఖ్య
తన తండ్రి రజినీకాంత్ ‘సంఘీ’ (మతతత్వవాది) కాదంటూ ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపాయి. ఆధ్యాత్మిక చింతన ఉన్నంత మాత్రాన ఆయనను సంఘీ అనకూడదని చెప్పారు. “ఓ నిర్దిష్టమైన రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే వారిని ఆ పదం (సంఘీ)తో పిలుస్తారని నాకు తెలిసింది. రజీనికాంత్ సంఘీ కాదు. సంఘీ అయితే లాల్ సలాంలో నటించేందుకు ఆయన అంగీకరించేవారు కాదు” అని లాల్ సలాం ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఐశ్వర్య అన్నారు. అయితే సంఘీ పదంలో తప్పేముందని కొందరు ఐశ్వర్య వ్యాఖ్యలపై తప్పుబట్టారు. దీంతో రజినీకాంత్ వివరణ ఇచ్చారు. సంఘీ అనేది తప్పు పదం అని ఐశ్యర్య చెప్పలేదని అన్నారు.