తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kbc Quiz Show: ఈ ప్రశ్న విలువ రూ.25 లక్షలు.. మహాభారతంపై అడిగిన ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా?

KBC Quiz Show: ఈ ప్రశ్న విలువ రూ.25 లక్షలు.. మహాభారతంపై అడిగిన ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా?

Hari Prasad S HT Telugu

13 August 2024, 15:50 IST

google News
    • KBC Quiz Show: పాపులర్ క్విజ్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి మళ్లీ వచ్చేసింది. 16వ సీజన్ తొలి రోజు సోమవారం (ఆగస్ట్ 12) ఉత్కర్ష్ అనే కంటెస్టెంట్ రూ.25 లక్షల విలువైన మహాభారతంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. మీరు చెప్పగలరా?
ఈ ప్రశ్న విలువ రూ.25 లక్షలు.. మహాభారతంపై అడిగిన ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా?
ఈ ప్రశ్న విలువ రూ.25 లక్షలు.. మహాభారతంపై అడిగిన ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా?

ఈ ప్రశ్న విలువ రూ.25 లక్షలు.. మహాభారతంపై అడిగిన ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా?

KBC Quiz Show: ఎంతో ఆసక్తి రేపే క్విజ్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి మళ్లీ వచ్చేసింది. ఈ 16వ సీజన్ కు కూడా బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా ఉన్నాడు. అయితే తొలి రోజే కొన్ని ప్రశ్నలు ఎంతో ఆసక్తి రేపాయి. బెంగళూరుకు చెందిన ఉత్కర్ష్ భక్షి ఈ సీజన్ తొలి కంటెస్టెంట్ కాగా.. మహాభారతంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అతడు రూ.3.2 లక్షలతో సరిపెట్టుకున్నాడు.

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

కేబీసీ 16లో భాగంగా ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ లో ఉత్కర్ష్ భక్షి తొలి కంటెస్టెంట్ గా ఎంపికయ్యాడు. అతడు చాలా బాగా ఆడాడు. 12 ప్రశ్నల వరకూ సమాధానాలు చెప్పాడు. రూ.25 లక్షల విలువైన 13వ ప్రశ్న అతన్ని ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలో గేమ్ వదిలేసి ఉంటే అతనికి రూ.12.5 లక్షలు దక్కేవి. కానీ ఆ ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇవ్వడంతో కేవలం రూ.3.2 లక్షలే గెలుచుకున్నాడు.

ఉత్కర్ష్ ను తికమకపెట్టిన ఆ ప్రశ్న మహాభారతానికి సంబంధించినది. "మహాభారతం ప్రకారం.. భీష్ముడిని చంపేందుకు ఉపయోగపడిన దండను ఏ దేవుడు అంబకు ఇచ్చాడు?" దీనికి ఇచ్చిన ఆప్షన్లు.. శివుడు, కార్తికేయుడు, విష్ణువు, వాయు దేవుడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలియకపోవడంతో ఉత్కర్ష్ ఫోన్ ఎ ఫ్రెండ్ లైఫ్ లైన్ తీసుకున్నాడు.

అందులో అతనికి శివుడు సరైన సమాధానం అని చెప్పారు. అయినా సందేహంతో అతడు డబుల్ డిప్ లైఫ్ లైన్ కూడా తీసుకున్నాడు. ఈ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇక గేమ్ వదిలేసే అవకాశం ఉండదు. అయినా రిస్క్ తీసుకున్నాడు. అప్పుడు మొదట శివుడు అని చెప్పాడు. అది తప్పని తేలింది. తర్వాత వాయుదేవుడు అని అన్నాడు. అది కూడా తప్పుగా తేలడంతో ఉత్కర్ష్ కేవలం రూ.3.2 లక్షలు తీసుకొని వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఇదీ సరైన సమాధానం

నిజానికి ఈ ప్రశ్నకు సరైన సమాధానం కార్తికేయుడు. దీని గురించి అమితాబ్ వివరించాడు కూడా. "అంబ కఠోర తపస్సు తర్వాత కార్తికేయుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఆమెకు ఓ హారం ఇచ్చాడు. అది వేసుకున్న వాళ్లు ఎవరైనా భీష్ముడిని చంపుతాడని అంటాడు. కానీ ఎవరూ దాని కోసం ముందుకు రారు. దీంతో ఆ దండను ఓ స్తంభంపైకి విసిరేస్తాడు. ఆ తర్వాత అంబ మరుజన్మలో శిఖండిగా జన్మించి ఆ హారం వేసుకొని భీష్ముడిని చంపుతుంది" అని బిగ్ బీ చెప్పాడు.

కౌన్ బనేగా క్రోర్‌పతి 16వ సీజన్ సోమవారం (ఆగస్ట్ 12) నుంచి ప్రారంభమైంది. ఈ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. సోనీలివ్ ఓటీటీలోనూ ఈ షో చూడొచ్చు. ఈ కొత్త సీజన్ కు కూడా హోస్ట్ గా వచ్చిన అమితాబ్ బచ్చన్ మొదట్లోనే భావోద్వేగానికి గురయ్యాడు. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పడానికి తన దగ్గర మాటలు లేవంటూ కంటతడి పెట్టాడు.

తదుపరి వ్యాసం