KBC 16 Amitabh Bachchan: ఇండియా ఫేవరెట్ క్విజ్ షో కొత్త సీజన్ మొదలైంది.. ఎమోషనల్ అయిన మెగాస్టార్
KBC 16 Amitabh Bachchan: ఇండియా ఫేవరెట్ క్విజ్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి కొత్త సీజన్ మొదలైంది.ఈ సందర్భంగా ఈ షో హోస్ట్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ అవుతున్న వీడియో వైరల్ గా మారింది.
KBC 16 Amitabh Bachchan: కౌన్ బనేగా క్రోర్‌పతి.. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన ఈ క్విజ్ షో 24 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. నిజానికి గతేడాది తన చివరి సీజన్ హోస్ట్ చేసేసినట్లుగా మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ వీడ్కోలు పలికాడు. అయితే ప్రేక్షకాదరణ దృష్ట్యా ఇప్పుడు 16వ సీజన్ కు కూడా బిగ్ బీ హోస్ట్ గా తిరిగి వచ్చాడు. తొలి ఎపిసోడ్లోనే అతడు ఎమోషనల్ అయ్యాడు.
అమితాబ్ భావోద్వేగం
అప్పుడెప్పుడో 2000వ సంవత్సరంలో తొలిసారి కౌన్ బనేగా క్రోర్‌పతి క్విజ్ సో మొదలైన సంగతి తెలుసు కదా. ఇప్పటి వరకూ 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 16వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ గేమ్ షో ఆడేవాళ్లకే కాదు చూసే వాళ్లలోనూ ఎంతో ఆసక్తి రేపుతుంది. ఇక బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ తనదైన స్టైల్ ఆతిథ్యం ఈ కేబీసీని మరింత మందికి చేరువ చేసింది.
ఈ షో ద్వారా తనను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడం చూసి బిగ్ బీ ఎమోషనల్ అయ్యాడు. సోమవారం (ఆగస్ట్ 12) ప్రారంభమైన తొలి ఎపిసోడ్లో అతడు భావోద్వేగానికి గురయ్యాడు. "ఇవాళ కొత్త సీజన్ ప్రారంభం అవుతోంది. కానీ నాకు కాస్త మాటలు రావడం లేదు. ఎందుకంటే మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞత చెప్పడానికి ఏ మాటలూ చాలవు" అని అమితాబ్ గద్గద స్వరంతో అన్నాడు. అతడు కంటతడి కూడా పెట్టుకున్నాడు.
కేబీసీ 16 గురించి..
కేబీసీ హాట్ సీట్లోకి రావడానికి మొదట ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ నిర్వహిస్తారన్న సంగతి తెలుసు కదా. ఈ కొత్త సీజన్లోనూ ఇలాగే తొలి కంటెస్టెంట్ హాట్ సీట్లోకి వచ్చాడు. అతని పేరు ఉత్కర్ష్ బక్షి. అతడు రూ.25 లక్షల ప్రశ్న వరకు వెళ్లాడు. అయితే ఆ ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇవ్వడంతో కేవలం రూ.3.2 లక్షలు మాత్రమే గెలుచుకోగలిగాడు.
ఈ కొత్త సీజన్లో కంటెస్టెంట్లు తాము గెలుచుకున్న డబ్బును రెట్టింపు చేసుకునే అవకాశం కల్పించారు. దుగ్నాస్త్ర పేరుతో తీసుకొచ్చిన ఈ ఆప్షన్ లో భాగంగా సదరు కంటెస్టెంట్ సూపర్ సవాల్ కు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనికి సాధారణ ప్రశ్నలకు ఇచ్చినట్లుగా నాలుగు ఆప్షన్లు ఉండవు. ప్రశ్నకు నేరుగా సమాధానం చెబితే.. తాము గెలుచుకున్న డబ్బు రెట్టింపు అవుతుంది.
అమితాబ్ బచ్చన్ 2000లో ప్రారంభమైన తొలి సీజన్ నుంచి కేబీసీకి హోస్ట్ గా ఉన్నాడు. ఒక్క 2007లో వచ్చిన మూడో సీజన్ కు మాత్రం బిగ్ బీ స్థానంలో షారుక్ ఖాన్ వచ్చాడు. ఆ తర్వాతి నుంచి ప్రతి సీజన్ నూ అమితాబే హోస్ట్ చేస్తున్నాడు. నిజానికి సినిమా నిర్మాణంలో తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో పడిన బిగ్ బీని ఈ కేబీసీ షోనే మళ్లీ గాడిలో పెట్టిందని చెప్పొచ్చు.