Kalki 2898 AD: కల్కి 2898 ఏడీపై నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలు వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. మహాభారతంతో లింక్
Nag Ashwin on Kalki 2898 AD: ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. ఈ మూవీకి మహాభారతంతో ఉన్న లింకేంటో అతడు వివరించాడు.
Nag Ashwin on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీ గురించి ఆ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మధ్య వెల్లడించిన విషయాలు వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అసలు ఈ సినిమాకు, మహాభారతానికి ఉన్న లింకు.. మూవీ కోసం క్రియేట్ చేసిన సెట్స్, వెహికిల్స్ గురించి అతడు చెప్పాడు. గుర్గావ్ లో జరిగిన సినాప్సె 2024 ఈవెంట్ లో అతడు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటితో కలిసి హాజరయ్యాడు.
కల్కి 2898 ఏడీపై నాగ్ అశ్విన్
కల్కి 2898 ఏడీ మూవీ మే 9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మళ్లీ వాయిదా పడనుందన్న వార్తల నేపథ్యంలో మే 9నే అంటూ మరోసారి నాగ్ అశ్విన్ ఈ ఈవెంట్లో కన్ఫమ్ చేశాడు. ప్రభాస్, దీపికా, అమితాబ్, కమల్ హాసన్ లాంటి వాళ్లు నటిస్తున్న ఈ సినిమా గురించి అతడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.
ఈ కల్కి 2898 ఏడీ మూవీ 6 వేల సంవత్సరాల టైమ్ లైన్ తో ఉండబోతోందని అతడు చెప్పడం విశేషం. "సినిమా మహాభారతంతో మొదలై 2898 ఏడీ సంవత్సరంలో ముగుస్తుంది. అంటే 6000 సంవత్సరాల కాలం సాగనుంది. ఆ ప్రపంచాలు ఎలా ఉంటాయన్నది చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా పూర్తి భారతీయతతో ఉండేలా జాగ్రత్త పడుతున్నాం" అని నాగ్ అశ్విన్ అన్నాడు.
కృష్ణ భగవానుడు క్రీస్తు పూర్వం 3102లో నిర్యాణం చెందాడని చెబుతారు. దీంతో అప్పటి నుంచి 2898 ఏడీ వరకూ తీసుకుంటే ఆరు వేల ఏళ్లు పూర్తవుతుంది. ఆ రెండు కాలాల మధ్య ఉన్న సమయాన్ని ఈ కల్కి 2898 ఏడీ మూవీలో నాగ్ అశ్విన్ చూపించే ప్రయత్నం చేయనున్నారు. ఈ సినిమా కోసం తాము ఎంతలా శ్రమించింది కూడా వెల్లడించాడు.
సోరా ఉపయోగించలేదు
ఓపెన్ఏఐ అయిన సోరాను ఈ మూవీ కోసం ఉపయోగించలేదని కూడా నాగ్ అశ్విన్ స్పష్టం చేశాడు. నిజానికి ఈ ప్లాట్ ఫామ్ ద్వారానే సాధారణ నెటిజన్లు కూడా ఊహకందని విజువల్స్ ను క్రియేట్ చేస్తున్నారు. కానీ తాము మాత్రం ఈ ఏఐ వాడలేదని, వీఎఫ్ఎక్స్ పనుల్లో ప్రస్తుతం తాను బిజీగా ఉన్నట్లు చెప్పాడు.
"ఈ సినిమా కోసం మేము ఎన్నో సెట్స్, డిజైన్లు, వెహికిల్స్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. వాటిని ఊహించి, నిర్మించి, ఉపయోగించే వరకూ ఎంతో సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. ఒకవేల సోరా ఉపయోగించి ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ప్రాంప్ట్ చేస్తే చాలు. వీఎఫ్ఎక్స్ చేయాల్సిన అవసరం లేదు" అని నాగ్ అశ్విన్ అన్నాడు.
ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నామని, సింపుల్ గా ఓ ప్రాంప్ట్ తో చేసే పనే అయితే ఓ క్రియేటర్ గా మనం ఏం నిరూపించుకుంటామని ప్రశ్నించాడు. కల్కి 2898 ఏడీ మూవీ మే 9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ కు బాగా కలిసొచ్చిన తేదీ ఇది.