Kangana Fire on Brahmastra Makers: గ్యాప్ దొరికితే తాటా తీస్తున్న కంగనా.. బ్రహ్మాస్త్ర దర్శకుడిని జైల్లో పెట్టాలని ఫైర్!
10 September 2022, 11:47 IST
- Kangana Ranaut Fire on Brahmastra: బ్రహ్మాస్త్ర సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఆ చిత్ర దర్శకుడు అయన్ ముఖర్జిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడింది. 600 కోట్లు వృథా చేసినందుకు అతడిని జైలులో ఉంచాలని డిమాండ్ చేసింది.
బ్రహ్మాస్త్ర డైరెక్టర్‌పై కంగనా ఫైర్
Kangana Fire on Brahmastra Team: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కాస్త గ్యాప్ దొరికితే తాటా తీసేస్తుంది. నెపొటిజంపై చాలా రోజుల నుంచి విమర్శనాస్త్రాలను సంధిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బ్రహ్మాస్త్ర టీమ్‌పై విరుచుకుపడింది. రణ్‌బీర్ కపూ-ఆలియా భట్‌పై బహిరంగంగానే విమర్శించిన ఈ బ్యూటీ.. వీరు నటించిన బ్రహ్మాస్త్ర సినిమాపై తీవ్రంగా మండిపడింది. సోషల్ మీడియా వేదికగా వరుస పెట్టి ట్వీట్లు చేస్తూ బ్రహ్మాస్త్ నటీనటులు, డైరెక్టర్ ఒక్కరేంటి మొత్తం చిత్రబృందాన్ని టార్గెట్ చేస్తూ ఫైర్ అయింది.
కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విధంగా పోస్టు పెట్టింది.. "ప్రతి ఒక్కరూ అయ్యన్ ముఖర్జీ జీనియస్ అంటూ తెగపొగిడేస్తున్నారు. ముందు ఈ జీనియస్‌ను జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఈ సినిమా తీసేందుకు అతడికి 12 ఏళ్లు పట్టింది, 14 మంది సినిమాటోగ్రాఫర్లను మార్చాడు, 400 రోజులకు పైగా షూట్ చేశాడు, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను మార్చాడు, రూ.600 కోట్ల బడ్జెట్‌ను సినిమా కోసం తగలబెట్టాడు." అంటూ సినిమాపై వచ్చిన నెగటివ్ రివ్యూ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది.
అంతటితో ఆగకుండా.. "ఓ అబద్దాన్ని అమ్మాలనుకుంటే ఇలాగే జరుగుతుంది. కరణ్ జోహార్ ప్రతి షోలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అయ్యన్ ముఖర్జిని జీనియస్‌లు అంటూ తెగ పొగిడేస్తూ ఉంటాడు. నిదానంగా అతడు కూడా ఇది అబద్ధమని నమ్ముతున్నాడు. తన జీవితంలో ఒక్క మంచి సినిమా కూడా తీయని కరణ్ జోహార్.. 600 కోట్లు ఖర్చు పెట్టేసరికి నమ్మడం ప్రారంభించాడు. ఈ సినిమాకు ఫాక్స్ స్టూడియో కూడా ఆర్థిక సహకారం అందించడం బాధాకరం. ఇలాంటి జోకర్ల వల్ల ఎన్ని స్టూడియోలు మూత పడాలి." అంటూ కంగనా నిప్పులు చెరిగింది.
కరణ్ జోహార్‌పై తీవ్రంగా విమర్శలు చేసింది కంగనా.. "కరణ్ జోహార్ లాంటి వ్యక్తుల ప్రవర్తనను తప్పకుండా ప్రశ్నించాలి. స్క్రిప్టుల కంటే కూడా ఒకరి లైంగిక జీవితంపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటాడు. అతడు స్వయంగా.. రివ్యూలు, స్టార్లను, ఫేక్ కలెక్షన్లన నెంబర్లను, టికెట్లను కొనుగోలు చేస్తాడు. ఈ సారి సౌత్ వేవ్‌ను ఉపయోగించుకోవాలనుకున్నాడు. హిందూమతాన్ని, దక్షిణాది నటులను, రచయితలను డైరెక్టర్లను తన సినిమా కోసం వాడుకున్నాడు. వారు కూడా ఆయన కోసం బాగా కష్టపడ్డారు. కానీ సమర్థులైన రచయితలు, దర్శకులు, నటులు, ఇతర ప్రతిభను తీసుకోరు." అంటూ కంగనా కరణ్ జోహార్‌పై విమర్శనాస్త్రాలను సంధించింది. బ్రహ్మాస్త్ర చిత్రాన్ని డిజాస్టర్‌గా అభివర్ణించిన కంగనా.. భారత్‌లో మూవీ మాఫియా.. స్టూడియోలు మూతపడటానికి కారణమవుతోందని స్పష్టం చేసింది.
రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ తొలిసారిగా కలిసి నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాల ఇతిహాసాల ఆధారంగా దర్శకుడు అయ్యన్ ముఖర్జి తెరకెక్కించారు. నరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, బ్రహ్మాస్త్రలకు సంబంధించిన పురాణ గాథలు, వాటి శక్తిని గురించి ఈ సినిమాలో వివరించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా సెప్టెంబరు 9న విడుదలైంది.