Hrithik Roshan Angry Video Viral: అభిమానిపై హృతిక్ ఆగ్రహం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
10 September 2022, 10:51 IST
- Hrithik Roshan Angry Video: హృతిక్ రోషన్ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో సెల్ఫీ దిగాలని తోసుకుంటూ వచ్చిన అభిమానిపై కోపాన్ని చూపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హృతిక్ రోషన్ ఆగ్రహం
Hrithik Roshan angry on Fan: హీరోలు కనిపిస్తే.. ఎలాగైనా వారితో ఫొటో దిగాలని ఇప్పుడైతే ఓ సెల్ఫీ తీసుకోవాలని లేదా ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఎవ్వరైనా ఆశపడతారు. ఇందుకోసం మధ్య అడ్డుగా ఉన్న సెక్యూరిటీని కూడా దాటుకుని కష్టపడి హీరోలతో సెల్ఫీ తీసుకోవాలని ఆశపడుతుంటారు అభిమానులు. కొన్నిసార్లు ఈ అత్యుత్సాహం వల్ల వారికే ప్రమాదం జరిగే అవకాశముంది. సదరు హీరోలకు కూడా దీని వల్ల అసౌకర్యం కలగవచ్చు. ఫలితంగా కొంతమంది ఓర్పు నశించి అభిమానులపై ఆగ్రహం వెల్లగక్కడమో లేదా కొన్నిసార్లు ఫ్యాన్స్‌పై చేతివాటం చూపించిన దాఖలాలు కూడా లేకపోలేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌కు ఇలాంటి ఘటనే ఎదురైంది. అభిమానికి కొట్టలేదు కానీ.. కోపగించుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం నాడు హృతిక్ రోషన్.. రణ్‌బీర్ కపూర్-ఆలియా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాకు తన పిల్లలతో కలిసి ఓ మల్టిప్లెక్స్‌కు విచ్చేశారు. సినిమా చూసి తిరిగి కారు వద్దకు వెళ్లే సమయంలో అకస్మాత్తుగా ఓ అభిమాని హృతిక్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆవేశంగా అందర్నీ తోసుకుని రావడంతో అసౌకర్యంగా ఫీలైన హీరో.. అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అతడిని తిట్టేంత వరకు వెళ్లారు. అయితే ఈ లోపే సెక్యూరిటీ సిబ్బంది అభిమానిని హృతిక్‌కు దూరంగా లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
ఈ వీడియో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలతో బయటకు వచ్చినప్పుడు హీరోల ప్రైవసీకి భంగం కలిగించకూడదంటూ ఒకరు కామెంట్ పెట్టారు. బాలీవుడ్ యాక్టర్లు ఆటిట్యూడ్ ఇలాగే ఉంటుందని, అందుకే బాలీవుడ్ సినిమాలను బాయ్‌కాట్ చేయాలని ఇంకొకరు స్పందించారు. అయితే ఫ్యాన్ మరీ కఠినంగా ప్రవర్తించాడని మరొకరు పోస్ట్ పెట్టారు.
త్వరలో హృతిక్ రోషన్ విక్రమ్ వేద సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రంలో హృతిక్‌తో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమాలో సైఫ్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా చేస్తోంది. వీరు కాకుండా రోహిత్ సరఫ్, యోగితా బిహానీ, షరీబ్ హష్మి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. వైనాట్ స్టూడియోస్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, టీ సిరీస్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై పుష్కర్-గాయత్రి తెరకెక్కిస్తున్నారు. నీరజ్ పాండే స్క్రీన్ ప్లే రాస్తున్నారు. సెప్టెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.