Jubilee Web Series Review: సినిమా రాజకీయాలను కళ్లకు కట్టిన జూబ్లీ.. మస్ట్ వాచ్ వెబ్ సిరీస్
17 April 2023, 17:24 IST
- Jubilee Web Series Review: సినిమా రాజకీయాలను కళ్లకు కట్టింది జూబ్లీ వెబ్ సిరీస్. ఇదొక మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది.
జూబ్లీ వెబ్ సిరీస్ లో అదితి రావ్ హైదరీ, అపర్‌శక్తి ఖురానా
Jubilee Web Series Review: సినిమా అంటే ఓ రంగుల ప్రపంచం. కానీ ఆ రంగుల వెనుక ఉన్న రాజకీయాల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ఆ ప్రయత్నమే చేసింది ఈ జూబ్లీ వెబ్ సిరీస్ (Jubilee Web Series). దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో, ఇండియన్ సినిమా గోల్డెన్ ఎరాగా భావిస్తున్న కాలంలో, ఓ స్టార్ కోసం వెతుకుతున్న స్టూడియో యజమాని, ఆ స్టార్ స్టేటస్ కోసం పరితపిస్తున్న ఆ స్టూడియోలోనే పని చేసే ఓ సాధారణ మేనేజర్, స్టార్ హీరోయిన్ అయిన ఆ స్టూడియో యజమాని భార్య, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎదగాలని భావిస్తున్న ఓ యువకుడు.. వీళ్ల చుట్టూ తిరిగే కథే ఈ జూబ్లీ.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెండు భాగాలుగా ఈ సిరీస్ రిలీజైంది. తొలి భాగం ఐద ఎపిసోడ్లతో ఏప్రిల్ 7న, రెండో భాగం మరో ఐదు ఎపిసోడ్లతో ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యాయి. బాలీవుడ్ లో ఉడాన్, లుటేరాలాంటి సినిమాలతోపాటు నెట్‌ఫ్లిక్స్ లో సేక్రెడ్ గేమ్స్ లాంటి వెబ్ సిరీస్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానీ ఈ జూబ్లీ సిరీస్ (Jubilee Web Series)కు డైరెక్టర్ గా వ్యవహరించాడు.
జూబ్లీ నటీనటులు: అదితి రావ్ హైదరీ, అపర్‌శక్తి ఖురానా, ప్రసేన్‌జిత్ ఛటర్జీ, వామికా గబ్బి, సిద్ధాంత్ గుప్తా, రామ్ కపూర్, శ్వేతా బసు ప్రసాద్
క్రియేటర్ అండ్ డైరెక్టర్: విక్రమాదిత్య మోత్వానీ
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్స్: మొత్తం 10 ఎపిసోడ్లు, ఒక్కొక్కటి సుమారు 50 నిమిషాలు
జూబ్లీ (Jubilee Web Series) కథేంటి?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947లో ఇండియన్ సినిమాకు గోల్డెన్ ఎరాగా భావించే కాలంలో.. దేశ విభజన, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ జూబ్లీ సిరీస్ తెరకెక్కింది. రాయ్ టాకీస్ అనే ఫిల్మ్ స్టూడియో యజమాని శ్రీకాంత్ రాయ్ (ప్రసేన్‌జిత్ ఛటర్జీ).. తన కలల హీరో మదన్ కుమార్ వేటలో ఉంటాడు. దాని కోసం జంషేద్ ఖాన్ అనే ఆర్టిస్ట్ ను ఆడిషన్ చేసి సెలక్ట్ చేస్తాడు. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టూడియో యజమాని భార్య, స్టార్ హీరోయిన్ సుమిత్రా కుమారి (అదితి రావ్ హైదరీ) అదే జంషేద్ ఖాన్ తో కలిసి ముంబై నుంచి లక్నోకు పారిపోతుంది.
అయితే ఆ మదన్ కుమార్ గా తాను ఎదగాలని చూస్తున్న అదే స్టూడియోలో పని చేసే మేనేజర్ బినోద్ దాస్ (అపర్‌శక్తి ఖురానా)కు ఆ ఇద్దరినీ తిరిగి స్టూడియోకు తీసుకువచ్చే బాధ్యతను శ్రీకాంత్ రాయ్ అప్పగిస్తాడు. కానీ వారిద్దరూ కరాచీ పారిపోవాలని నిర్ణయించుకుంటారు. నాటకీయ పరిణామాల మధ్య జంషేద్ ఖాన్ చనిపోతాడు. ఒంటరిగా ముంబైకి తిరిగి వచ్చి, తనలోని నటుడిని శ్రీకాంత్ రాయ్ కి పరిచయం చేసి మదన్ కుమార్ రూపంలో స్టార్ హీరోగా ఎదుగుతాడు బినోద్ దాస్. అది నచ్చని సుమిత్రా దేవి.. బినోద్ దాస్ ను పడగొట్టే ఎత్తులు వేస్తుంటుంది.
మరోవైపు దేశ విభజన కారణంగా పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చి క్యాంపుల్లో తలదాచుకుంటూ, ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎదగాలని చూస్తున్న జే ఖన్నా (సిద్ధాంత్ గుప్తా), వేశ్యా గృహాల్లో ఉంటూ క్రమంగా ఇండస్ట్రీలోని పెద్దలకు దగ్గరై స్టార్ హీరోయిన్ కావాలనుకునే నిలోఫర్ ఖురేషీ (వామికా గబ్బి)ల కథనూ దర్శకుడు మనసుకు హత్తుకునే రీతిలో చూపించాడు.
కోల్డ్ వార్ రాజకీయాలు
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా, రష్యా మధ్య జరుగుతున్న కోల్డ్ వార్.. అది ఇండియన్ సినిమాపై చూపించిన ప్రభావం.. వాటి తాలూకు తెర వెనుక రాజకీయాలు అప్పటి స్టార్ల కెరీర్ లను అర్ధంతరంగా ఎలా ముగించాయో కూడా ఈ సిరీస్ లో చూపించడం విశేషం.
సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కోసం, అలా స్టార్ గా ఎదిగిన వారిని పతనం దిశగా తీసుకెళ్లడానికి తెర వెనుక జరిగే రాజకీయాలను ఈ సిరీస్ లో కళ్లకు కట్టినట్లు చూపించడంలో డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానీ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
జూబ్లీ.. నటనే హైలైట్
సుమారు 10 గంటల పాటు ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎక్కడా బోర్ కొట్టకుండా, ఎంగేజింగ్‌గా సాగిపోతుందంటే దానికి కారణం నటీనటుల అద్భుతమైన నటనే. ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారు. మదన్ కుమార్ గా ఎదిగిన సాధారణ మేనేజర్ బినోద్ దాస్ పాత్రలో అపర్‌శక్తి ఖురానా ఇరగదీశాడు. ఆ బినోద్ దాస్ భార్య పాత్రలో శ్వేతా బసు ప్రసాద్ కనిపించింది.
సుమిత్రాకుమారి పాత్రలో అదితి రావ్ హైదరీ జీవించేసింది. జే ఖన్నాగా కనిపించే సిద్ధాంత్ గుప్తా నటన మొత్తం సిరీస్ కే హైలైట్. శ్రీకాంత్ రాయ్ గా కనిపించే ప్రసేన్‌జిత్ ఛటర్జీ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. రంగుల సినిమా ప్రపంచం తెర వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ సిరీస్ ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.