Kcr Movie OTT: ఓటీటీలోకి వస్తోన్న కేసీఆర్ మూవీ - జబర్ధస్త్ రాకింగ్ రాకేష్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
19 December 2024, 14:58 IST
Kcr Movie OTT: జబర్ధస్థ్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. కేసీఆర్ మూవీకి గరువ వేగ అంజి దర్శకత్వం వహించాడు.
కేసీఆర్ మూవీ ఓటీటీ
Kcr Movie OTT: రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ మూవీ తొందరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. కేసీఆర్ మూవీ సక్సెస్ మీట్ ఇటీవల జరిగింది. ఈ సక్సెస్ మీట్‌లో కేసీఆర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను రాకింగ్ రాకేష్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేశాడు. రిలీజ్ డేట్ మాత్రం వెల్లడించలేదు. డిసెంబర్ నెలాఖరున లేదా జనవరి ఫస్ట్ వీక్‌లో కేసీఆర్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సీఏం కేసీఆర్
కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నిక అయిన పరిణామాలకు లండాడీ యువకుడి జర్నీని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.
సత్య కృష్ణన్ తనయ...
కేసీఆర్ మూవీతో నటి సత్య కృష్ణన్ తనయ అనన్య కృష్ణన్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎమోషనల్ డ్రామా మూవీలో హీరోగా నటిస్తూనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు రాకింగ్ రాకేష్.
అంతే కాకుండా ఈ సినిమాకు కథను, స్క్రీన్‌ప్లేను సమకూర్చాడు. నవంబర్ నెలాఖరున థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమాలో రాకింగ్ రాకేష్ సతీమణి జోర్దార్ సుజాత ఓ కీలక పాత్రలో కనిపించింది. మైమ్‌మధు, తాగుబోతు రమేష్, తనికెళ్ల భరణితో పాటు పలువురు కమెడియన్లు ముఖ్య పాత్రలు పోషించారు.
కేసీఆర్ కథ ఇదే…
తెలంగాణ ఉద్యమం కొనసాగుతోన్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలు విని అతడికి అభిమానిగా మారిపోతాడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్). ఊరివాళ్లంతా కేశవ చంద్రరమావత్‌ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్య కృష్ణన్) ఇష్టపడుతుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు.
తన పెళ్లి అభిమాననాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని కలలు కంటాడు. కేసీఆర్‌ను కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది. కేశవ చంద్ర రమావత్ కేసీఆర్‌ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యను కేశవ చంద్ర రమావత్ ఎలా పరిష్కరించాడు? మరదలి ప్రేమను అర్థం చేసుకున్నాడా ? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
కేసీఆర్ మూవీకి పార్ట్ 2
కేసీఆర్ సక్సెస్ మీట్ లో హీరో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. “కేసీఆర్ మూవీ ఆలోచనని ఓ మిత్రుడికి చెప్పినప్పుడు అతడు ఇచ్చిన సమాధానం, నాకు ఎదురైన బాధ, అవమానం నుంచి వచ్చిన కసితోనే ఈ మూవీ చేశాను. జబర్ధస్థ్ రాఘవ లేకపోతే ఈ మూవీ లేదు. నా భార్య సుజాత కారణంగానే నేను ఈరోజు ఈ వేదికపై ఉన్నాను. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సినిమా ఆహాలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. కేసీఆర్ మూవీకి పార్ట్ 2 కూడా ఉంటుంది” అని తెలిపాడు.
ప్రేమలు తరహాలో..
35 చిన్న కథ కాదు, మసూద, ప్రేమలు సినిమాల స్థాయిలోనే ఆహా ఓటీటీలో ఈ మూవీ ఆదరణను దక్కించుకుంటుందనే నమ్మకముందని ఆహా అక్విజిషన్స్ హెడ్ శ్రీనివాస్ కుమార్ అన్నాడు.