Irul Review: ఇరుళ్ రివ్యూ - ఫహాద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
12 September 2024, 6:09 IST
Irul Movie Review: ఫహాద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్, దర్శనా రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిర ఇరుల్ మూవీ ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మిస్టర్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
ఇరుల్ మూవీ రివ్యూ
Irul Review: ఫహాద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్, దర్శనా రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళం మూవీ ఇరుల్ ఇటీవల ఆహా తమిళ్ ఓటీటీలో రిలీజైంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించాడు. మూడు పాత్రలతోనే తెరకెక్కిన ఇరుల్ మూవీ ఎలా ఉందంటే?
సీరియల్ కిల్లర్ ఎవరు?
అలెక్స్ (సౌబిన్ షాహిర్) ఓ బిజినెస్‌మెన్. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ కంపెనీని రన్ చేస్తుంటాడు. రచయితగా తొలి ప్రయత్నంగా సైకో కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఇరుల్ పేరుతో థ్రిల్లర్ నవల రాస్తాడు. అర్చన ( దర్శనా రాజేంద్రన్) ఓ లాయర్. హైకోర్టు లో సీనియర్ అడ్వకేట్ దగ్గర పనిచేస్తుంటుంది.
వర్క్ పరంగా ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అర్చనను ప్రేమించిన అలెక్స్ సర్‌ప్రైజ్ వీకెండ్‌ట్రిప్ ప్లాన్ చేస్తాడు. ఆ ట్రిప్‌లోనే అర్చనకు ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు. ట్రిప్‌లో తమ వెంట ఫోన్స్ తీసుకెళ్లవద్దని కండీషన్ పెట్టుకుంటారు అలెక్స్, అర్చన. \\
ట్రిప్‌లో కొండ ప్రాంతంలో అనుకోకుండా అలెక్స్ కారు ట్రబుల్ ఇస్తుంది. వర్షం పడుతుండటంతో సహాయం కోసం దగ్గరలోని ఇంటికి వెళతారు. ఆ ఇంట్లో ఉన్ని (ఫహాద్ ఫాజిల్) ఒంటరిగా ఉంటాడు. అక్కడ ఓ మహిళ డెడ్‌బాడీ అలెక్స్‌కు కనిపిస్తుంది. తన నవలలో రాసిన విధంగానే సీరియల్ కిల్లర్ ఆమెను చంపిన ఆనవాళ్లు ఉంటాయి. ఉన్నినే ఈ హత్య చేశాడని అలెక్స్ అతడిని బంధిస్తాడు.
అదే టైమ్‌లో అలెక్స్ గురించి పలు సీక్రెట్స్ ఉన్ని ద్వారా అర్చనకు తెలుస్తాయి. ఆ ఇళ్లు అలెక్స్‌దేనని కూడా బయటపడుతుంది. అలెక్స్ ఆ మహిళను హత్య చేశాడని ఉన్ని వాదిస్తాడు. అలెక్స్, ఉన్నిలలో అసలు సీరియల్ కిల్లర్ ఎవరు? అలెక్స్ గురించి అర్చన తెలుసుకున్న నిజాలేమిటి? సీరియల్ కిల్లర్ బారి నుంచి ప్రాణాలతో అలెక్స్, అర్చన బయటపడ్డారా? అర్చనకు ఉన్ని ఎలాంటి ట్విస్ట్ ఇచ్చాడు? అన్నదే ఇరుల్ మూవీ కథ.
మూడు క్యారెక్టర్స్‌తో మాత్రమే...
ఇరుల్ కేవలం మూడు పాత్రలతో ఒకే ఇంట్లో ప్రయోగాత్మకంగా సాగే సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఓ ప్రేమజంట జీవితంలోని అనుకోకుండా ఓ సీరియల్ కిల్లర్ ఎలా వచ్చాడు?అబద్ధానికి, నిజానికి మధ్య నెలకొన్న సంఘర్షణలో ఆ ప్రియురాలు ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందనే పాయింట్‌తో దర్శకుడు నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ ఇరుల్ మూవీని తెరకెక్కించాడు.
టాలెంటెడ్ యాక్టర్స్…
ఇరుల్ మూవీలో యాక్టింగ్ పరంగా వంక పెట్టడానికి ఏం లేదు. ముగ్గురు టాలెటెండ్ యాక్టర్స్ చివరి సీన్ వరకు ఒకరితో మరొకరు పోటీపడి నటించారు. టెక్నికల్‌గా సౌండ్ డిజైనింగ్, విజువల్స్‌తోనే దర్శకుడు చాలా చోట్ల భయపెట్టాడు. కానీ ప్రధానమైన కథ విషయంలోనే దర్శకుడు తడబడిపోయాడు.
ఒకే లొకేషన్‌లో పరిమిత పాత్రలతో థ్రిల్లర్ మూవీ ద్వారా ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. కథ దగ్గర ఎంత వర్క్ చేస్తే అవుట్‌పుట్ అంత బాగుంటుంది. కానీ ఇరుల్ మూవీలో దర్శకుడు రాసుకున్న ఒకటి రెండు ట్విస్ట్‌లు మినహా మిగిలినవి వర్కవుట్ కాలేకపోయాయి. మెయిన్ డ్రామా చాలా వరకు కన్ఫ్యూజింగ్‌గా సాగుతుంది. చాలా వరకు డైలాగ్స్‌తోనే కథను నడిపించడం బోరింగ్‌గా అనిపిస్తుంది.
ఊహించని మలుపు...
అలెక్స్, అర్చన పాత్రల పరిచయంతోనే సినిమా మొదలవుతుంది. వారి ట్రిప్ ప్లానింగ్, అనుకోకుండా కారు ట్రబుల్ ఇవ్వడంతో ఓ అపరిచిత వ్యక్తి ఇంటికి వారు వెళ్లడం వరకు సినిమా రొటీన్‌గా సాగుతుంది. అలెక్స్ రాసిన నవల గురించి ఉన్ని అతడితో డిస్కస్ చేసే సీన్స్ సైకాలజీ క్లాస్‌ను తలపిస్తాయి.
ఎప్పుడైతే ఆ ఇంట్లో డెడ్‌బాడీ దొరుకుతుందో అక్కడి నుంచే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఉన్నిని సీరియల్ కిల్లర్‌గా అలెక్స్ వాదించడం, అలెక్స్‌కు సంబంధించిన ఒక్కో సీక్రెట్‌ను ఉన్ని బయటపెడుతూ ఇంట్రెస్టింగ్‌గా దర్శకుడు కథను నడిపించాడు.
అలెక్స్‌ను నమ్మి అతడితో వచ్చిన అర్చన...లవర్‌నే సీరియల్ కిల్లర్‌గా ఊహించుకునే సీన్స్ ఉత్కంఠను పంచుతాయి. సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌తో దర్శకుడు సినిమాను ఎండ్ చేశాడు.
లుక్, మ్యానరిజమ్స్...
ఉన్ని పాత్రలో ఫహాద్ ఫాజిల్ అదరగొట్టాడు. లుక్, మ్యానరిజమ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అమాయకంగా కనిపిస్తూనే తన క్యారెక్టర్‌లో భిన్నమైన వేరియేషన్స్ చూపించాడు. అలెక్స్, అర్చన పాత్రల్లో సౌబీన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ నాచురల్ పర్ఫార్మెన్స్‌ను కనబరిచారు. నిజాన్ని నిరూపించడం కోసం తాపత్రయపడే రచయితగా సౌబీన్ షాహిర్, అబద్ధానికి, నిజానికి మధ్య నలిగిపోయే యువతి పాత్రలో దర్శనా రాజేంద్రన్ జీవించింది.
థ్రిల్లర్ మూవీ లవర్స్ కోసం...
ఇరుల్ థ్రిల్లర్ మూవీ లవర్స్‌ను మెప్పించే ప్రయోగాత్మక మూవీ. ఫహాద్ ఫాజిల్, దర్శనా రాజేంద్రన్‌తో పాటు సౌబిన్ షాహిర్ యాక్టింగ్ కోసం మూవీ చూడొచ్చు. సినిమా నిడివి గంటలన్నర మాత్రమే.