ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో థ్రిల్లర్ జానర్ చిత్రాలకు చాలా క్రేజ్ ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో ఓటీటీ కోసమే ప్రత్యేకంగా కొన్ని థిల్లర్ సినిమాలను మేకర్స్ రూపొందిస్తున్నారు. వీటిలో అధిక శాతం మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ వారం రెండు హిందీ థ్రిల్లర్ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీల్లోకి అడుగుపెడుతున్నాయి. సెక్టార్ 36, బెర్లిన్ చిత్రాలు థియేటర్లలో రాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఆ వివరాలివే..
క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘సెక్టార్ 36’ ఈ శుక్రవారం (సెప్టెంబర్ 13) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాసే లీడ్ రోల్ చేశారు. వరుసగా పిల్లల కిడ్నాప్‍లు అవుతుండగా.. ఈ పోలీస్ ఆఫీసర్ ఈ కేసులను విచారించడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది.
సెక్టార్ 36 చిత్రానికి ఆదిత్య నంబల్‍కర్ దర్శకత్వం వహించారు. విక్రాంత్‍తో పాటు దీపక్ బోదిరియాల్, ఆకాశ్ ఖురానా, దర్శన్ జరివాలా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకోవటంతో క్యూరియాసిటీ నెలకొంది.
సెక్టార్ 36 చిత్రాన్ని మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియోస్టూడియోస్ పతాకాలపై దినేశ్ విజియన్, జ్యోతి దేశ్‍పాడే నిర్మించారు. ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ చిత్రానికి పని చేశారు. సెప్టెంబర్ 13 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సెక్టార్ 36 మూవీ చూడొచ్చు. హిందీతో పాటు తెలుగు, మరో మూడు భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది.
అపర్‌శక్తి ఖురానా ప్రధాన పాత్ర పోషించిన బెర్లిన్ సినిమా సెప్టెంబర్ 13వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ స్పై యాక్షన్ మూవీకి అతుల్ సబర్వాల్ దర్శకత్వం వహించారు. బధిరుడైన ఓ యువకుడిని విదేశీ గూఢచారి అని ఓ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అదుపులోకి తీసుకొని విచారించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. అయితే, అతడిని ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఓ సైన్ లాంగ్వేజ్ నిపుణుడిని తీసుకురావటంతో ఓ ట్విస్ట్ ఉంటుందని ట్రైలర్ ద్వారా తెలిసింది.
బెర్లిన్ చిత్రంలో ఖురానాతో పాటు ఇష్వాక్ సింగ్, రాహుల్ బోస్, అనుప్రియ గోయెంక, కబీర్ బేడీ కీరోల్స్ చేశారు. ఈ మూవీని జీ స్టూడియోస్, యిప్పీ కీ యాయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై మానవ్ శ్రీవాత్సవ్, ఉమేశ్ భన్సాల్ నిర్మించారు. 2023లోనే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్‍ఏంజిల్స్, జియో మామీ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‍లో ఈ మూవీ ప్రదర్శన జరిగింది. ఇప్పుడు నేరుగా బెర్లిన్ చిత్రం జీ5 ఓటీటీటో సెప్టెంబర్ 13న అడుగుపెట్టనుంది.
నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ వారం తెలుగు సినిమాలు మిస్టర్ బచ్చన్, ఆయ్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఈ రెండు సినిమాలు రేపు (సెప్టెంబర్ 12) స్ట్రీమింగ్‍కు వస్తాయి. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ థియేటర్లలో డిజాస్టర్ అవగా.. తక్కువ బడ్జెట్‍తో వచ్చి బ్లాక్‍బస్టర్ కొట్టింది ఆయ్. ఈ చిత్రాలు థియేటర్లలో ఆగస్టు 15న రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ సెప్టెంబర్ 12న ఒకే రోజు స్ట్రీమింగ్‍కు రానున్నాయి.