Highest Paid TV Actor: మద్యానికి బానిస.. బుల్లితెర అమితాబ్ బచ్చన్‌గా పేరు.. అత్యధిక పారితోషికం అందుకున్న టీవీ నటుడు
24 May 2024, 14:11 IST
Highest Paid TV Actor Ronit Roy As Aamir Khan Bodyguard: ఒకప్పుడు మద్యానికి బానిసై, బార్‌టెండర్‌గా పనిచేసి ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న టీవీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రోనిత్ రాయ్. అలాగే అమీర్ ఖాన్‌కు బాడీగార్డ్‌గా చేసిన రోనిత్ రాయ్ సినీ కెరీర్ విశేషాల్లోకి వెళితే..
మద్యానికి బానిస.. బుల్లితెర అమితాబ్ బచ్చన్‌గా పేరు.. అత్యధిక పారితోషికం అందుకున్న టీవీ నటుడు
Highest Paid TV Actor Ronit Roy Worked As Bartender: ప్రస్తుతం స్టార్ హీరోలుగా క్రేజ్ ఉన్న షారుక్ ఖాన్, చిరంజీవి, రజనీకాంత్ తదితరుల జీవితం అంత ఈజీగా సాగలేదని తెలిసిందే. ఈ స్టార్‌డమ్ రావడానికి ముందు వాళ్లు ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలా ఎన్నో సమస్యలను అధిగమించి ఇప్పుడు బుల్లితెర అమితాబ్ బచ్చన్ అని పిలిపించుకుంటున్న నటుడు రోనిత్ రాయ్.
లైగర్ మూవీలో విజయ్ దేవరకొండకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించే గురువు పాత్ర చేసిన రోనిత్ రాయ్ జీవితం సవ్యంగా సాగలేదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆయన ఒకప్పుడు నిరాశ్రయుడిగా నిలిచారు. మద్యానికి బానిసై డబ్బు మొత్తాన్ని కోల్పోయారు. అలాంటి ఆయన ఇప్పుడు విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నారు. అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా క్రేజ్ తెచ్చుకున్నారు.
రోనిత్ రాయ్ తన జేబులో ఉన్న కేవలం 6 రూపాయలతో ముంబైకి వచ్చి హోటల్ సీ రాక్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరారు. అలాగే బార్‌టెండర్‌గా పని చేశాడు. గిన్నెలు కడగడం, టేబుల్స్ శుభ్రం చేయడం వంటివి చేసేవాడు. కానీ, ఆయనకు ఆ జీవితం నచ్చలేదు. పైకి ఎదగాలనుకున్నారు.
1992లో జాన్ తేరే నామ్ సినిమాతో తన నటనా రంగ ప్రవేశం చేశారు రోనిత్ రాయ్. అయితే ఆర్మీ వంటి పెద్ద చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా విజయం సాధించలేకపోయాడు. 90వ దశకం చివరి నాటికి, అతని కెరీర్ నిలిచిపోయింది. అంతేకాకుండా మితిమీరిన మద్యపానం, చెడు ఆర్థిక నిర్ణయాల కారణంగా తన జీవితం బ్యాడ్ టర్న్ తీసుకుందని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"ఎవరూ నాకు సహాయం చేయలేదు. నాకు చాలా కాలంగా ఇల్లు కూడా లేదు. నేను కారులో పడుకునేవాన్ని. ఒక పెద్ద సూట్‌కేస్ ఉండేది. అందులోనే నా దుస్తులన్నీ పెట్టుకునేవాన్ని. నేను ఇంతకు ముందు నివసించే ప్రదేశాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే నేను అంత రెంట్ చెల్లించే స్థితిలో లేను. ఒకరి ఇంటికి వెళ్లి దయచేసి నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని అడగలేను. అది చాలా సిగ్గుగా అనిపిస్తుంది" అని రోనిత్ రాయ్ తెలిపారు.
"జూహులోని హోటళ్లలో క్రమం తప్పి ఉంటూ పబ్లిక్ టాయిలెట్స్‌లో ఫ్రెష్ అప్ అయి షూట్స్‌కు వెళ్లేవాన్ని" అని చెప్పారు రోనిత్ రాయ్. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌కు రోనిత్ రాయ్ రెండేళ్లు బాడీగార్డ్‌గా చేయడంపై కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. "నాకు దీని గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను వాళ్ల పేరును పబ్లిసిటీ కోసం తీసుకొస్తున్నాను అని అనుకుంటారు. కానీ, ఆ రెండేళ్లు నా జీవితంలో అతి ముఖ్యమైన రోజులు. ఆమీర్ ఖాన్ చాలా హార్డ్ వర్క్ పర్సన్" అని రోనిత్ రాయ్ తెలిపారు.
ఇక 2000 సవంత్సరం ప్రారంభంలో రోనిత్ రాయ్ కసౌతి జిందగీ కే. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ వంటి సీరియళ్లతో చాలా పాపులర్ అయ్యారు. ఆ సీరియల్స్ అతనికి టెలివిజన్‌లో స్టార్‌గా నిలబెట్టాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, రోనిత్ 2000ల మధ్యలో ప్రతి ఎపిసోడ్‌కు రూ. 50,000 లు వసూలు చేసేవారట. తద్వారా దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటుడిగా రోనిత్ నిలిచాడు. ఆ తర్వాత అదాలత్ షోతో కూడా మనసు గెలుచుకున్నాడు. ఒకప్పుడు ఆయనను బుల్లితెర బిగ్ బి అని పిలిచేవారు.
2010లో రోనిత్ రాయ్ ఉడాన్ చిత్రంలో నటించాడు. ఇది రోనిత్ రాయ్‌ను వెండితెరపై నిలబెట్టిన సినిమా. పలు మీడియా రిపోర్ట్స్ ప్రకారం రోనిత్ రాయ్ ప్రస్తుతం టీవీ షోలకు ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 1.25 లక్షలు, రూ. 1 కోటి వరకు వసూలు చేస్తారని సమాచారం. ఇక రోనిత్ రాయ్ 2 స్టేట్స్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, బాస్, కాబిల్ వంటి అనేక హిట్ చిత్రాలలో నటించారు. తెలుగులో లైగర్ చేశారు.