Guppedantha Manasu August 19th Episode: గుప్పెడంత మనసు - వసుతో రిషి రొమాన్స్ - మహేంద్రపై గన్ గురిపెట్టిన మను
19 August 2024, 7:39 IST
Guppedantha Manasu August 19th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 19 ఎపిసోడ్‌లో మను, మహేంద్ర తండ్రీకొడుకులు అనే నిజం భర్త రిషికి చెబుతుంది వసుధార. వారి మాటలను చాటి నుంచి మహేంద్ర వింటాడు. రిషి తన కన్నకొడుకు అనే నిజం తెలిసి షాకవుతాడు.
గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 19 ఎపిసోడ్
Guppedantha Manasu August 19th Episode: రిషి నిద్రపోకుండా లాన్‌లో నిల్చొని సీరియస్‌గా ఆలోచిస్తుంటాడు. ఏం ఆలోచిస్తున్నారు...సరోజ గురించేనా అని వసుధార అనుమానంగా రిషిని అడుగుతుంది. సరోజ గురించి నేను ఎందుకు ఆలోచిస్తానని రిషి బదులిస్తాడు. ఈ మధ్యనాకంటే నువ్వే ఎక్కువగా సరోజ గురించి ఆలోచిస్తున్నావని వసుధారపై సెటైర్ వేస్తాడు రిషి. అన్నయ్య గురించి ఆలోచిస్తున్నానని వసుధారతో అంటాడు రిషి.
వసుధారపై అనుమానం…
ఎప్పుడు ఎండీ సీట్ గురించి ఆలోచించే అన్నయ్య బోర్డ్ మీటింగ్‌కు ఎందుకు టైమ్‌కు రాలేదన్నది అర్థం కావడం లేదని రిషి అంటాడు. ఆ రోజు అందరి కంటే ముందే కాలేజీకి వెళ్లిన అన్నయ్య మీటింగ్‌కు ఆలస్యంగా రావడం వెనుక నీ ప్రమేయం ఏమైనా ఉందా అని వసుధారపై అనుమానం వ్యక్తం చేస్తాడు రిషి.
భర్త మాటలతో వసుధార అలుగుతుంది. మీ అన్నయ్య ప్రాబ్లెమ్స్ సృష్టిస్తాడు తప్ప సమస్యల్లో ఇరుక్కోడని అంటుంది. అయినా తాను ఉదయం నుంచి మీ వెంటే ఉన్నానని, తనకు ఏ సంబంధం లేదని వసుధార అంటుంది.
రిషి కోసం స్వీట్...
రిషి కోసం రసగుల్లా తీసుకొస్తుంది వసుధార. చేతికి అందించడం కాదు...తినిపించమని ప్రేమగా అడుగుతాడు రిషి. అలాగే చేస్తుంది వసుధార. ఆ తర్వాత అదే స్పూన్‌తో వసుధారకు తినిపిస్తాడు రిషి. ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటూ రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఒకరి కళ్లల్లోకి మరొకరు చూస్తూ ఉండిపోతారు.
మను వేదన...
మరోవైపు తన కన్న తండ్రి మహేంద్రనే అనే నిజం పదే పదే మనును వేధిస్తుంటుంది. చాలా సార్లు కొడుకు అంటూ మహేంద్ర తనతో చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటాడు. నిజం తెలిసి తనను మభ్య పెట్టడానికే ఇన్నాళ్లు మంచిగా ఉన్నట్లు మహేంద్ర నటించాడని మను అపార్థం చేసుకుంటాడు.మహేంద్రను షూట్ చేయాలని ఆవేశంగా గన్ తీస్తాడు. అక్కడే మహేంద్ర ఫొటో కనిపించడంతో తన కోపం చల్లారడానికి మహేంద్ర ఫొటోను షూట్ చేయబోతాడు. కానీ మహేంద్రతో తనకు ఉన్న ఎమోషనల్ బాండ్ కారణంగా ఆ పని చేయలేకపోతాడు.
రక్త సంబంధమే కారణమా...
ఎందుకు మహేంద్ర ఫొటోను కూడా షూట్ చేయలేకపోతున్నాని మను అనుకుంటాడు. నువ్వే నా తండ్రివి అని తెలియక ముందు తండ్రిపై ఎంతో ద్వేషం పెంచుకున్నాను. ఎందుకు నాకు, మా అమ్మకు అన్యాయం చేశావని ప్రశ్నిద్దామని అనుకున్నాను.
మేము పడ్డ బాధలకు, అవమానాలకు బదులుగా ప్రాణాలు తీయాలనుకున్నా. ఇన్నాళ్లు ఆవేశంగా రగిలిపోయిన తాను ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నాను. ఎందుకు ఎమోషనల్ అవుతున్నాను...ఏ బంధం నన్ను వెనక్కి లాగుతుంది...రక్త సంబంధమేనా అని ఆలోచిస్తుంటాడు. మహేంద్రది నిజమైనా ప్రేమా...నటన తెలుసుకోవాలని నిశ్చయించుకుంటాడు.
దేవయాని స్కెచ్...
రిషి, వసుధారలను దెబ్బతీయడానికి మరో స్కెచ్ వేస్తారు దేవయాని శైలేంద్ర. తండ్రిపై మనుకు ఉన్న ద్వేషాన్ని పావుగా వాడుకోవాలని నిర్ణయించుకుంటారు. నిజం అందరికి తెలిసిన తర్వాత మను, మహేంద్ర ఒక్కటైతే ప్రమాదమని, మనును కాలేజీకి ఎండీగా ప్రకటించే ఆస్కారం ఉందని శైలేంద్ర అనుమానం వ్యక్తం చేస్తాడు. రిషిగా నాటకం ఆడుతుంది రంగానే తెలిస్తే ...మనునే ఇంటికి, కాలేజీకి వారసుడు అవుతాడని దేవయానితో అంటాడు శైలేంద్ర. అలా జరగడానికి వీలులేదని దేవయాని అంటుంది.
మనుకు తండ్రిపై ఉన్న ద్వేషం...
ఇన్నాళ్లు తండ్రి ప్రేమకు దూరమైన మనును...పూర్తిగా తండ్రికే దూరం చేసేందుకు ప్లాన్ వేస్తారు. మనులో తండ్రి మీద ఉన్న ద్వేషాన్ని ఇంకా రెచ్చగొట్టాలని ఫిక్సవుతారు. తండ్రి వల్ల మను పడ్డ బాధలు, కష్టాలు గుర్తుచేయడమే కాకుండా తండ్రి లేకపోవడం వల్ల తల్లితో పాటు తాను పడిన బాధలను కళ్లకు కట్టినట్లు మనుకు చూపించాలని అనుకుంటారు. అలా చేస్తే మహేంద్రను మను చంపేస్తాడు. మను జైలుకు వెళితే...రంగా సాయంతో కాలేజీని దక్కించుకోవచ్చని కొడుకుకు సలహా ఇస్తుంది దేవయాని.
వసుధార ఆటలో అరటిపండులాంటిదని, మధ్యలో మనింటికి వచ్చింది...మధ్యలోనే పోతుందని శైలేంద్రకు చెబుతుంది. వసుధార సంగతి తాను చూసుకుంటానని అంటుంది.
ధరణికి ఫోన్...
మరోవైపు బోర్డ్ మీటింగ్‌కు శైలేంద్ర ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి ధరణికి ఫోన్ చేస్తుంది వసుధార. బోర్డ్ మీటింగ్ రోజు దేవయాని చాలా టెన్షన్ పడ్డారని, ఏదో ఒక లెటర్ ఫొటో తీసి ఎవరికో పంపించిందని వసుధారకు ధరణి చెబుతుంది. మను వల్లే ఎండీ సీట్ చేజారిందని శైలేంద్ర ఏదో చెప్పబోతుండగా అత్తయ్య అడ్డుకుందని ధరణి అంటుంది.
వసుధార గిల్టీ ఫీలింగ్...
ధరణి మాటలతో మనకు తన తండ్రి ఎవరో తెలిసిపోయిందని వసుధార ఊహిస్తుంది. ఈ నిజం తెలిసి తాను కూడా ఏం చేయలేకపోతున్నానని, చివరకు రిషి దగ్గర కూడా రహస్యం దాచడం గిల్టీగా అనిపిస్తుందని వసుధార ఫీలవుతుంది. రిషి వెంటనే నిజం చెప్పాలని అనుకుంటుంది. రిషినే మహేంద్ర, మనులను కలుపుతాడని వసుధార అనుకుంటుంది.
రిషి ఓదార్పు...
వసుధార చాలా టెన్షన్‌గా కనిపించడంతో ఏమైందని వసుధారను అడుగుతాడు రిషి. నువ్వు ఇలా ఆందోళన పడుతుంటే చూడలేకపోతున్నానని రిషి అంటాడు. మౌనంగా ఉంటే సమస్యలు తీరవని చెబుతుంది. అనుపమను కలిసిన తర్వాతే అన్ని నిజాలు చెబుతానని రిషికి బదులిస్తుంది వసుధార.
అనుపమను కలవడానికి రిషి, వసుధార బయలుదేరుతారు. వారితో పాటు మహేంద్ర కూడా వస్తానని అంటాడు.. కానీ వసుధార మాత్రం వద్దని అంటుంది. మనం లేనప్పుడు మను, అనుపమనే డాడ్‌కు సపోర్ట్‌గా నిలబడ్డారని, వారిని కలవడానికి డాడ్ వస్తే ప్రాబ్లెమ్ ఏంటని వసుధారను అడుగుతాడు రిషి.
కానీ వసుధార సమాధానం చెప్పకుండా మనిద్దరమే వెళ్లాలని పట్టుపడుతుంది. దాంతో అనుపమ దగ్గరకు రావొద్దని తండ్రికి చెబుతాడు రిషి.
నిజం తెలుసుకున్న మహేంద్ర...
ఆ తర్వాత అనుపమను రిషి, వసుధార కలుస్తారు. మనుకు తన తండ్రి ఎవరో తెలియదని, అనుపమను ఎన్నిసార్లు అడిగినా ఆమెకు కొడుకుకు నిజం చెప్పలేకపోతుందని రిషితో అంటుంది వసుధార. మను తండ్రి మంచివాడు కాదా...దుర్మార్గుడా...అందుకే అతడి పేరు చెప్పలేకపోతున్నారా అని అనుపమను అడుగుతాడు రిషి. మను తండ్రి మహేంద్రనే అనే నిజం రిషికి చెబుతుంది వసుధార. రిషి వసుధారను ఫాలో అవుతూ వచ్చిన మహేంద్ర...వసుధార మాటలు విని షాకవుతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.