Gunde Ninda Gudi Gantalu: బాలు జాబ్ కష్టాలు - ఇంటి ఖర్చుల కోసం గాజులు తాకట్టు పెట్టిన మీనా - ప్రభావతి చిందులు
27 November 2024, 10:39 IST
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు నవంబర్ 27 ఎపిసోడ్‌లో పని కోసం బాలు చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఫైనాన్షియర్‌కు భయపడి బాలుకు జాబ్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. మరోవైపు ఇంటి ఖర్చులకు బాలు డబ్బు ఇవ్వకుండా వెళ్లడంతో ప్రభావతి మీనాను నానా మాటలు అంటుంది.
గుండెనిండా గుడి గంటలు నవంబర్ 27 ఎపిసోడ్
Gunde Ninda Gudi Gantalu: నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాతే కష్టాలు మొదలయ్యాయని మాటలతో మీనా మనసును గాయపరుస్తాడు బాలు. నువ్వు ఏదో ఒకటి దాచిపెట్టడం వల్లే ఈ సమస్యలన్నీ వచ్చాయని అంటాడు. సొంత కారు లేక, అద్దె కారు పోయి... రేపటి నుంచి ఏం చేయాలో తెలియడం లేదని అంటాడు.
కారు లేదని, ఇంటి ఖర్చులకు తాను డబ్బులు ఇవ్వలేనని తెలిస్తే ప్రభావతి ఊరుకోదని, టార్చర్ పెడుతుందని బాలు అంటాడు. మనోజ్ తనను ఎగతాళి చేస్తాడని కంగారు పడతాడు. తనకు పనిలేదనే విషయం ఇంట్లోవాళ్లకు మాత్రం చెప్పొద్దని మీనాకు వార్నింగ్ ఇస్తాడు బాలు. నేను రోడ్లు పట్టుకొని తిరుగుతున్నా విషయంనాన్నకు తెలిస్తే తట్టుకోలేరని బాలు అంటాడు.
బోడి సలహాలు అవసరం లేదు...
ఫైనాన్షియర్ దగ్గరకు వెళ్లి మరోసారి కారు ఇవ్వమని అడగండి అని బాలుతో అంటుంది మీనా. నీ బోడి సలహాలు నాకు అవసరం లేదని బాలు వెటకారంగా సమాధానమిస్తాడు. మీనా తల్లి పెట్టిన గోల్డ్ రింగ్ తీసి ఇచ్చేస్తాడు. మీ ఉంగరంనువ్వే ఉంచుకో...లేదంటే మీ పుట్టింట్లో ఇచ్చేయమని అంటాడు.
ఈ రోజు నిన్ను వెనకేసుకువచ్చానని సంబరపడిపోకు..మా నాన్న కోసమే అలా మాట్లాడానని చెబుతాడు. నిన్ను జీవితంలో క్షమించేది లేదని, ఇక నుంచి నీ పని నువ్వు చూసుకో...నా పని నేను చేసుకుంటానని చెబుతాడు.
దినేష్ టార్చర్...
రోహిణికి దినేష్ ఫోన్ చేస్తాడు. ఆమె అక్కడ లేకపోవడంతో మౌనిక లిఫ్ట్‌చేయబోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి...అది కస్టమర్ కేర్ నంబర్ అని అంటుంది. అది కస్టమర్ కేర్ నంబర్‌లా లేదని మౌనిక అనుమానంగా అడుగుతుంది. బ్యూటీ ప్రోడక్ట్స్ కొనమని కొందరు ఫోన్ చేస్తుంటారని రోహిణి తప్పించుకుంటుంది. అక్కడి నుంచి తన రూమ్‌కు వచ్చి ఆవేశంగా దినేష్‌కు ఫోన్ చేస్తుంది రోహిణి.
నాకున్న కోపానికి...
నాకు యాక్సిడెంట్ అయ్యిందని మా అమ్మకు ఎందుకు ఫోన్ చేశావని దినేష్‌ను నిలదీస్తుంది రోహిణి.నేను యాభై అడిగితే నువ్వు పాతికవేలు ఇస్తే ఇలాంటి పనులే చేస్తానని దినేష్ బదులిస్తాడు. డబ్బులు అడ్జెస్ట్ కావడం లేదని దినేష్‌ను బతిమిలాడుతుంది రోహిణి. నన్ను వేధించవద్దని అంటుంది.
నువ్వు నాకు చేసిన ద్రోహంతో పోలిస్తే ఇదేం పెద్దది కాదు...నాపై నీకు ఉన్న కోపానికి ఎప్పుడో మీ వాళ్లకు పట్టించేవాడిని. కానీ నువ్వో బంగారుబాతువని అర్థమై ఇలా వాడుకుంటున్నానని రోహిణితో అంటాడు దినేష్. నాకో డెబ్భై ఐదు వేలు కావాలని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
జాబ్ ఇవ్వలేను...
జాబ్ కోసం ట్రావెల్స్ నడిపే వ్యక్తిని కలుస్తాడు బాలు. నువ్వు ఖచ్చితమైన మనిషివి అని తెలుసు...కానీ నీకు నేను పని ఇవ్వలేనని బాలుతో అంటాడు ఆ వ్యక్తి. నువ్వు తొందరపడి ఫైనాన్షియర్‌పై చేయి చేసుకున్నావని, కోపం మనిషికి మంచి చేయలేదని క్లాస్ ఇస్తాడు. ట్రావెల్ యూనియన్‌కు ఆ ఫైనాన్షియర్ జనరల్ సెక్రటరీ అని, నీకు పని ఇవ్వొద్దని అన్ని ఏజెన్సీలకకు అతడు ఫోన్ చేసి చెప్పాడని బాలుతో ట్రావెల్స్ వ్యక్తి చెబుతాడు..
అతడి దగ్గరే నేను ఫైనాన్స్ తీసుకున్నానని, నీకు పని ఇస్తే అతడు నా కార్లు మొత్తం పట్టుకెళ్లిపోతాడని ట్రావెల్స్ వ్యక్తి భయపడతాడు. అతడే కాదు ఫైనాన్షియర్‌కు భయపడి బాలుకు ఉద్యోగం ఇవ్వడానికి చాలా మంది వెనకడుగువేస్తారు.
ప్రభావతి ఫైర్...
మీనా ఇంటి పనులు చేస్తోండగా...ప్రభావతికి ఫోన్ వస్తుంది. మీనా పట్టించుకోనట్లుగా ఉంటుంది. ఫోన్ వస్తే చెప్పొచ్చుగా మీనాకు క్లాస్ ఇస్తుంది. బాలు ఎక్కడికి వెళ్లాడని, ఎప్పుడొస్తాడని మీనాను అడుగుతుంది ప్రభావతి. అత్తయ్య అడిగిన అన్ని ప్రశ్నలకకు తెలియదని మీనా సమాధానమిస్తుంది. ఏమైనా చెప్పివెళ్లాడా అని అంటే వెళ్లొస్తానని చెప్పాడని అంటుంది. నీ తిక్క సమాధానాలు చూస్తే ఒళ్లు మండిపోతుందని ప్రభావతి ఎగిరిపెడుతుంది.
పుట్టింటి వాళ్లు లాగేసుకున్నారా...
సరుకులకు డబ్బులు ఇవ్వకుండా బాలు వెళ్లిపోయాడని చిందులు తొక్కుతుంది ప్రభావతి. దీపావళి పండుగకు బాలు మీ ఇంటికి వచ్చినప్పుడు బీద ఏడుపులు ఏడ్చి మొత్తం డబ్బులు మీ పుట్టింటివాళ్లు లాగేసుకున్నారా అంటూ ప్రభావతి మీనా తల్లిపై నిందలు వేస్తుంది.
మా అమ్మ కష్టపడి డబ్బులు సంపాదిస్తుందని, ఒకరి దగ్గర చేయిచాచదని మీనా అంటుంది. మరి దిగజారిపోయి మా వాళ్లు బతకడం లేదని, మా పుట్టింటి వాళ్ల గురించి తప్పుగా మాట్లాడొద్దని మీనా ఎంత చెప్పిన ప్రభావతి వినదు. మీనాను నానా మాటలు అంటూనే ఉంటుంది. అత్త మాటలతో మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది.
మనోజ్‌ను అడిగి ఇస్తా...
బాలు డబ్బులు ఇస్తాడో లేదో తెలియదని, మీనా ఖర్చులు కలిపి ఇవ్వాలి కదా అంటూ ప్రభావతి అంటుంది. అందులో కాస్మోటిక్స్ కూడా ఉన్నాయని, వాటి డబ్బులు ఇవిగో అంటూ రోహిణి ఇచ్చేస్తుంది.
బాలు డబ్బులు ఇవ్వకపోతే మనోజ్‌ను అడిగి ఇప్పిస్తానని రోహిణి అంటుంది. ఆ మాటలు వినగానే ప్రభావతి కంగారుపడుతుంది. మనోజ్ మొన్ననే ఇచ్చాడని అబద్ధం ఆడుతుంది.
బాలు ఇవ్వాల్సిందే…
బాలునే ఈ సారి ఇవ్వాలని పట్టుపడుతుంది. మీరే ఇచ్చుకుంటూ వెళ్లిపోతే ఈ పెళ్లాంమొగుళ్లు తేరగా తింటారని మీనా, బాలులను అవమానిస్తుంది ప్రభావతి. అత్త మాటలను మీనా సహించలేకపోతుంది. బాలును అడిగి ఆ డబ్బులు తీసుకొస్తానని బయటకు వస్తుంది.
బంగారు గాజులు తాకట్టు...
తన బంగారు గాజులు తాకట్టు పెట్టడానికి మీనా వస్తుంది. కానీ షాప్ మూసేసి ఉంటుంది. తమ్ముడు శివ ద్వారా మరో చోట తన బంగారు గాజులు తాకట్టు పెట్టాలని మీనా అనుకుంటుంది. కానీ తాను ఓ చోట పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నానని, ఆ డబ్బులు తాను ఇస్తానని శివ అంటాడు. గాజులు తాకట్టు పెట్టి డబ్బు తెమ్మని తమ్ముడికి ఇస్తుంది మీనా. అక్కడితో నేటి గుండెనిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
టాపిక్