Golden Globe Awards 2024: గోల్డెన్ గ్లోబ్స్ 2024.. గతేడాది ఆర్ఆర్ఆర్ గెలిచిన ఆ అవార్డు ఈసారి ఎవరు గెలిచారంటే?
08 January 2024, 10:40 IST
- Golden Globe Awards 2024: ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సెర్మనీ ఆదివారం (జనవరి 7) రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న బెవెర్లీ హిల్టన్ లో ఘనంగా జరిగాయి. గతేడాది ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన అవార్డు ఈసారి ఎవరు గెలుచుకున్నారో చూడండి.
గోల్డెన్ గ్లోబ్స్ 2024 బెస్ట్ మేల్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డులతో సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్
Golden Globe Awards 2024: 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సెర్మనీ ఆదివారం (జనవరి 7) రాత్రి లాస్ ఏంజిల్స్ లో జరిగింది. ఈ అవార్డుల్లో బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా కేటగిరీలో ఓపెన్‌హైమర్ అవార్డు గెలుచుకుంది. ఇక ఇదే సినిమాలో నటించిన సిలియన్ మర్ఫీ.. బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డు అందుకోవడం విశేషం. గతేడాది ఆర్ఆర్ఆర్ ఇదే అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - మోషన్ పిక్చర్ కేటగిరీలో అవార్డు అందుకుంది.
2023లో ఆర్ఆర్ఆర్ గెలుచుకున్న ఈ అవార్డును ఈసారి బార్బీ(Barbie) మూవీలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (What Was I Made For) సాంగ్ గెలుచుకుంది. ఈ సాంగ్ ను రాయడంతోపాటు కంపోజ్ చేసింది బిల్లీ ఐలిష్ ఓకానెల్, ఫినియాస్ ఓకానెల్. ఈ ఇద్దరూ బెస్ట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. గతేడాది ఆర్ఆర్ఆర్ బెస్ట్ మోషన్ పిక్చర్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీకి కూడా నామినేట్ అయినా.. అవార్డు గెలుచుకోలేకపోయింది. నాటు నాటు సాంగ్ కు మాత్రం అవార్డు దక్కింది. ఇదే పాటకు తర్వాత ఆస్కార్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.
గోల్డెన్ గ్లోబ్స్ 2024 లిస్ట్ ఇదీ..
ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో క్రిస్టఫర్ నోలాన్ ఓపెన్‌హైమర్ అవార్డుల పంట పండించింది. నోలాన్ తొలిసారి బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అందుకున్నాడు. ఇది కాకుండా బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా, బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డులతోపాటు బెస్ట్ మేల్ సపోర్టింగ్ యాక్టర్ (రాబర్ట్ డౌనీ జూనియర్), బెస్ట్ ఒరిజినల్ స్కోర్ (లుడ్విగ్ గోరాన్సన్) అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఇక బెస్ట్ ఫిమేల్ యాక్టర్ - మోషన్ పిక్చర్ అవార్డు కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ మూవీలో నటించిన లిలీ గ్లాడ్‌స్టోన్ కు దక్కింది.
కెరీర్లో తొలి నామినేషన్ లోనే ఆమె అవార్డు సొంతం చేసుకోవడం విశేషం. ఇక బెస్ట్ మోషన్ పిక్చర్ మ్యూజికల్ ఆర్ కామెడీ కేటగిరీలో పూర్ థింగ్స్ మూవీ అవార్డు దక్కించుకుంది. ఈ మూవీలో నటించిన ఎమ్మా స్టోన్ కి మోషన్ పిక్చర్ మ్యూజికల్ ఫిమేల్ యాక్టర్ అవార్డు దక్కింది. గతంలో 2017లోనూ ఎమ్మా స్టోన్ లా లా ల్యాండ్ సినిమా కోసం గోల్డెన్ గ్లోబ్ అందుకుంది.
ఇక 2023లో సంచలనం రేపిన బార్బీ మూవీ విషయానికి వస్తే ఈ సినిమా తొలిసారి ప్రవేశపెట్టిన సినిమాటిక్ అండ్ బాక్సాఫీస్ అచీవ్‌మెంట్ అవార్డు గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అవార్డు అందుకుంది. దీనికి మ్యూజిక్ అందించిన ఓకానెల్ బ్రదర్స్ 2021లోనూ నో టైమ్ టు డై మూవీ టైటిల్ ట్రాక్ కోసం కూడా అవార్డు గెలుచుకోవడం విశేషం.
ఇక బుల్లితెర విషయానికి వస్తే హెచ్‌బీవో రూపొందించిన సక్సెషన్ (Succession) సిరీస్ బెస్ట్ టెలివిజన్ సిరీస్ డ్రామా కేటగిరీలో అవార్డు గెలిచింది. గతేడాది ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిన బెస్ట్ మోషన్ పిక్చర్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ కేటగిరీలో ఈసారి అవార్డు అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ (నియోన్) అనే ఫ్రెంచ్ మూవీకి అవార్డు దక్కింది.