Golden globe on Tollywood: ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ ఒక్కటే కాదు.. టాలీవుడ్ గురించి గోల్డెన్ గ్లోబ్ ప్రత్యేక కథనం-golden globe awards special writeup on telugu cinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Golden Globe Awards Special Writeup On Telugu Cinema

Golden globe on Tollywood: ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ ఒక్కటే కాదు.. టాలీవుడ్ గురించి గోల్డెన్ గ్లోబ్ ప్రత్యేక కథనం

Maragani Govardhan HT Telugu
May 18, 2023 10:17 PM IST

Golden globe on Tollywood: ప్రముఖ అవార్డుల సంస్థ గోల్డెన్ గ్లోబ్ తెలుగు సినిమా గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. భారతీయ చిత్రాలంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదని.. ఇంకా పలు భాషల సినిమాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా టాలీవుడ్‌ అన్నింటికంటే అగ్రస్థానంలో ఉందని పేర్కొంది.

తెలుగు సినిమా గురించి గోల్డెన్ గ్లోబ్ ప్రత్యేక ప్రస్తావన
తెలుగు సినిమా గురించి గోల్డెన్ గ్లోబ్ ప్రత్యేక ప్రస్తావన

Golden globe on Tollywood: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమాకే కాదు భారత చలన చిత్ర సీమకే ఓ టార్చ్ బేరర్‌గా నిలిచింది. వెస్టర్న్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకర్షించిన ఈ మూవీ.. ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అని కాకుండా ఇక్కడ ఇతర భాషల చిత్రాలు కూడా ఉంటాయని ప్రపంచానికి వెలుగెత్తి చాటింది. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులు దక్కించుకోడవంతో తెలుగు సినిమా ఔన్నత్యాన్ని దశదిశలా విస్తరింప జేసింది. అయితే కేవలం ఆర్ఆర్ఆర్ విజయం కంటే ముందు దశాబ్దాల చరిత్ర తెలుగు సినిమాకు ఉంది. తెలుగు సినిమా గొప్పతనాన్ని కీర్తిస్తూ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల సంస్థ తన పోర్టల్‌లో టాలీవుడ్ గురించి ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందులో తెలుగు చలనచిత్ర సీమ గురించి క్లుప్తంగా వివరించింది.

బాలీవుడ్‌ను మించిపోయిన టాలీవుడ్..

సౌత్ ఇండియన్ సినిమా గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించడమే కాకుండా బాక్సాఫీస్ నెంబర్లను, గిన్నీస్ రికార్డుల తదితర విషయాలను ప్రస్తావించింది గోల్డెన్ గ్లోబ్. ప్రస్తుతం బాక్సాఫీస్ నంబర్ల ప్రకారం దేశంలో టాలీవుడ్ అగ్రస్థానంలో ఉందని, గతేడాది తెలుగు చిత్రసీమ 212 మిలియన్ డాలర్లు(1754 కోట్లు) నెట్ వర్త్‌ను సాధించిందని అంచనా వేసింది. ఇదే సమయంలో బాలీవుడ్ 197 మిలియన్ డాలర్లను(1630 కోట్లను) కలిగి ఉందని పేర్కొంది.

తెలుగు సినిమా ప్రస్థానం..

1921లో వచ్చిన భీష్మ ప్రతిజ్ఞ అనే మూవీతో తెలుగు సినిమా ప్రస్థానం మొదలైందని, 1931లో భక్త ప్రహ్లాద మొదటి టాకీ చిత్రంగా విడుదలైందని స్పష్టం చేసింది. రఘుపతి వెంకయ్య నాయుడు తెరకెక్కించిన భీష్మ ప్రతిజ్ఞ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఎన్నో మరపురాని చిత్రాలు వచ్చాయని తెలియజేసింది. హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోస్, ఎన్టీఆర్, చిరంజీవీ, బ్రహ్మానందం, ఎస్ఎస్ రాజమౌళి తదితర ప్రఖ్యాతి పొందిన ప్రముఖల గురించి ప్రస్తావించింది.

ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేక ప్రస్తావన..

ఇంక ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది గోల్డెన్ గ్లోబ్ సంస్థ. ఈ సినిమాకు నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించింది. అంతేకాకుండా ఈ మూవీ బడ్జెట్, రాబట్టిన వసూళ్లు లాంటి విషయాలను తెలియజేసింది. ఆర్ఆర్ఆర్‌తోనే ఆగకుండా.. రాజమౌళి గత చిత్రాలైన బాహుబలి 1, బాహులి 2 గురించి కూడా ప్రశంసల వర్షం కురిపించింది. ఇవి కాకుండా సుకుమార్ పుష్ప, ప్రభాస్ సాహో, త్రివిక్రమ్ అల వైకుంఠపురములో, మహేష్ బాబు దూకుడు లాంటి విజయాల గురించి చర్చించింది.

గోల్డెన్ గ్లోబ్ సంస్థ డిస్నీ సహా నిర్మాతగా వ్యవహరించిన 2011లో విడుదలైన అనగనగా ఓ ధీరుడు సినిమా ప్రస్థావన కూడా తీసుకొచ్చింది. ఇండియాలో డస్నీ తెరకెక్కించిన మొదటి సినిమా ఇదేనని తెలిపింది. అంతటితో ఆగకుండా ఇండియా అంతర్జాతీయంగా, దేశీయంగా చలనచిత్ర మార్కెట్‌గా ఎదుగుతుందని, ఓటీటీ స్ట్రీమింగ్ వేదికల పెరుగుదలతో ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొంది. ఈ విషయంలో టాలీవుడ్ అగ్రస్థానంలో ఉన్నట్లు స్పష్టం చేసింది.

IPL_Entry_Point