Godhra Teaser: గోద్రా ఘటన ప్రమాదమా? కుట్రనా? మూవీ టీజర్ రిలీజ్
08 January 2024, 18:46 IST
- Godhra Teaser: గోద్రా ఘటన ప్రమాదమా? కుట్రనా? దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై మూవీ రాబోతోంది. ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీలాగే మరోసారి పొలిటికల్ హీట్ పెంచడానికి ఈ గోద్రా మూవీ వస్తోంది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గోద్రా మూవీ
Godhra Teaser: దేశంలో పొలిటికల్ హీట్ పెంచడానికి మరో సినిమా వస్తోంది. ఈ మూవీ పేరు గోద్రా. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే. 21 ఏళ్ల కిందట జరిగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు దహనం, ఆ తర్వాత గుజరాత్ లో జరిగిన అల్లర్లను ఎవరూ అంత త్వరగా మరచిపోరు. ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఘటన అది.
కొన్నాళ్లుగా వివిధ రాజకీయ, సామాజిక వివాదాలకు సినిమాల ద్వారా తమ వెర్షన్ వినిపిస్తోందన్న విమర్శ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉన్న విషయం తెలిసిందే. 1990ల్లో జరిగిన కశ్మీరీ బ్రాహ్మణుల ఊచకోతపై ది కశ్మీర్ ఫైల్స్, హిందూ అమ్మాయిలను మతం మార్చి ఉగ్రవాదులుగా మారుస్తున్నారన్న ఆరోపణలపై ది కేరళ స్టోరీలాంటి సినిమాలు వచ్చాయి.
ఇక ఇప్పుడు గోద్రా రైలు ప్రమాదంపైనా అదే పేరుతో మరో సినిమా రాబోతోంది. ఈ రైలు దహనంలో అయోధ్య నుంచి తిరిగొస్తున్న 59 మంది మరణించారు. అయితే ఈ ఘటన ప్రమాదమా లేక కుట్రనా అంటూ మరోసారి చర్చకు దారి తీయబోతోంది ఈ సినిమా. తాజాగా మంగళవారం (మే 30) ఈ మూవీ అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు.
టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా 2002లో జరిగిన గోద్రా రైలు దహనం గురించి ముఖ్యమైన వివరాలను మాత్రం టెక్ట్స్ రూపంలో చూపించారు. చివరికి అసలు గోద్రా ఘటన ప్రమాదమా లేక కుట్రా అంటూ టీజర్ ముగించారు. ఈ లెక్కన గోద్రా మూవీ ద్వారా అధికార పార్టీ తమ వాదనను ప్రజల ముందుకు తీసుకెళ్లబోతోందా అన్న సందేహాలు మొదలయ్యాయి.
ఈ గోద్రా మూవీని ఎంకే శివాక్ష్ డైరెక్ట్ చేశాడు. బీజే పురోహిత్, రామ్ కుమార్ పాల్ ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. త్వరలోనే ఈ గోద్రా మూవీ థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ ఈ టీజర్ ద్వారా అనౌన్స్ చేశారు. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది సమయం కూడా లేని సమయంలో దేశ చరిత్రలో వివాదాస్పదంగా మిగిలిపోయిన వాటిపై వరుస సినిమాలు వస్తుండటం గమనార్హం.