PM Modi: 140కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు చిహ్నం: పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం-parliament building inauguration reflection of 140 crore indian aspirations says pm narendra modi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Parliament Building Inauguration Reflection Of 140 Crore Indian Aspirations Says Pm Narendra Modi

PM Modi: 140కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు చిహ్నం: పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం

Chatakonda Krishna Prakash HT Telugu
May 28, 2023 02:30 PM IST

Parliament building inauguration - PM Modi: పార్లమెంటు నూతన భవవాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. నవ భారత ఆకాంక్షలకు పార్లమెంటు ప్రతిబింబమని అన్నారు. పూర్తి వివరాలు ఇవే.

పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

Parliament building inauguration - PM Modi: “ఇది భవనం మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబం” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ఆదివారం పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. నవ భారత ఆకాంక్షలకు ఇది ప్రతిబింబమని చెప్పారు. ఈ కార్యక్రమానికి 25 పార్టీలు హాజరుకాగా.. 20 ప్రతిపక్షాలు గైర్హాజరయ్యాయి. పార్లమెంటులో చారిత్రక సెంగోల్‍ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాపన చేశారు. అనంతరం నూతన పార్లమెంటు భవనంలో తన తొలి ప్రసంగం చేశారు. ప్రపంచ ప్రజాస్వామ్యానికి భారత దేశమే పునాదిగా ఉందని మోదీ అన్నారు. వివరాలివే..

ప్రజాస్వామ్యానికి భారత్ మాతృమూర్తి

ప్రజాస్వామ్యానికి భారత దేశం మాతృమూర్తి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. “ప్రజాస్వామ్యానికి తల్లి.. భారత్. ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాదిగా కూడా ఉంది. ప్రజాస్వామ్యమే మన సంస్కారం, ఆలోచన, సంప్రదాయం” అని ప్రధాని మోదీ చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు, కలలకు పార్లమెంటు నూతన భవనం ప్రతిబింబం అని మోదీ అన్నారు. అలాగే, భారత్ సుస్థిరమైన అంకితభావంతో ఉందని ఈ భవనం ప్రపంచానికి సందేశం పంపుతుందని చెప్పారు.

ఆత్మనిర్భర్ భారత్‍కు నిదర్శనం

“పార్లమెంటు నూతన భవనం ఆత్మనిర్భర్ భారత్‍కు నిదర్శనంగా, శాసనంగా ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. “ఆత్మనిర్భర్ భారత్‍కు కొత్త పార్లమెంటు భవనం శాసనంగా ఉంటుంది. వికసిత భారతం దిశగా మన ప్రయాణానికి సాక్షిగా ఉంటుంది” అని ప్రధాని మోదీ చెప్పారు. భారత్‍తో పాటు ప్రపంచ అభివృద్ధికి కూడా ఈ పార్లమెంటు కొత్త భవనం దోహదపడుతుందని ఆయన అన్నారు. ఏక్ భారత్.. ఏక్ శ్రేష్ఠ భారత్‍ను ఈ భవనం ప్రతిబింబిస్తోందని మోదీ అన్నారు. భారత్ అభివృద్ధి చెందితే.. ప్రపంచం కూడా అభివృద్ధి అవుతుందని చెప్పారు.

సెంగోల్ వాటికి ప్రతీక

పార్లమెంటు నూతన భవనంలో సెంగోల్ ప్రతిష్టాపన గురించి కూడా మోదీ మాట్లాడారు. “చోళ రాజవంశంలో న్యాయం, ధర్మం, సుపరిపాలనకు సెంగోల్ ప్రతీక. చారిత్రక సెంగోల్ గౌరవాన్ని పునరుద్ధరించడం మా అదృష్టం. ఈ సభలో కార్యాకలాపాలు జరిగినప్పుడల్లా సెంగోల్ మాకు స్ఫూర్తినిస్తుంది” అని మోదీ అన్నారు.

అందుకే నూతన భవనం

త్వరలో పార్లమెంటులో ఎంపీల సంఖ్య పెరగనుందని, అందుకే నూతన భవనం అవసరం అయిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. “కొత్త పార్లమెంటు భవనం అవసరమైంది. రానున్న సమయంలో సీట్ల సంఖ్య, ఎంపీల సంఖ్య పెరగనుంది. ఆ అవసరం కోసమే కొత్త పార్లమెంటు నిర్మాణం అవసరమైంది” అని మోదీ అన్నారు.

పార్లమెంటు కొత్త భవన నిర్మాణంలో 60వేల మంది పాల్గొన్నారని, వారి కోసం ప్రత్యేకంగా ఓ డిజిటల్ గ్యాలరీని కూడా నిర్మించినట్టు మోదీ తెలిపారు.

పార్లమెంటు నూతన భవన ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణేన్ని ఆవిష్కరించారు.

ఆదివారం ఉదయం.. పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. జాతికి అంకితం చేశారు. స్వర్వ మతాల ప్రార్థనలు జరిగాయి. అనంతరం పార్లమెంటులో స్పీకర్ సీటు సమీపంలో సెంగోల్‍ను మోదీ ప్రతిష్టించారు. అనంతరం మధ్యాహ్నం పార్లమెంటులోకి మోదీ అడుగుపెట్టారు. ఆ సమయంలో కార్యక్రమానికి హాజరైన వారు నిలబడి “మోదీ.. మోదీ” అంటూ నినదించారు. 1947లో అధికార బదిలీకి చిహ్నంగా బ్రిటీషర్ల నుంచి సెంగోల్‍ను జవహర్ లాల్ నెహ్రూ అందుకున్నారు.

IPL_Entry_Point