New Parliament building inauguration : దేశ చరిత్రలో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది! ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్స వేడుకలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. నూతన పార్లమెంట్ భవనం వద్దకు ఉదయాన్నే చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పందిరిలో పూజా కార్యక్రమాలు జరిగాయి. పండితుల వేద మంత్రాల మధ్య ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. పూజా కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం పాల్గొన్నారు.
ప్రత్యేక పూజల అనంతరం రాజదండం వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు ప్రధానమంత్రి. అనంతరం అథీనం మఠాధిపతుల ఆశీర్వాదాలతో రాజదండాన్ని అందుకున్నారు. వేద మంత్రాల మధ్య లోక్‌సభలోకి అడుగుపెట్టి.. స్పీకర్ కుర్చీ వద్ద ఆ రాజదండాన్ని ప్రతిష్టించారు.
ఈ సందర్భంగా.. నూతన పార్లమెంట్ భవనాన్ని శరవేగంగా పూర్తి చేసిన కార్మికులను ప్రధాని మోదీ సత్కరించారు.
అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో 'సర్వ ధర్మ' ప్రార్థనలు జరిగాయి. ఇందులో ప్రధాని, స్పీకర్‌తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
Parliament building news : నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేందుకు వివిధ పార్టీల నేతలు, అతిథులు హాజరవుతారు. ఇదే సమయంలో.. కొత్త పార్లమెంట్ భవనం వద్దకు మార్చ్ నిర్వహించాలని ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రెజ్లర్లు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీవ్యాప్తంగా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
సంబంధిత కథనం