RGV on The Kerala Story: నోళ్లు మూతబడ్డాయా.. ది కేరళ స్టోరీ సక్సెస్‌పై బాలీవుడ్‌ను ఏకిపారేసిన రాంగోపాల్ వర్మ
RGV on The Kerala Story: నోళ్లు మూతబడ్డాయా అంటూ ది కేరళ స్టోరీ సక్సెస్‌పై బాలీవుడ్‌ను ఏకిపారేశాడు రాంగోపాల్ వర్మ. అబద్ధాలు చెప్పడం అలవాటైన తర్వాత ఇలాంటి నిజాలు చూసి షాక్ తినడం మామూలే అని అతడు అనడం విశేషం.

RGV on The Kerala Story: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సినిమా ది కేరళ స్టోరీ. ఈ సినిమా ఊహకందని విజయం సాధిస్తూ ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ సక్సెస్ పై తాజాగా ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించాడు. ట్విటర్ ద్వారా ఈ మూవీ సక్సెస్ పై స్పందించని బాలీవుడ్ ను అతడు ఏకి పారేశాడు.
కళ్లు చెదిరే విజయం సాధించిన ది కేరళ స్టోరీపై బాలీవుడ్ లో ఈ శ్మశాన నిశ్శబ్దం ఎందుకు అని ప్రశ్నించాడు. ఇక నుంచీ ది కేరళ స్టోరీ ప్రతి స్టోరీ డిస్కషన్ రూమ్ ను, కార్పొరేట్ హౌస్ లను వెంటాడుతూనే ఉంటుందని ఆర్జీవీ అన్నాడు. "మనకు మనం, ఇతరులకు ఎంతో సౌకర్యవంతంగా అబద్ధాలు చెప్పేస్తుంటాం. కానీ ఎవరైనా నిజాన్ని చూపించినప్పుడు షాక్ తింటాం. ది కేరళ స్టోరీ సాధించిన కళ్లు చెదిరే విజయంపై బాలీవుడ్ లో నెలకొన్న శ్మశాన నిశ్శబ్దం అదే విషయాన్ని చెబుతోంది" అని ఒక ట్వీట్ లో ఆర్జీవీ అన్నాడు.
ఇక మరో ట్వీట్ చేస్తూ.. "ది కేరళ స్టోరీ ఓ అందమైన దెయ్యంలాంటి అద్దం. అది మెయిన్ స్ట్రీమ్ బాలీవుడ్ కు దానిలోని జుగుప్సాకరమైన ముఖాన్ని చూపిస్తోంది. బాలీవుడ్ లో ఇక నుంచి ది కేరళ స్టోరీ ప్రతి స్టోరీ డిస్కషన్ రూమ్, ప్రతి కార్పొరేట్ హౌస్ ను వెంటాడుతూనే ఉంటుంది. ది కేరళ స్టోరీ నుంచి నేర్చుకోవడం కష్టమే. ఎందుకంటే అబద్ధాలను కాపీ చేయడం సులువే. కానీ నిజాన్ని కాపీ చేయడం చాలా కష్టం" అని ఆర్జీవీ అనడం గమనార్హం.
కేరళలో సుమారు 32 వేల మంది హిందూ అమ్మాయిలను బలవంతంగా మతం మార్పించి వాళ్లను ఐసిస్ లో ఉగ్రవాదులుగా చేర్పించిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు ట్రైలర్ రిలీజ్ తర్వాత మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఇది కేవలం ముగ్గురు అమ్మాయిల కథ అంటూ మేకర్స్ మాట మార్చారు.
కొన్ని రాష్ట్రాలు సినిమాపై నిషేధం విధించినా.. ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఊహకందని రీతిలో ఈ మూవీ ఇప్పటికే రూ.200 కోట్లు వసూలు చేయడం విశేషం. సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసిన ది కేరళ స్టోరీ.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది.
సంబంధిత కథనం