Salman Khan on OTT Content: ఓటీటీల్లో విచ్చలవిడిగా బూతు కంటెంట్ ను మొదట మొదలుపెట్టింది రాంగోపాల్ వర్మనే అని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అనడం గమనార్హం. ఓటీటీ కంటెంట్ కూ సెన్సార్ ఉండాలని అతడు స్పష్టం చేశాడు. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలకు సెన్సార్ ఉంటుంది. అభ్యంతరకరంగా ఉన్న సీన్లకు ముందుగానే కత్తెర వేస్తారు. హింస, సెక్స్ సీన్లు ఉండే సినిమాలకు ఎ సర్టిఫికెట్ ఇచ్చి.. కేవలం పెద్దవాళ్లు మాత్రమే సినిమా చూడాలంటే ముందుగానే హెచ్చరిస్తారు. కానీ ఓటీటీలకు అలాంటిదేమీ లేదు.
దీంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై విచ్చలవిడిగా ఈ హింస, శృంగారానికి సంబంధించిన కంటెంట్ ఉంటోంది. రోజురోజుకూ బూతు కంటెంట్ పెరిగిపోతుండటంపై చాలా రోజులుగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మధ్యే రానా నాయుడు వెబ్ సిరీస్ విషయంలోనూ ఏకంగా కేంద్ర ప్రభుత్వమే స్పందించింది. బూతు తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీలకు సెన్సార్ ఉండాలని అంటున్నాడు. ఇలా విచ్చలవిడి శృంగారం, ఎక్స్‌పోజింగ్ సీన్లు చూపించడం సరికాదని అతడు స్పష్టం చేశాడు. టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో పిల్లల చేతుల్లోనూ మొబైల్స్ ఉంటున్నాయని, ఇలాంటి కంటెంట్ వాళ్లు చూస్తే చాలా ప్రమాదమని సల్మాన్ అన్నాడు.
68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన సల్మాన్.. ఓటీటీ కంటెంట్ విషయంలో కీలకమైన కామెంట్స్ చేశాడు. ఓటీటీ కంటెంట్ ను సెన్సార్ చేయాల్సిందేనని చెప్పాడు. "నాకు తెలిసి రాంగోపాల్ వర్మనే దీనిని మొదలుపెట్టాడు. ఓటీటీల్లో ఇలాంటి కంటెంట్ మొదలుపెట్టిన వాళ్లలో అతడూ ఉన్నాడు. ఆ తర్వాత జనం దానికి అలవాటు పడ్డారు. కానీ నేను అలాంటి కంటెంట్ ను నమ్మను. నేను 1989 నుంచి సినిమాలు చేస్తున్నాను కానీ ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు" అని సల్మాన్ అన్నాడు.
ఓటీటీల్లో సెక్స్ సీన్లు, ఎక్స్‌పోజింగ్, బూతులు తిట్టడం ఎక్కువైపోయిందని, ఇవన్నీ ఆపేయాలని అన్నాడు. సల్మాన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ బూతు కంటెంట్ ఓటీటీల్లో రావడానికి వర్మనే ఆద్యుడని అనడం విశేషం.
సంబంధిత కథనం
టాపిక్