RGV on Keeravani: కీరవాణి మాటలకు నేను చచ్చిపోయాననిపించింది.. ఆస్కార్ విన్నర్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్
RGV on Keeravani: సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. కీరవాణికి సంబంధించిన ఓ వీడియోను నెట్టింట షేర్ చేశారు. ఇందులో కీరవాణి.. ఆర్జీవీని ప్రశంసిస్తూ మాట్లాడారు. దీంతో పొగడ్తలను తను తట్టుకోలేకపోతున్నానని, చనిపోయాననే భావన కలుగుతుందంటూ ఆర్జీవీ తనదైన శైలిలో పోస్టు పెట్టారు.
RGV on Keeravani: రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడినా.. అందులో ఏదోక కాంట్రవర్సీనో లేక ఏదో పబ్లిసిటీ స్టంటో ఉంటుంది. అయితే చాలా సార్లు అతడు మాట్లాడే ప్రతి మాటకు ఎంతో లాజిక్, అర్థం ఉంటాయి. దీంతో ఆయన ప్రవర్తనకు, మాటలకు అభిమానులు చాలా మందే ఉన్నారు. పబ్లిసిటీ కోసం వర్మ చేసే పిచ్చిపనులను కూడా ఎంకరేజ్ చేసేవాళ్లు ఉన్నారు. తన మనస్సులోని మాటలను నిర్మోహమాటంగా చెప్పే ఆర్జీవీ.. ఇతరుల మాటలను పెద్దగా పట్టించుకోరు. అలాంటిది ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాటలకు తను చచ్చిపోయినంత పనైందని ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు.
ఇంతకీ విషయంలోకి వస్తే ఇటీవల ఆస్కార్ గెలిచిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో కీరవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ విజయం గురించి మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది తనకు రెండో ఆస్కార్ అని, మొదటి రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన అవకాశం.. అకాడమీ అవార్డు లాంటిదని స్పష్టం చేశారు.
"నేను ఓ విషయం మీకు చెప్పాలి. 2023లో నేను అందుకున్న ఆస్కార్ నాకు రెండోది. అంతకంటే ముందు రామ్ గోపాల్ వర్మ నాకు ఆస్కార్ ఇచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన క్షణం క్షణం సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. అది నాకు ఆస్కార్ లాంటిదే. అంతకుముందు కీరవాణి అంటే ఎవరికి తెలియదు. అనామకుడినైన నేను రామ్ గోపాల్ వర్మ అవకాశం ఇవ్వడం వల్ల ఈ స్థితిలో ఉన్నా. ఆర్జీవీ ఛాన్స్ ఇచ్చారంటే ఇతడిలో ఏదో విషయం ఉందని నాకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి" అని కీరవాణి తెలిపారు.
కీరవాణి మాట్లాడిన ఈ వీడియోను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అంతేకాకుండా తన స్పందనను కూడా తెలియజేశారు. "హే.. కీరవాణి నేను ఈ మాటలకు చనిపోయానని అనిపిస్తుంది. ఎందుకంటే మరణించినవాళ్లనే ఈ విధంగా ప్రశంసిస్తారు." అంటూ ఆర్జీవీ తన స్పందనను తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. వర్మను పొగిడినా తప్పే అంటూ కామెంట్లు విసురుతున్నారు.
ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ పురస్కారం సాధించింది. టాప్ గన్ మ్యావ్రిక్ సినిమా నుంచి లేడీ గాగా ఆలపించిన హోల్ట్ మై హ్యాండ్, బ్లాక్ ఫ్యాంతర్ వకాండ ఫరెవర్ నుంచి రిహానా పాడిన్ లిఫ్ట్ మీ అప్ లాంటి పాపులర్ సాంగ్స్‌ను కూడా అధిగమించి నాటు నాటు పాట ఆస్కార్ గెలిచింది. పాట స్వరపరిచిన ఎంఎం కీరవాణి, రాసిన చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు.