Samantha Temple : సమంతా విగ్రహానికి ప్లాస్టిక్ సర్జరీ కావాలి.. నెటిజన్ల ట్రోల్స్
01 May 2023, 12:47 IST
- Samantha Temple : ఇటీవలే ఓ అభిమాని సమంతాకు గుడి కట్టాడు. అయితే అందులో పెట్టిన విగ్రహం మీద మాత్రం విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. అసలు సమంతా ఇలాగే ఉంటుందా అంటూ.. నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
సమంతా గుడి
నటి సమంతా(Samantha) ఇటీవలే తన 36వ పుట్టినరోజు జరుపుకొంది. అభిమానులు, సినీ ప్రముఖులు సామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు ఆమెకు బహుమతులు పంపారు. 'ఖుషి' సినిమా లుక్‌ని విడుదల చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే ఓ అభిమాని మాత్రం ఏకంగా గుడి కట్టాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన తెనాలి సందీప్(Tenali Sandeep) అనే అభిమాని సమంతాకు వీరాభిమాని. ఆమెను ఆరాధించే ఈ యువకుడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సమంత గుడి(Samantha Temple)ని ఓపెన్ చేశాడు. తన ఇంటి కాంపౌండ్‌లో సమంతా కోసం మందిరాన్ని నిర్మించాడు. సామ్ పుట్టినరోజు సందర్భంగా గుడిని ప్రారంభించి కేక్ కట్ చేసి పట్టణ ప్రజలందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఇదంతా ఎంతో అభిమానంతో చేసిన సందీప్ కి ఇప్పుడు ట్రోల్స్(Trolls) ఎదురవుతున్నాయి. సమంతా కోసం గుడి కట్టడం విశేషం.. అయితే ఆ గుడిలో ఉండాల్సిన సమంతా ఎక్కడుంది? అని అందరూ ప్రశ్నిస్తున్నారు.
నిజానికి సందీప్ తాను కట్టిన ఆలయంలో సమంతా విగ్రహాన్ని పెట్టాడు. అయితే అసలు సమస్య ఏంటంటే.. ఆ విగ్రహం మాత్రం.. సమంతాలా కనిపించడం లేదు. ఏ యాంగిల్‌లో చూసినా ఈ బొమ్మ సమంతలా కనిపించకపోవడమే ట్రోల్‌కి కారణం. అభిమాని సందీప్‌నే కాకుండా విగ్రహాన్ని చెక్కిన శిల్పిని కూడా ట్రోలర్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది అభిమానులు సమంతా విగ్రహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని అంటున్నారు. అది నేనే అని సమంతా అయినా కనుక్కోగలదా అని అడుగుతున్నారు.
ఇటీవలే.. సమంతా తాను ఆసుపత్రిలో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఆక్సిజన్ మాస్క్ ధరించి నిద్రిస్తున్న ఫోటోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పెట్టింది. ఇది చూసిన అభిమానులు షాక్ అయ్యారు. అయితే ఈ విషయంపై సమంత క్లారిటీ ఇచ్చింది. 'నేను హైపర్‌బారిక్ థెరపీ తీసుకుంటున్నాను. ఈ చికిత్స అనేక వ్యాధులకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.' అని సమంతా చెప్పింది. ఇది చూసిన అభిమానులు మీ వెంట మేమున్నాం ధైర్యంగా ఉండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సమంతా సినిమాల విషయానికి వస్తే, గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’(shakuntalam) ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తోంది సమంతా.