Samantha Poster in Kushi: ఖుషీలో సమంత పోస్టర్ అదుర్స్.. పెళ్లయిన మహిళగా సామ్
Samantha Poster in Kushi: విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తున్న సరికొత్త చిత్రం ఖుషీ. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సామ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌గా ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా ఉంది.
Samantha Poster in Kushi: విజయ్ దేవరకొండ-సమంత రూత్ ప్రభు కాంబోలో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అదే ఖుషీ. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు విడుదలై సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఆరంభంలో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ.. సామ్ అనారోగ్య కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. ఇటీవలే చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది. సమంత కూడా ఖుషీ సెట్స్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం సామ్ పుట్టిన రోజు సందర్భంగా ఖుషీ బృందం ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ పోస్టర్‌లో సమంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మెడలో మంగళ సూత్రంతో వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న మహిళ పాత్రలో ఆమె నటిస్తోంది. ఈ పోస్టర్‌ను విడుదల చేస్తూ సమంతకు చిత్రబృందం బర్త్ డే విషెస్ తెలిపింది. సహచర నటుడు విజయ్ దేవరకొండ సహా పలువురు ప్రముఖు సామ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఖుషీ చిత్రంలో సమంత పోస్టర్‌ను చూసిన ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఆమె ఫొటో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. సింపుల్ కుర్తా, స్కిన్నీ ఫిట్ జీన్స్‌లో కనిపించిన సామ్.. మెడలో మంగళసూత్రంతో తన క్యారెక్టర్‌లో లీనమైంది. ఇందులో సమంత.. విజయ్ దేవరకొండ లవ్ ఇంట్రెస్ట్‌గా నటిస్తోంది. సహజమైన అందంతో ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్‌గా ఉంది. ల్యాప్ టాప్ బ్యాగ్ తగిలించుకుని నవ్వులు చిందిస్తూ నడుస్తూ వెళ్తున్న సామ్ పోస్టర్ ఆకర్షణీయంగా ఉంది.
మహానటి తర్వాత విజయ్ దేవరకొండ.. సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషీనే కావడం విశేషం. ఇప్పటికే వీరి కాంబోపై ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. గతేడాది విడుదలైన టైటిల్ పోస్టర్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, జయరామ్, సచిన్ ఖేడ్కర్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.