Double Ismart Review: డబుల్ ఇస్మార్ట్ రివ్యూ - రామ్, పూరి జగన్నాథ్ మాస్ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
15 August 2024, 14:23 IST
Double Ismart Review రామ్ హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ గురువారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?
డబుల్ ఇస్మార్ట్ రివ్యూ
Double Ismart Review: ప్రస్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సీక్వెల్స్ జాబితాలో వచ్చిన తాజా మూవీ డబుల్ ఇస్మార్ట్. హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఇండిపెండెన్స్ డే కానుకగా గురువారం రిలీజైంది. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా కనిపించాడు. డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉంది? ఇస్మార్ట్ శంకర్ మ్యాజిక్‌ను సీక్వెల్‌తో రామ్, పూరి జగన్నాథ్ కంటిన్యూ చేశారా? లేదా? అంటే?
ఇస్మార్ట్ శంకర్ రివేంజ్...
ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) పాత బస్తీ యువకుడు. శంకర్ చిన్నతనంలోనే తండ్రికి దూరమవుతాడు. తల్లిని ఓ గ్యాంగ్‌స్టర్ షూట్ చేసి చంపేస్తాడు.బిగ్‌బుల్ (సంజయ్ దత్) ఓ ఇంటర్నేషనల్ డాన్. సౌత్, నార్త్ పేరుతో విభేదాలు సృష్టిస్తూ దేశంలో కుట్రలు పన్నడమే కాకుండా అక్రమంగా ఆయుధాలు, డ్రగ్స్ లాంటి ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటాడు. బిగ్‌బుల్‌ను పట్టుకోవడానికి రా తో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాయి. బిగ్‌బుల్‌కు బ్రెయిన్ ట్యూమర్ ఉందనే నిజం బయటపడుతుంది.
మూడు నెలలకు మించి బతకడని డాక్టర్లు చెబుతారు. మెమోరీ ట్రాన్స్‌ఫర్ ద్వారా తనకు మరణం అన్నదే లేకుండా ఎళ్లకాలం తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలని బిగ్‌బుల్ నిర్ణయించుకుంటాడు. తన మెమోరీని హైదరాబాద్‌లోని ఇస్మార్ట్ శంకర్ బ్రెయిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని బిగ్‌బుల్ అనుకుంటాడు.
ఇస్మార్ట్ శంకర్‌ను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన బిగ్‌బుల్‌కు ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయి? అతడిని నిజంగా బ్రెయిన్ ట్యూమర్ ఉందా? బిగ్‌బుల్ తన మెమోరీని ఇస్మార్ట్ శంకర్ బ్రెయిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాడా? ఇస్మార్ట్ శంకర్ బిగ్‌బుల్‌గా మారాడా? బిగ్‌బుల్‌తో ఇస్మార్ట్ శంకర్‌కు ఉన్న శత్రుత్వం ఏమిటి? శంకర్ తల్లి పోచమ్మను చంపింది ఎవరు? ఇస్మార్ట్ శంకర్ ప్రేమించిన జన్నత్ (కావ్య థాపర్) ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
పూరి మ్యాజిక్…
పూరి జగన్నాథ్ సినిమాల్లో కథ అంటూ పెద్దగా ఉండదు. హీరో క్యారెక్టరైజేషన్‌తోనే మ్యాజిక్కులు, జిమ్మిక్కులు చేస్తుంటాడు. హీరోల్లోని మాస్ కోణాన్ని పతాక స్థాయిలో చూపిస్తుంటాడు. ఆ ఫార్ములా ఇస్మార్ట్ శంకర్ లో వర్కవుట్ అయ్యింది. అందుకే సక్సెస్ కోసం ఇస్మార్ట్ శంకర్‌లో రామ్ క్యారెక్టరైజేషన్‌తో పాటు ఆ సినిమాలోని మెమోరీ ట్రాన్స్‌ఫర్ అనే పాయింట్ చుట్టూ రివేంజ్ కథను అల్లుకుంటూ డబుల్ ఇస్మార్ట్ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు పూరి జగన్నాథ్.
మదర్ సెంటిమెంట్...
మదర్ సెంటిమెంట్‌తో డబుల్ ఇస్మార్ట్ మూవీ మొదలవుతుంది. ఇస్మార్ట్ శంకర్ పాత్ర పరిచయం, హీరోయిన్‌తో అతడి లవ్ ట్రాక్‌ను తనదైన స్టైల్‌లో సరదాగా నడిపించాడు పూరి. అందులో కొన్ని డైలాగ్స్ కామెడీని పంచితే మరికొన్ని అతిగా అనిపిస్తాయి. బిగ్‌బుల్‌గా సంజయ్ దత్ పాత్ర పరిచయం, అతడి గురించి ఇచ్చే బిల్డప్‌లో పూరి గత సినిమాలను గుర్తుకుతెస్తాయి.
మెమోరీ ట్రాన్స్‌ఫర్ అనే పాయింట్ తెరపైకి తీసుకొచ్చినప్పటి నుంచే కథలో ఆసక్తి మొదలవుతుంది. సెకండాఫ్ చాలా వరకు రామ్, సంజయ్ దత్ పాత్రల చుట్టే కథ సాగుతుంది. క్లైమాక్స్‌లో పోకిరి స్టైల్‌లో ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు పూరి. ఈ ట్విస్ట్ ఈజీగానే గెస్ చేసేలా ఉంది.
ఇస్మార్ట్ శంకర్ తల్లి మరణానికి కారుకులు ఎవరన్నది రివీలయ్యే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. రివేంజ్ కథలో ఆడియెన్స్‌ను నవ్వించడానికి క్రియేట్ చేసినా అలీ పాత్ర బోకా పూర్తిగా తేడా కొట్టేసింది. ఆ సీన్స్ నవ్వించగా పోగా చిరాకును తెప్పిస్తాయి.
కథ రొటీన్...
రామ్ క్యారెక్టరైజేషన్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన పూరి జగన్నాథ్ కథ విషయంలో మాత్రం రొటీన్‌గానే అడుగులు వేశారు. లవ్‌స్టోరీ, హీరో పాత్రకు సంబంధించి వచ్చే మలుపు, మదర్ సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ గతంలో ఎన్నో సినిమాల్లో వచ్చినవే.
హైదరాబాదీ యాసలో...
ఇస్మార్ట్ శంకర్ పాత్రలో మరోసారి రామ్ చెలరేగిపోయాడు. హైదరాబాదీ యాసలో అతడు చెప్పిన డైలాగ్స్, ఆటిట్యూడ్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. కావ్య థాపర్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. బిగ్‌బుల్‌గా సంజయ్ దత్ విలనిజం సోసోగా అనిపిస్తుంది. మణిశర్మ మాస్ ట్యూన్స్ కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
పక్కా మాస్ మసాలా మూవీ...
ఇస్మార్ట్ శంకర పక్కా మాస్ మసాలా మూవీ. రామ్ ఫ్యాన్స్‌ను ఏ మాత్రం డిసపాయింట్ చేయదు. కామెడీ, మాస్ అంశాలను ఆశించి థియేటర్‌లో అడుగు పెడితే టైమ్‌పాస్ చేస్తుంది. పూరి జగన్నాథ్ మార్క్ మాత్రం కొంత మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది.
రేటింగ్: 2.5/5