BCCI New League: రిటైర్ అయిన ప్లేయర్ల కోసం ఐపీఎల్ తరహాలో మెగా లీగ్.. మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్న బీసీసీఐ: వివరాలివే!
BCCI New League: బీసీసీఐ కొత్త లీగ్ తెచ్చేందుకు ఆలోచనల్లో ఉందని సమాచారం బయటికి వచ్చింది. రిటైర్ అయిన ప్లేయర్ల కోసం ఈ లీగ్‍ను భారీగా నిర్వహించేందుకు ప్రణాళికల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ తరహాలో ఈ లీగ్ ఉండనుందని తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అద్భుతమైన సక్సెస్ అయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ ప్రపంచంలోనే అతిపెద్ద, ఖరీదైన లీగ్‍గా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లు ఐపీఎల్‍లో ఆడుతున్నారు. మహిళల కోసం డబ్ల్యూపీఎల్‍ను కూడా బీసీసీఐ నిర్వహిస్తోంది. కాగా, మరో లీగ్‍ను తీసుకొచ్చేందుకు కూడా భారత బోర్డు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ప్లేయర్ల కోసం ఈ లీగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోందనే సమాచారం బయటికి వచ్చింది.
బీసీసీఐ ఫస్ట్ అవుతుంది!
ప్రస్తుతం రిటైన ఆటగాళ్ల కోసం కొన్ని లీగ్స్ జరుగుతున్నా.. వాటిలో ఎక్కువ శాతం ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తున్నాయి. రోడ్ సెఫ్టీ వరల్డ్ సిరీస్, లెజెండ్స్ లీగ్ క్రికెట్, వరల్డ్ చాంపియన్‍షిప్ ఆఫ్ లెజెండ్స్ సహా మరిన్ని లీగ్స్ జరుగుతున్నాయి. అయితే, ఇవన్నీ ప్రైవేట్ లీగ్స్. ఏ క్రికెట్ బోర్డు కూడా నిర్వహించడం లేదు. ఈ తరుణంలో బీసీసీఐ అధికారికంగా రిటైర్డ్ ప్లేయర్ల కోసం లెజెండ్స్ లీగ్ నిర్వహించాలని యోచిస్తోందని రిపోర్టులు బయటికి వచ్చాయి. ఈ లీగ్ జరిగితే లెజెండ్స్ కోసం అధికారికంగా టోర్నీ నిర్వహించే ఫస్ట్ క్రికెట్ బోర్డ్ బీసీసీఐయే అవుతుంది.
ఐపీఎల్ తరహాలో..
రిటైర్డ్ ప్లేయర్లకు నిర్వహించే ఈ లెజెండ్స్ టోర్నీ ఐపీఎల్ తరహాలోనే నిర్వహించేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బీసీసీఐ ఈ టోర్నీ జరిపితే.. మిగిలిన లెజెంట్స్ లీగ్‍లకు గండి పడినట్టే. వయసురీత్యా రిటైర్డ్ ఆటగాళ్లు ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ టోర్నీలు ఆడడం కష్టమే. దీంతో డబ్బు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండే బీసీసీఐ నిర్వహించే లీగ్ వైపే ఎక్కువ మంది మొగ్గుచూపే అవకాశం ఉంటుంది.
ఐపీఎల్‍లాగే ఈ లెజెండ్స్ లీగ్ కూడా ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. వివిధ నగరాల ఆధారంగా జట్లు పేర్లు ఉంటాయి. ఈ ఫ్రాంచైజీలను బిడ్డింగ్ ద్వారా పొందిన ఓనర్లు నిర్వహిస్తారు. ఈ లెజెండ్ లీగ్‍కు కూడా వేలం నిర్వహించి ప్లేయర్లను ఫ్రాంచైజీలు దక్కించుకునేలా ఉంటుంది. భారత దిగ్గజ ఆటగాళ్లను ఫ్రాంచైజీలకు మార్క్యూ ప్లేయర్లుగా ఉంచే అవకాశాలు ఉంటాయి.
ఒకవేళ ఈ లీగ్ కార్యరూపం దాలిస్తే సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, హర్భజన్ సింగ్ సహా మరికొందరు భారత దిగ్గజాలు జట్లలో ప్రధానంగా ఉంటారు. విదేశీ రిటైర్డ్ స్టార్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ సహా మరికొందరికి ఫుల్ క్రేజ్ మళ్లీ ఉంటుంది. ఈ లీగ్ గురించి ప్రస్తుతం బీసీసీఐ వద్ద ప్రదిపాదనలు ఉన్నాయి. అంతా ఓకే అనుకుంటే వచ్చే ఏడాది నుంచే ఈ లెజెండ్స్ లీగ్ జరిగే అవకాశాలు ఉంటాయి.
ఇంగ్లండ్‍లో ఇటీవలే వరల్డ్ చాంపియన్‍షిప్ ఆఫ్ లెజెండ్స్ ట్రోఫీ జరిగింది. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ విజయం సాధించింది. ఈ టోర్నీకి ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సహకారం అందించింది. అయితే, అధికారికంగా బోర్డు తరఫున నిర్వహించలేదు. ఈ ఏడాది ఈ టోర్నీ ఫైనల్‍లో పాకిస్థాన్ చాంపియన్స్ జట్టును భారత్ ఓడించింది. ఫైనల్‍లో అర్ధ శతకంతో అంబటి రాయుడు దుమ్మురేపాడు.