Chiranjeevi Pawan Kalyan: చిరంజీవికి బాగా నచ్చిన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సినిమాలు ఇవే.. అవేంటో గెస్ చేశారా?
10 May 2024, 14:32 IST
- Chiranjeevi Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవికి తన తమ్ముడు పవన్ కల్యాణ్, తనయుడు రామ్ చరణ్ సినిమాల్లో బాగా నచ్చినవి ఏవో మీకు తెలుసా? ఈ ప్రశ్నకు అతడే సమాధానం చెప్పాడు.
చిరంజీవికి బాగా నచ్చిన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సినిమాలు ఇవే.. అవేంటో గెస్ చేశారా?
Chiranjeevi Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి గురువారం (మే 9) ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ స్వీకరించిన సంగతి తెలుసు కదా. అయితే అంతకంటే ముందు అతడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ ఇద్దరూ సినిమాలు, రాజకీయాల గురించి సుమారు 40 నిమిషాలు మాట్లాడారు.
ఇందులోనే చిరు తన తమ్ముడు పవన్, తనయుడు చరణ్ సినిమాల గురించీ స్పందించాడు. ఏపీలో టీడీపీ, బీజేపీతో కలిసి పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో చిరంజీవితో కిషన్ రెడ్డి ఇంటర్వ్యూ ప్రాధాన్యత సంతరించుకుంది.
చిరంజీవికి నచ్చిన పవన్, చరణ్ సినిమాలు ఇవే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లో చాలా వరకు తనకు ఇష్టమైనవే ఉన్నాయని ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పడం విశేషం. "పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ, బద్రి, జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు నాకు ఇష్టం. అతడు నటించింది కొద్ది సినిమాల్లోనే అయినా ఒకటో రెండో తప్పా అన్నీ అద్భుతమైన సినిమాలే. చరణ్ విషయానికి వస్తే మగధీర అంటే ఇష్టం" అని చిరంజీవి అన్నాడు.
ఈ సమయంలో కిషన్ రెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఆ సినిమా రిలీజైన సందర్భంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేశారు. అప్పట్లో చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్నారు. అసెంబ్లీలో మీరు నా దగ్గరికి వచ్చి మా అబ్బాయి సినిమా చాలా బాగా ఆడుతోందని చెప్పినట్లు నాకు ఇప్పటికీ గుర్తుంది అని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా అనడం గమనార్హం.
రాజకీయాలు, కశ్మీర్, కొవిడ్ అంశాలపైనా..
చిరంజీవి, కిషన్ రెడ్డి ఇదే ఇంటర్వ్యూలో సినిమాలతోపాటు రాజకీయాలు, కశ్మీర్, కొవిడ్ సమయంలో ఇద్దరూ చేసిన సేవల గురించి మాట్లాడుకున్నారు. తనను ఇంతగా ఆదరించిన ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప పదవుల కోసం కాదని మరోసారి ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.
ఇక కశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అప్పటి నుంచి అన్నీ కలిపి 300 సినిమాల వరకు అక్కడ చిత్రీకరించారని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇక కొవిడ్ సమయంలో తాము చేసిన సేవలను కూడా ఈ సందర్భంగా ఈ ఇద్దరు ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.
చిరంజీవికి పద్మ విభూషణ్
ఇక మెగాస్టార్ చిరంజీవి గురువారం (మే 9) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. దేశంలో భారతరత్న తర్వాత రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అందుకోవడం తనకు చాలా గర్వంగా ఉందని చిరంజీవి అన్నాడు. ఈ కార్యక్రమానికి అతడు భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్, అతని భార్య ఉపాసనలతో కలిసి వెళ్లాడు.
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్యలాంటి హిట్స్ తర్వాత భోళా శంకర్ రూపంలో కాస్త ప్రతికూల ఫలితం వచ్చినా.. ఇప్పుడు విశ్వంభరతో మళ్లీ గాడిలో పడాలని చిరు చూస్తున్నాడు.
టాపిక్