తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 31st Episode: బ్రహ్మముడి- కల్యాణ్‌కు యాక్సిడెంట్- రాజ్ డ్రామా ఫెయిల్- ధాన్యలక్ష్మీకే మొదటి శుభలేఖ

Brahmamudi July 31st Episode: బ్రహ్మముడి- కల్యాణ్‌కు యాక్సిడెంట్- రాజ్ డ్రామా ఫెయిల్- ధాన్యలక్ష్మీకే మొదటి శుభలేఖ

Sanjiv Kumar HT Telugu

31 July 2024, 7:27 IST

google News
  • Brahmamudi Serial July 31st Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 31వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్‌కు యాక్సిడెంట్ అయినట్లు రాజ్ డ్రామా ఆడతాడు. హాస్పిటల్‌కు వచ్చిన అప్పు తన ప్రేమను బయటపెడుతుంది. మరోవైపు ధాన్యలక్ష్మికి అప్పు పెళ్లి శుభలేఖను కనకం ఇస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూలై 31వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూలై 31వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ జూలై 31వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కనకం ఇంటి నుంచి వచ్చిన రాజ్‌ను కావ్య నిలదీస్తుంది. మీకోసం పిన్ని, రుద్రాణి అత్త ఆతృతగా ఎదురుచూస్తున్నారు అని, ఈ ఇంటి ఆస్తిని తన్నుకుపోడానికి ఆ ఇంట్లో జరుగుతున్న కుట్ర ఏంటో, ఆ ఇంటి పిల్లను ఈ ఇంటి కోడలిని చేయడానికి ఎన్ని పథకాలు చేస్తున్నారో పూర్తిగా తెలుసుకునే వచ్చుంటారు కదా అని కావ్య అంటుంది.

జాతకరత్న రుద్రాణి

ఏం మాట్లాడుతున్నావ్ అని ధాన్యలక్ష్మీ అంటే.. ఉన్నదే అంటున్నాను అని కావ్య అంటుంది. కనకం ఇంటికి వెళ్లి వస్తున్నావా అని ఇందిరాదేవి అడుగుతుంది. హా ఎందుకు వెళ్లడు. అప్పు తన మరదలు కదా. అప్పును ఇంటి కోడలిని చేస్తే ఆ అక్క ఈ అక్క మధ్యలో అప్పు త్రివేణి సంగమంలా ఉంటుంది. ఎం జరిగిందో చెప్పు రాజ్ అని రుద్రాణి సెటైర్లు వేస్తుంది. ఈ జాతకరత్న, మిడితంబొట్లు రుద్రాణి గారు భవిష్యత్‌ను బాగానే ఆవిష్కరిస్తున్నారు. మా స్వప్న అక్క ఉంటే వేరే భాషలో సమాధానం ఉండేది. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో చెప్పండి అని కావ్య అడుగుతుంది.

ఇప్పటివరకు మీ పిన్ని, రుద్రాణి అత్త నాపై పెద్ద యుద్ధమే ప్రకటించారు. అప్పుకు కల్యాణ్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని కావ్య అడుగుతుంది. లేదు. అప్పుకి కల్యాణ్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని రాజ్ చెబుతాడు. దాంతో ధాన్యలక్ష్మీ సంతోషపడితే.. నేను వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందని రుద్రాణి అనుకుంటుంది. మీ అత్తగారు ఏమన్నారు అని అపర్ణ అంటే.. ఆవిడకు అస్సలు ఇష్టం లేదు. ఇంకోసారి ఈ విషయం మాట్లాడొద్దని నా కాళ్లు కూడా పట్టుకోబోయారు అని రాజ్ చెబుతాడు.

అత్త మీద పడ్డారు

ఆ కుటుంబంలో ఎవ్వరికీ కల్యాణ్‌కు అప్పును ఇచ్చి చేయాలని లేదు అని రాజ్ అంటాడు. శుభం.. శుభవార్త మోసుకు వచ్చావు నాయనా అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా. మీ మాటలు వినేవాళ్లని లేనిపోనివి చెప్పి, మనసు కలుషితం చేస్తారు. అలా చేసే అనామిక కాపురం కూల్చారు. కోడలి పని అయిపోయింది. ఇప్పుడు అత్త మీద పడ్డారు అని కావ్య అంటుంది. అంటే నాకు సొంత నిర్ణయాలు ఉండవా అని ధాన్యలక్ష్మీ అంటుంది.

ఉండవు. రుద్రాణి ఏది పెడితే అదే తింటావ్. గడ్డి పెడితే గడ్డే తింటావ్. అలా చేసే నీ కొడుకు కాపురం కూల్చుకున్నావ్ అని అపర్ణ అంటుంది. ఇంకా నీకు బుద్ధి రాలేదా ధాన్యలక్ష్మీ. ఇప్పటివరకు కావ్యపై, వాళ్ల కుటుంబంపై దుమ్మెత్తిపోశావ్. చాలదా అని ఇందిరాదేవి అంటుంది. నానమ్మ.. అప్పు కల్యాణ్ ప్రేమించుకోవడం, ప్రేమించుకోకపోవడం పక్కన పెడితే ఇందులో కావ్యకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ, వీళ్లిద్దరు నా భార్యను నానా మాటలు అన్నారు అని రాజ్ చెబుతాడు.

మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం

నా భార్యను, తన కుటుంబాన్ని అవమానించారు. ఇంకోసారి ఇలా చేస్తే నేను తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. అప్పుడు మీరు అమ్మ, తాతయ్య క్షమాభిక్ష పెట్టమన్న ఎవ్వరు అడ్డుచెప్పకూడదు అని రాజ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తాడు. రాజ్ నువ్ చెప్పింది నిజమే అయితే అంతకన్నా కావాల్సింది ఏముంది. అప్పు పెళ్లికి అంతా వెళ్దాం. మనస్ఫూర్తిగా అక్షింతలు వేసి.. ఆశిస్సులు అందజేద్దాం. కావ్య.. ముందు పెళ్లిలో ఎలాంటి మతలబు జరగకుండా నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

మంచిది చిన్నత్తయ్య. మేము ఏం చేయాలో మాకు బాగా తెలుసు. అక్కడికి మీరు వచ్చి తట్టల కొద్ది బురద మోసుకోని తిరగండి. దుగ్గిరాల ఫ్యామిలీలో మీరు ఎలా ఉన్నారా అని ఆశ్చర్యపోతారు అని కావ్య అంటుంది. రాజ్ సపోర్ట్ చేసేసరికి నేల మీద ఆగడం లేదే.. ఈ ఇంటి ఆడ పడుచు అని చూడకుండా నన్ను, చిన్నత్తయ్యను అంటున్నావ్ అని రుద్రాణి అంటుంది. పాపం మా చిన్నత్తయ మంచివారు. పాలలాంటి ఆమె మనసులో రుద్రాణి అనే ఉప్పు రాయి చేరింది. అందుకే విరిగిపోయింది అని కావ్య అంటుంది.

కల్యాణ్‌కు యాక్సిడెంట్

ఎన్నడు లేనిది ఈరోజు కావ్య కూడా చెరో ప్లేట్ గడ్డి పెట్టింది. ఇంకా ఇక్కడ ఉంటే స్వప్న రంగంలోకి దిగుతుంది. కుడిది కూడా కావాలంటే ఉండండి అని ఇందిరాదేవి అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీ, రుద్రాణి వెళ్లిపోతారు. లాభం లేదు. అప్పు నోరు తెరచి నిజం చెబితే గానీ కల్యాణ్ బయటపడడు. నేనే ఏదో ఒకటి చేయాలి అని రాజ్ మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే.. అప్పు దగ్గరికి కంగారుగా వెళ్లిన బంటి కల్యాణ్‌కు యాక్సిడెంట్ అయిందట, చాలా రక్తంపోయిందట.. ఆ ఇంటి డ్రైవర్ రాము చెప్పాడు అని చెబుతాడు.

దాంతో కంగారుగా అప్పు బయలుదేరుతుంటే కృష్ణమూర్తి కనిపిస్తాడు. జరిగింది చెబుతుంది. ఫ్రెండ్ కోసం వెళ్లడంలో తప్పు లేదు. కానీ, ఇలాంటి సమయంలో వెళ్తే ఏమనుకుంటారో అని కృష్ణమూర్తి అంటాడు. త్వరగా వస్తాను అని అప్పు అంటే సరేనని కృష్ణమూర్తి అంటాడు. అది చూసిన కనకం అదెక్కడి పరుగెత్తుకుంటూ వెళ్తుంది అని అడుగుతుంది. ఫ్రెండ్‌కు యాక్సిడెంట్ అయితే అలా వెళ్లకుంటే ఎలా వెళ్తుంది అని కనకంపై అరుస్తాడు కృష్ణమూర్తి.

కావాల్సిన వాళ్లు మాత్రమే

దానికి అంతలా అరవాలా.. యాక్సిడెంట్ అయిన విషయం నాకు ఏమైనా తెలుసా ఏంటీ అని కనకం అనుకుంటుంది. మరోవైపు హాస్పిటల్‌కు వెళ్లిన అప్పును రాజ్ అడ్డుకుంటాడు. ఎందుకొచ్చావ్ అని అడుగుతాడు. కల్యాణ్‌కు యాక్సిడెంట్ అయిందని వచ్చాను. చూసి వెళ్తాను అని అప్పు అంటుంది. నా తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు వాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నావా. వేరే అతన్ని పెళ్లి చేసుకుంటున్నావ్‌గా నీకేంటి సంబంధం అని రాజ్ అంటాడు.

మీ ఇంటికి వస్తే మీ వాళ్లు ఏమన్నారో తెలుసుకదా. నన్ను వెళ్లమనడానికి మీ అమ్మ నా కాళ్లు పట్టుకుంది. ఇప్పుడు నువ్ వెళ్లడానికి నీ కాళ్లు పట్టుకోవాలా అని రాజ్ అంటాడు. అయ్యో అవేం మాటలు బావా అని అప్పు అంటుంది. మీ మాటలే మీకు అప్పజెబుతున్నాను. వేరే అతన్ని పెళ్లి చేసుకునేదానివి పరాయి మగాన్ని చూడాలని అనుకోవడం తప్పు. కల్యాణ్‌కు కావాల్సిన వాళ్లు మాత్రమే చూడాలి. ఇప్పుడైనా వాన్ని ప్రశాంతంగా ఉండనివ్వు అని రాజ్ అంటాడు.

ఏ మొహం పెట్టుకుని

నేను వాన్ని చూసే వెళ్తాను అని అప్పు గట్టిగా అంటుంది. రేపు పెళ్లి అయ్యాకా వాడికి యాక్సిడెంట్ అయితే ఇలాగే వస్తావా. నువ్ వాన్ని చూడటానికి ఒప్పుకోను. నీ మనసులో వాడు లేనప్పుడు. వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు. ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డప్పుడు వాడిని చూడటానికి నువ్వు ఎవరు. మీ ఇద్దరి మధ్య ఏం లేదని మీ అమ్మ కంటే నువ్ తెగేసి చెప్పావ్. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చావ్ అని రాజ్ అంటాడు.

నాకు అర్థమైంది బావ. ఇప్పుడు నేను వాడిని ప్రేమిస్తున్నాను అని ఒప్పుకోవాలి అంతే కదా అని అప్పు అంటే.. అంత లేదు. వాడిని చూసేందుకు ఇప్పటికిప్పుడు ప్రేమిస్తున్నట్లు చెప్పాలని లేదు అని రాజ్ అంటాడు. సరే ఇది ఇప్పటికిప్పుడు చెప్పే మాట కాదు. నేను కల్యాణ్‌ను ప్రేమిస్తున్నాను. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. చచ్చేదాకా వాడు నా మనసులో నుంచి పోడు అని అప్పు అంటుంది. అదంతా పక్కన గోడకు దాక్కున్న కల్యాణ్ వింటూ ఉంటాడు. అప్పు మాటలు విని సంతోషపడతాడు.

యాక్సిడెంట్ కాలేదు

నువ్ చెప్పేది నిజమేనా అని రాజ్ అంటే.. మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను. ఇప్పటికైనా నన్ను వాడిని చూడనివ్వు. నీకు దండం పెడతాను. వాడు అనామిక వల్లే కాదు. నా వల్ల కూడా డిస్టర్బ్ అయ్యాడు. వాడికి ఏమైనా జీవితాంతం ఫీల్ అవుతాను అని అప్పు వేడుకుంటుంది. నువ్ చూడటానికి వాడు ఇక్కడ లేడు. వాడికి అసలు యాక్సిడెంటే కాలేదు అని రాజ్ అంటాడు. అవునా అని సంతోషపడినా ఎందుకు బావ అబద్ధం చెప్పావ్ అని అప్పు అంటుంది.

నీ నుంచి నిజం రాబట్టేందుకు ఈ నాటకం ఆడాను. ఎందుకు అబద్ధం చెప్పావ్ అని రాజ్ అడుగుతాడు. ప్రేమించిన వాళ్లందిరికీ పెళ్లి చేసుకునే అవకాశం రాదు. నా వల్ల వాడు కూడా ఇబ్బంది పడ్డాడు. నా బతుకు బజారునే పడింది. ఇంతా జరిగినా మీ వాన్ని పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్లు నన్ను బతకనివ్వరు. నా అక్కలను మనశ్సాంతిగా ఉండనివ్వరు. ఇప్పుడు నా పెళ్లి జరిగితేనే వాళ్లు మనశ్సాంతిగా ఉంటారు. ఇప్పుడు నిజం చెప్పాను కదా అని నా పెళ్లి చెడగొట్టకండి అని అప్పు అంటుంది.

నువ్ రిటైర్‌మెంట్ తీసుకో

కవి బాగున్నాడు. అది నాకు చాలు అని వెళ్లిపోతుంది అప్పు. పక్కనే ఉన్న కల్యాణ్ బయటకొస్తాడు. విన్నావ్ కదా అది విషయం. అప్పు మనసులో నీపై అంత ప్రేమ ఉందని తెలిసాకా ఏం చేస్తున్నావ్‌రా. నీకు కావాల్సింది చేయి. ధైర్యంగా చేయు. నీ వెనుక నేను ఉన్నాను అని రాజ్ అంటాడు. మరోవైపు కల్యాణ్‌ను తీసుకుని రాజ్ ఎక్కడికి వెళ్లాడో నీకు తెలుసు. ఎక్కడికి వెళ్లారు అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. నాకు తెలియదు అని కావ్య అంటుంది.

రాయబారానికి పంపవా అని రుద్రాణి అంటే.. నీకు వయోబారం ఎక్కువైంది అత్త. నువ్ రిటైర్‌మెంట్ తీసుకో అని స్వప్న అంటుంది. ఏంటీ అత్తయ్య ఇది ప్రతిదానికి నన్నే దోషిని చేస్తున్నారు చిన్నత్తయ్య అని కావ్య అంటుంది. నీ చిన్నత్తయ్య తన గౌరవం పోగొట్టుకుంది. నీ అక్క తన అత్తకు ఎలాంటి భాషలో సమాధానం ఇస్తుందో అదే దారిని అనుసరించు అని అపర్ణ అంటుంది. నీ కోడలికి ఇదేనా నువ్ చెప్పేది అని ధాన్యలక్ష్మీ అంటుంది.

భార్యను అదుపులో పెట్టుకోని

నీ కోడలికి చెప్పినట్లు చెప్పట్లేదు. తనను అనవసరంగా అన్నవాళ్ల దుమ్ము దులుపమని చెబుతున్నాను అని అపర్ణ అంటుంది. వెళ్లింది అన్నదమ్ములే కదా. నీ కొడుకు రాక్షస వివాహం చేసి తీసుకురారులే. నువ్ ఇంకో మాట మాట్లాడితే ప్రకాశం చెంప పగులుతుంది అని ఇందిరాదేవి అంటుంది. నా చెంప ఎందుకు పగులుతుందమ్మా అని ప్రకాశం అంటాడు. భార్యను ఆ మాత్రం అదుపులో పెట్టుకోని చవటవైనందుకు నిన్ను కొట్టాలి అని ఇందిరాదేవి అంటుంది.

ఇంతలో రాజ్ కల్యాణ్ వస్తారు. ఏవండి ఎక్కడికి వెళ్లారు అని కావ్య అడిగితే.. నీకెందుకు అని రాజ్ అంటాడు. ఇప్పటివరకు మీ పిన్ని పెద్ద పంచాయితీ పెట్టారు. మీరు ఎక్కడికి వెళ్లారో నాకు తెలుసట అని కావ్య అంటుంది. కళావతి జోలికి రాకూడదని ఇందాకే చెప్పాను అని రాజ్ అంటుంటే.. ఎక్కడికి వెళ్లావురా అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. నీకెందుకు అని కల్యాణ్ అంటాడు. అప్పును కలవడానికే కదా వెళ్లిందని ధాన్యలక్ష్మీ అంటుంది.

మొదటి శుభలేఖ మీకు

దానికి నేను సమాధానం చెబుతాను అని అప్పు పెళ్లి పత్రికలు పట్టుకుని కనకం ఎంట్రీ ఇస్తుంది. ఎవరు ఎవరిని కలవడానికి రాలేదు. ఎందుకంటే నేనే ఎవ్వరిని రానివ్వను అని కనకం అంటుంది. అంటే రాజ్ కల్యాణ్ మీ ఇంటికి రాలేదా అని రుద్రాణి అంటే.. అది అక్కడ అడుగు. నేను ధాన్యలక్ష్మీతో మాట్లాడుతున్నాను అని కనకం చెబుతుంది. ఈ ఇంట్లో పెద్దవాళ్లు ఉన్న మొదటి శుభలేఖ మీకు ఇవ్వాల్సిన కర్మ పట్టింది నాకు అని శుభలేఖ ఇస్తుంది కనకం.

నా కూతురు అపూర్వ.. అప్పు పెళ్లి.. చిరంజీవి శ్రీరామ్.. ముహుర్తం పత్రికలో రాసి ఉంది. మాకు ఆస్తి లేదు కాబట్టి.. నా కూతురు పెళ్లి గుడిలో జరిపిస్తున్నాం. వచ్చి చూసి తరించండి. ఆ ముదనష్టపు అనామికలా నిందలు వేయకుండా వచ్చి ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తున్నాను అని కనకం చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇంటి పరువు కాపాడుతున్నా

తర్వాతి ఎపిసోడ్‌లో అప్పు, కల్యాణ్‌లను విడదీస్తున్నావని కావ్యను అంటాడు రాజ్. నేను విడదీయడం లేదు. మా ఇంటి పరువు కాపాడుతున్నాను అని కావ్య సమాధానం చెబుతుంది. మీ అందరి మూర్ఖత్వంతో ఇద్దరి జీవితాలు నాశనం చేస్తున్నారని రాజ్ వెళ్లిపోతాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం