Brahmamudi July 26th Episode: బ్రహ్మముడి- కల్యాణ్ పెళ్లిపై ధాన్యలక్ష్మీ కావ్య ఫైట్- బోడి మర్యాద ఇచ్చేదే లేదన్న కళావతి
26 July 2024, 7:29 IST
Brahmamudi Serial July 26th Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 26వ తేది ఎపిసోడ్‌లో కావ్యపై లేనిపోని మాటలు చెప్పి ధాన్యలక్ష్మీని ఉసిగొలుపుతుంది రుద్రాణి. దాంతో కల్యాణ్ పెళ్లిపై పంచాయితీ పెడుతుంది ధాన్యలక్ష్మీ. దీంతో కావ్యతో గొడవ అవుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ జూలై 26వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ధాన్యలక్ష్మీ వంటింట్లో పాటలు వింటూ కూరగాయలు కట్ చేస్తుంటుంది. అప్పుడే వచ్చిన రుద్రాణి నీ కొడుకు కొంపలు ముంచే పని చేస్తుంటే నువ్ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నావా. నిన్ను నిప్పులో కాల్చిన కొలిమిలా మంట పుట్టిస్తాను అనుకుని ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తుంది.
కల్యాణ్‌కు భార్యగా
నాకు తెలిసిన అమ్మాయి సౌజన్య ఉంది. నేను వాళ్లతో మాట్లాడాను. కల్యాణ్‌ను పెళ్లి చేసుకోడానికి వాళ్లకు ఓకే. ఓసారి నువ్ మాట్లాడితే బాగుంటుంది అని రుద్రాణి చెబుతుంది. కల్యాణ్‌కు మళ్లీ పెళ్లా. విడాకులు ఇచ్చి రెండు రోజులు కూడా కాలేదు. ఇప్పుడే పెళ్లి అంటే వాడు ఒప్పుకుంటాడా అని ధాన్యలక్ష్మీ అంటుంది. నువ్ ఇలాగే అనుకుంటే.. కావ్య అనుకున్న పని చేస్తుంది. ఇప్పుడు కల్యాణ్ భార్య స్థానం ఖాలీగా ఉంది. తన చెల్లెలు అప్పు లవ్ చేస్తుందని తెలుసు. ఎలాగైనా కల్యాణ్‌కు అప్పును భార్యగా తీసుకొస్తుంది అని రుద్రాణి అంటుంది.
తను అనుకుంటే సరిపోతుందా. తల్లిగా నేను అనుకోవద్దా. నాకు అప్పు అంటే నచ్చదు. నేను వద్దనుకుంటే ఎలా కోడలిగా వస్తుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. నీకు కావ్య గురించి పూర్తిగా తెలియదు. నిన్ను కూడా మార్చేస్తుంది. కావ్య ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు తన స్థానం ఏంటీ. స్టోర్ రూమ్‌లో పడుకుంది. కానీ, తర్వాత కావ్య స్థానం ఎలా పెరిగిపోయింది. చీదరించుకున్న మా వదినా ఇప్పుడు కావ్యను నెత్తినపెట్టుకుని చూసుకుంటుంది. ఇదంతా ఎలా జరిగిందని అనుకుంటున్నావ్ అని రుద్రాణి అంటుంది.
మొగుడు అవుతుంది
స్వప్న విషయంలో కూడా కావ్యను ఆపగిలిగామా. అంతెందుకు రాజ్ తనను భార్యగానే చూడలేను అని ఛాలెంజ్ చేశాడు. కానీ, ఈరోజు తన పరిస్థితి ఏంటీ.. డ్రైవర్ చేతికి దొరికిన స్టీరింగ్‌లాగా కావ్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. ఇన్ని ఘనకార్యాలు చేసిన కావ్య ఒక్కసారి అప్పును ఇంటి కోడలిగా చేయాలని అనుకుంటే ఏంటీ పరిస్థితి. కావ్య అందరికీ కోడలు అయింది. కానీ, అప్పు మాత్రం అందరికీ మొగుడు అవుతుంది. నీకు యముడు అవుతుంది. గుర్తు పెట్టుకో అని వెళ్లిపోతుంది రుద్రాణి.
మరోవైపు అప్పుకు ఫిక్స్ అయిన పెళ్లి గురించి సంతోషిస్తుంది కనకం. వాళ్ల పద్ధతి చాలా నచ్చిందని అంటుంది. నాకు మాత్రం బాధగా ఉంది. చిన్నప్పటి నుంచి అప్పు చాలా కష్టపడింది. వాళ్లు అంతగా డబ్బులేని వాళ్లు. ఏదైనా కష్టమొస్తే ఎలా. మీలా మధ్యతరగతిలా బతకాల్సిందేనని అని స్వప్న అంటుంది. నాకు ఆ భయాలు ఏం లేవు ఇప్పుడు. నిన్ను డబ్బున్న రాహుల్‌కు ఇచ్చి చేస్తే నువ్ సంతోషంగా ఉన్నావా. కావ్య కూడా మొన్నటివరకు కష్టాలు పడింది. డబ్బుతో ఆనందం అనేది భ్రమ మాత్రమే అని కనకం అంటుంది.
భరోసా ఇచ్చిన కావ్య
వాళ్లు కట్నకానుకలు, సింపుల్‌గా పెళ్లి చేయమన్నారు కదా అని లేనివాళ్లు అని కాదు. మంచి మనసున్న వాళ్లు. వాళ్లు అప్పు గురించి పూర్తిగా అర్థం చేసుకుని వచ్చారు అని కృష్ణమూర్తి అంటాడు. నీ భయం నాకు అర్థమైందే తనకు ఏదైనా కష్టమొస్తే మనం ఉన్నాం కదా అని కావ్య అంటుంది. అంతేలే అని స్వప్న అంటుంది. పెళ్లికి తక్కువ టైమ్ ఉంది. ఎలా అని కంగారుగా ఉందని కృష్ణమూర్తి అంటే.. మేమున్నాం కదా మేము చూసుకుంటామని కావ్య అంటుంది.
ఇంతలో అప్పు అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. డల్‌గా ఉన్న అప్పును చూసి ఏంటే ఇలా ఉన్నావ్. పెళ్లి ఇష్టం లేదా. ఏదైనా కారణం ఉందా అని కావ్య అడుగుతుంది. అదేం లేదక్కా. అమ్మ నాన్నలు నావల్ల చాలా అవమానాలు పడ్డారు. కానీ, నా తప్పు మాత్రం ఏం లేదని నమ్మారు అని అప్పు అంటుంది. డబ్బు లేకుంటే నేను బతకలేనే. నువ్ ఎలా ఉంటావే అని స్వప్న అడుగుతుంది. మనం పుట్టకముందే దరిద్రం పుట్టిందే. అది నాకు ఇంకో అక్క అనుకుంటా అని అప్పు అంటుంది.
కలవమన్న కల్యాణ్
నువ్ ఇలాగే ధైర్యంగా ఉండటమేనే కావాల్సింది అని కావ్య అంటుంది. తర్వాత ఒంటరిగా ఉన్న అప్పుకు కల్యాణ్ కాల్ చేస్తాడు. కానీ, అప్పు కాల్ లిఫ్ట్ చేయదు. మళ్లీ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తుంది. పెళ్లి చూపులు జరిగాయంట కదా. అందుకే అవైడ్ చేస్తున్నావా. నా వల్ల ఏదైనా సమస్య వస్తుందనా. ఒక్కసారి నీతో మాట్లాడాలి. కలిసి మాట్లాడి వెళ్లిపోతాను అని ప్రాధేయపడతాడు కల్యాణ్. ముందు ఒప్పుకోని అప్పు తర్వాత ఒప్పుకుంటుంది.
మరోవైపు ఇంట్లో అందరినీ పిలిచి ధాన్యలక్ష్మీ పంచాయితీ పెడుతుంది. ఏంటని ఇందిరాదేవి అడుగుతుంది. కల్యాణ్ కోసం ఓ మంచి సంబంధం వచ్చింది. అందుకే వాడికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. దీంతో అంతా షాక్ అవుతారు. నేను ఇప్పటిదాకా నీతోనే ఉన్నాను కదా. నాకెందుకు చెప్పలేదు. అనామికలా నువ్ కూడా భర్తకు విలువ ఇవ్వొద్దు అనుకున్నావా అని ప్రకాశం అంటాడు. మధ్యలో రుద్రాణి దూరుతుంటే.. నువ్ భార్యాభర్తల మధ్య మందరలా ఎందుకు దూరుతున్నావని ప్రకాశం అంటాడు.
తొక్కలో డిస్కషన్
నిజం చెప్పు. నీకు ఈ పెళ్లి ఆలోచన రుద్రాణే కదా ఇచ్చింది. కల్యాణ్ మనసు ముక్కలు అయిపోయింది. నీ ముద్దుల కోడలు చేసిన దానికి పెళ్లి అన్న, పెళ్లాం అన్న విరక్తి వచ్చింది. ఇలాంటప్పుడు మళ్లీ పెళ్లి అంటావేంటీ.. అని ప్రకాశం అంటాడు. అవును, విడాకులిచ్చి రెండు రోజులు కాలేదు. ఇప్పుడు పెళ్లి ఏంటీ. నలుగురు వింటే నవ్విపోతారు. పెళ్లి కోసమే అనామికకు విడాకులు ఇచ్చారు అనుకుంటారు అని ఇందిరాదేవి అంటుంది.
ఇంతలో కావ్య స్వప్న వస్తారు. ఏదో తొక్కలో డిస్కషన్ పెట్టినట్లుంది మీ చిన్నత్త అని స్వప్న అంటుంది. కల్యాణ్ గురించి అంతా తెలిసే సంబంధం వచ్చింది. తర్వాత లేట్ చేస్తే సంబంధాలు రావని ధాన్యలక్ష్మీ అంటుంది. కవిగారికి పెళ్లా. కవిగారి మానసిక పరిస్థితి తెలిసి కూడా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు. కవిగారు ఈ పెళ్లికి ఒప్పుకోరు అని కావ్య అంటుంది. వాడి గురించి నువ్వెందుకు అంటున్నావ్. పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదా. వాడికి ఇంకొకరితో పెళ్లి చేయడం నీకిష్టం లేకనా అని ధాన్యలక్ష్మీ అంటుంది.
నీ ప్లానే కదా
కల్యాణ్ నీకు ప్రియమని మరిది కదా. తల్లి తర్వాత చూస్తాడు. అలాంటిది వాడి మంచికి ఎందుకు అడ్డు పడుతున్నావ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది. నేను అడ్డు పడటం ఏంటీ. కవిగారి పరిస్థితి బాగాలేదని చెబుతున్నాను అని కావ్య అంటుంది. అంతేనా.. నీ మనసులో అంతే ఉందా. లేదా నీ ప్లాన్ వర్కౌట్ కాదనా అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ప్లాన్ ఏంటీ అని కావ్య అడుగుతుంది. నీ చెల్లి అప్పుతో నా కొడుకుకు పెళ్లి చేయించాలనేది నీ ప్లాన్. నాకు అర్థమైంది అని ధాన్యలక్ష్మీ అంటుంది.
అపర్ణ మధ్యలో వస్తే.. అక్క నీ కోడలు అంతా గొప్పదేం కాదు. ఇప్పటికీ తన చెల్లెలిని కల్యాణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఆంటీ.. మీరు మా అత్తతో మంతనాలు ఆపడం ఆపితే తప్పా బాగుపడరు. ఇది మీ పుర్రెలో పుట్టిన బుద్ధి కాదు. మా అత్తే నేర్పించి ఉంటుంది అని స్వప్న అంటుంది. హేయ్ షటప్. తనేమైనా చిన్నపిల్లా నేను నేర్పిస్తే నేర్చుకోడానికి అని రుద్రాణి అంటుంది.
ముగ్గురు ఏలుదామని
స్వప్న నాకు అన్ని తెలుసు. నేనేం ఇంటికి కొత్తగా రాలేదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. నీ కొడుకు పెళ్లి చేయడం వరకు ఓకే. కావ్య మీద నిందలు వేసే హక్కు నీకు లేదు. ఎందుకు అనవసరంగా ఆరోపిస్తున్నావ్ అని ఇందిరాదేవి అడుగుతుంది. మీరు అనుకున్నట్లు కావ్య ఏం మంచిది కాదు. మరిది గారు అంటూ తన చెల్లెలిని ఈ ఇంటికి కోడలు చేద్దామనుకుంటుంది. దాంతో ఈ దుగ్గిరాల కుటుంబాన్ని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఏలుదామనుకుంటున్నారు అని ధాన్యలక్ష్మీ అంటుంది.
ఇంతకుముందు అనామిక ఉంది. ఇప్పుడు మీరు తయారు అయ్యారా. దానికంటే బ్రెయిన్ లేదు గడ్డి తింటుంది. మీకేమైంది.. నా మీద పడుతున్నారు. మీరు అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా అని కావ్య అంటే.. ఏయ్.. మాటలు మర్యాదగా రాని అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంకా మీకేంటి మర్యాదా ఇచ్చేది. నా క్యారెక్టర్‌నే తప్పు పడుతున్నప్పుడు. నా చెల్లెల్లిని తప్పు పడుతుంటే ఇంకా మీకు ఇచ్చేదేంటీ బోడి మర్యాదా అని కావ్య అంటుంది.
ఎందుకు మాటిచ్చావ్
శభాష్ కావ్య అలాగే ఉండమని స్వప్న అంటుంది. చూశావా అక్క నీ కోడలు ఎలా అంటుందో అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎవరి ఏమైనా అంటే పడొద్దని నేను నా కోడలికి చెప్పాను అని అపర్ణ అంటంది. దాంతో ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కల్యాణ్‌ను పెళ్లికి ఒప్పిస్తానని ఎందుకు మాటిచ్చావ్ అని కావ్యపై ఫైర్ అవుతాడు రాజ్. కల్యాణ్ మనసులో అప్పు ఉందని చెబుతాడు. దాంతో కల్యాణ్‌ను మీరు అప్పును ప్రేమిస్తున్నారా అని కావ్య అడుగుతుంది. దానికి కల్యాణ్ షాక్ అవుతాడు.
టాపిక్