Ramayana: నితేశ్ తివారీ ‘రామాయణం’లో దిగ్గజ యాక్టర్! ఏ పాత్రలో అంటే..
12 February 2024, 17:38 IST
- Ramayana: నితేశ్ తివారీ దర్శకత్వం వహించనున్న రామాయణం సినిమా గురించి మరో సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ఓ దిగ్గజ నటుడు కీలకపాత్ర పోషించనున్నట్టు రూమర్లు వస్తున్నాయి.
అమితాబ్ బచ్చన్
Ramayana: బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ రూపొందించనున్న ‘రామాయణం’ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కించనుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీరాముడిగా బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి నటించనున్నారు. రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ నటిస్తారని తెలుస్తోంది. కాగా, తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు కీలకపాత్ర పోషించనున్నారనే సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే.
రామాయణం చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ నటించనున్నారని తెలుస్తోంది. శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు పాత్రను అమితాబ్ పోషించనున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, మూవీ టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గతంలో బ్రహ్మాస్త్ర చిత్రంలో రణ్‍బీర్, అమితాబ్ కలిసి నటించారు.
రామాయణంలో హనుమంతుడిగా సన్నీ డియోల్ నటించడం కూడా దాదాపు ఖరారైంది. కైకేయిగా లారాదత్తా, కుంభకర్ణుడిగా బాబీ డియోల్ చేస్తారని కూడా టాక్ బయటికి వచ్చింది. అయితే, ఈ వివరాలను మూవీ టీమ్ వెల్లడించాల్సి ఉంది. ఈ చిత్రంలో శార్పనఖ పాత్ర కోసం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‍తో మూవీ టీమ్ చర్చలు జరుపుతుందని కూడా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
షూటింగ్ ఎప్పటి నుంచి..
రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీ గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ అయింది. బాక్సాఫీద్ వద్ద భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన బ్రేక్ తీసుకుంటున్నారు. రణ్‍బీర్ తర్వాతి ప్రాజెక్ట్ రామాయాణం చిత్రమే. ఈ సినిమా షూటింగ్ మార్చి లేదా ఏప్రిల్‍లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. సాయిపల్లవి ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తయ్యాక ఆమె రామాయణం షూటింగ్‍కు వెళతారు.
కన్నడ స్టార్ యశ్ ప్రస్తుతం టాక్సిక్ అనే చిత్రం చేస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ మూవీ చిత్రం చేస్తున్నారు. అయితే, రామాయణం మూవీ కోసం ఆయన జూలైలో డేట్లు కేటాయించారని ఇటీవల వార్తలు వచ్చాయి. రామాయణం మొదటి భాగంలో ఆయన పోషించే రావణుడి పాత్ర తక్కువే ఉంటుందని తెలుస్తోంది.
రామాయణాన్ని మూడు భాగాలుగా తీసుకురావాలని డైరెక్టర్ నితేశ్ తివారీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‍తో అత్యుత్తమ గ్రాఫిక్స్‌తో తెరకెక్కించాలని ఆయన నిర్ణయించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ పీఎఫ్‍ఎక్స్ కంపెనీ డీఎన్ఈడీ ఈ చిత్రం కోసం పని చేయనుంది. త్రీడీలో కూడా ఈ చిత్రాన్ని తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
రామాయణం ఆధారంగా గతేడాది వచ్చిన ఆదిపురుష్ సినిమాపై అసంతృప్తి ఎదురైంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై వివాదాలు, విమర్శలు వచ్చాయి. దీంతో రామాయణం విషయంలో నితేశ్ తివారీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి పొరపాట్లు జరగకుండా.. తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దాదాపు సంవత్సర కాలంగా ఆయన ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులే చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. రామాయణం మొదటి భాగాన్ని 2025 దీపావళికి రిలీజ్ చేసేలా నితేశ్ తివారీ ప్లాన్ చేసుకుంటున్నారు.