Adipurush: 100 శాతం నాది తప్పే.. కానీ ఆ ఉద్దేశం లేదు: ఆదిపురుష్ రచయిత-adipurush writing is my 100 percent mistake says manoj muntashir ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush: 100 శాతం నాది తప్పే.. కానీ ఆ ఉద్దేశం లేదు: ఆదిపురుష్ రచయిత

Adipurush: 100 శాతం నాది తప్పే.. కానీ ఆ ఉద్దేశం లేదు: ఆదిపురుష్ రచయిత

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 10, 2023 05:03 PM IST

Adipurush - Manoj Muntashir: ఆదిపురుష్‍పై వచ్చిన విమర్శలపై తాజాగా మరోసారి స్పందించారు ఆ సినిమా రచయిత ముంతాషిర్ శుక్లా. ఈ మూవీ విషయంలో తాను 100 శాతం తప్పు చేశానని అన్నారు. మరిన్ని విషయాలు చెప్పారు.

Adipurush: 100 శాతం నాది తప్పే.. కానీ ఆ ఉద్దేశం లేదు: ఆదిపురుష్ రచయిత
Adipurush: 100 శాతం నాది తప్పే.. కానీ ఆ ఉద్దేశం లేదు: ఆదిపురుష్ రచయిత

Adipurush - Manoj Muntashir: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించిన ఆదిపురుష్ సినిమా ఈ ఏడాది జూన్‍లో రిలీజ్ అయింది. మహా ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ఓం రౌత్. ఈ చిత్రానికి మాటల రయితగా మనోజ్ ముంతాషిర్ శుక్లా వ్యవహరించారు. డైలాగ్స్ అందించారు. అయితే, ఆదిపురుష్ సినిమా విషయంలో చాలా వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని డైలాగ్‍ల విషయంలో మనోజ్ ముంతాషిర్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. కాగా, తాజాగా ఈ విషయంపై మరోసారి మాట్లాడారు ముంతాషిర్.

ఆదిపురుష్ మూవీ డైలాగ్‍ల విషయంలో 100 శాతం తప్పు తనదేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు మనోజ్ ముంతాషిర్. ఈ మూవీపై వివాదం రేగిన సమయంలో తనకు హత్య బెదిరింపులు వచ్చాయని, దీంతో కొన్నాళ్లు విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. తాను ఎవరి మనోభావాలను కించపరచాలని అనుకోలేదని మనోజ్ స్పష్టం చేశారు.

ఆదిపురుష్ సినిమాకు తాను సరైన డైలాగ్స్ అందించలేదని మనోజ్ ముంతాషిర్ అన్నారు. “అందులో ఎలాంటి సందేహం లేదు. నేను బాగా రాశానని చెప్పి సమర్థించుకునేందుకు నేను అంత అభద్రతాభావం ఉన్న వ్యక్తిని కాదు. అది 100 శాతం తప్పే. నేను పెద్ద తప్పు చేశా. ఈ సంఘటన నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటా” అని మనోజ్ చెప్పారు.

ఆదిపురుష్ డైలాగ్స్ విషయంలో తాను చేసిన పొరపాటు ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని మనోజ్ ముంతాషిర్ అన్నారు. వాటి వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పారు. ఎవరి మనోభావాలను కించపరచాలన్న ఉద్దేశం తనకు అసలు లేదని వివరించారు.

అయితే, ఆదిపురుష్‍పై వివాదం వచ్చినప్పుడు తొలుత తనను తాను సమర్థించుకున్నారు మనోజ్ ముంతాషిర్. దీంతో విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. అయితే, తాను అప్పుడు స్పందించకుండా ఉండాల్సిందని ఇప్పుడు మనోజ్ అన్నారు. “అది కూడా నా పెద్ద తప్పు. అప్పుడు నేను మాట్లాడాల్సింది కాదు. నా వివరణపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినా.. అది సమర్థనీయమే” అని మనోజ్ అన్నారు. తన గత పనితనం, రికార్డ్స్ చూసి తనకు మరో అవకాశం వస్తుందని నమ్ముతున్నట్టు మనోజ్ ముంతాషిర్ చెప్పారు.

ఈ ఏడాది జూన్ 16న ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయింది. ఈ చిత్రంలో రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లంకేశుడిగా సైఫ్ అలీఖాన్, భజరంగ్‍గా దేవ్‍దత్ నాగే నటించారు. ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్‍లపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అలాగే, ఓంరౌత్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం, గ్రాఫిక్స్ విషయాలపై కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా ఆదిపురుష్ అంచనాలను అందుకోలేకపోయింది. 

Whats_app_banner