తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Arjun Reddy: అర్జున్ రెడ్డిలాంటి అబ్బాయిలు ఉన్నారు.. అమ్మాయిలు వాళ్ల వెంటే పడతారు: బాలీవుడ్ హీరో కామెంట్స్ వైరల్

Arjun Reddy: అర్జున్ రెడ్డిలాంటి అబ్బాయిలు ఉన్నారు.. అమ్మాయిలు వాళ్ల వెంటే పడతారు: బాలీవుడ్ హీరో కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu

04 December 2024, 7:22 IST

google News
    • Arjun Reddy: అర్జున్ రెడ్డిలాంటి అబ్బాయిలు నిజ జీవితంలోనూ ఉంటారని ఈ మూవీ హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో నటించిన నటుడు షాహిద్ కపూర్ అనడం విశేషం. అమ్మాయిలు కూడా వాళ్ల వెంటే పడతారని అతడు అభిప్రాయపడ్డాడు.
అర్జున్ రెడ్డిలాంటి అబ్బాయిలు ఉన్నారు.. అమ్మాయిలు వాళ్ల వెంటే పడతారు: బాలీవుడ్ హీరో కామెంట్స్ వైరల్
అర్జున్ రెడ్డిలాంటి అబ్బాయిలు ఉన్నారు.. అమ్మాయిలు వాళ్ల వెంటే పడతారు: బాలీవుడ్ హీరో కామెంట్స్ వైరల్

అర్జున్ రెడ్డిలాంటి అబ్బాయిలు ఉన్నారు.. అమ్మాయిలు వాళ్ల వెంటే పడతారు: బాలీవుడ్ హీరో కామెంట్స్ వైరల్

Arjun Reddy: అర్జున్ రెడ్డి మూవీ తెలుగులో ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ యువతకు ఓ కొత్త హీరోను అందించింది. అదే సినిమాను అదే సందీప్ హిందీలో కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ హీరోగా తీశాడు. అక్కడా హిట్ కొట్టాడు. అయితే 2019లో వచ్చిన ఈ సినిమాపై తాజాగా షాహిద్ మాట్లాడాడు.

అలాంటి అబ్బాయిలు ఉన్నారు

షాహిద్ కపూర్ నటించిన కబీర్ సింగ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.250 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా ఇప్పటికీ వివాదాస్పదమే. అందులో కబీర్ లాంటి వ్యక్తులను అసలు సమాజం అంగీకరిస్తుందా అన్న చర్చ నడుస్తూనే ఉంది. దీనిపై తాజాగా ఫేయ్ డిసౌజాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ స్పందించాడు.

ఆ పాత్ర చేసిన పనులను తాను చాలా వరకు అంగీకరించకపోయినా.. అలాంటి అబ్బాయిలు మాత్రం సమాజంలో ఉన్నారని ఈ సందర్బంగా అతడు చెప్పాడు. "నేనెవరు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. మనమందరం ఎలా కావచ్చు అన్నదాని గురించే ఇదంతా. మనం ఎలా కావాలనుకున్నదాని గురించి. దానిని బట్టే మనం ఏది నేర్చుకోవాలన్నది నిర్ణయించుకుంటాం. అంతమాత్రాన జీవితంలో ఏం జరుగుతుందో చూపించకుండా ఉండటం సరికాదు.

కబీర్ చేసిన చాలా పనులు అసలు ఆమోదయోగ్యం కావని నేను అనుకుంటాను. అలాంటి వ్యక్తిని నేను అంగీకరించను. కానీ అలాంటి వాళ్లు నిజంగా ఉన్నారా? అలాంటి వాళ్లతో అమ్మాయిలు ప్రేమలో పడతారా? అవును వాళ్లు ప్రేమిస్తారు. మరి దీనిపై మేము సినిమా ఎందుకు తీయకూడదు? అది చూసి బయటకు వెళ్లిన తర్వాత మీకు నచ్చొచ్చు.నచ్చకపోవచ్చు. ప్రేక్షకుడిగా అది మీ ఇష్టం" అని షాహిద్ అన్నాడు.

కబీర్ సింగ్ మూవీ గురించి..

కబీర్ సింగ్ 2019లో వచ్చిన బాలీవుడ్ మూవీ. ఇది 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీకి రీమేక్. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.51 కోట్లు వసూలు చేసింది. విజయ్ దేవరకొండకు ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది.

మందుకు, అమ్మాయిలకు బానిసైన ఓ డాక్టర్ చుట్టూ తిరిగే కథ ఇది. తెలుగులో ఈ సినిమా సక్సెస్ కావడంతో హిందీలోనూ రీమేక్ చేశారు. అక్కడా సంచలన విజయం సాధించింది. ఏకంగా రూ.250 కోట్లు వసూలు చేసింది. ఇక కబీర్ సింగ్ మూవీలో షాహిద్ కపూర్ సరసన్ కియారా అద్వానీ నటించింది. అయితే ఈ సినిమా హిట్ కొట్టినా ఎన్నో విమర్శలు వచ్చాయి.

కబీర్ పాత్ర, విపరీతమైన పురుషాధిపత్యాన్ని చూపించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను ట్రోల్ చేశారు. అతడు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ యానిమల్ మూవీపైనా ఇలాంటి విమర్శలే రావడం గమనార్హం. అయితే అతడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా యానిమల్ సీక్వెల్ కూడా తీసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రభాస్ తో స్పిరిట్ అనే మరో మూవీ కూడా సందీప్ రెడ్డి తీస్తున్నాడు.

తదుపరి వ్యాసం