Bigg Boss: ఇక బిగ్ బాస్ చేయను.. ఇదే నా చివరి సీజన్.. టాప్ టీఆర్పీ ఇచ్చినందుకు థ్యాంక్స్: స్టార్ హీరో సంచలన నిర్ణయం
14 October 2024, 16:21 IST
Bigg Boss: ఇక బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించను అంటూ స్టార్ హీరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇదే తన చివరి సీజన్ కూడా అనౌన్స్ చేశాడు. దీంతో ఈసారి ఈ రియాల్టీ షోకి రికార్డు టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతున్నాయి.
ఇక బిగ్ బాస్ చేయను.. ఇదే నా చివరి సీజన్.. టాప్ టీఆర్పీ ఇచ్చినందుకు థ్యాంక్స్: స్టార్ హీరో సంచలన నిర్ణయం
Bigg Boss: బిగ్ బాస్.. భాషలకు అతీతంగా ప్రేక్షకుల ఆదరణ సంపాదించిన రియాల్టీ షో. మన దేశంలో హిందీలో మొదలై తర్వాత చాలా ప్రాంతీయ భాషల్లోకి వచ్చింది. మన తెలుగులోనూ వస్తోంది. ఇక కన్నడలో ప్రస్తుతం 11వ సీజన్ నడుస్తోంది. అయితే ఈ షోకి హోస్ట్ గా ఉన్న అక్కడి స్టార్ హీరో కిచ్చా సుదీప్.. ఇక తాను ఈ షో చేయబోనని తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
బిగ్ బాస్.. ఇదే నా చివరి సీజన్
బిగ్ బాస్ తెలుగుకు అక్కినేని నాగార్జున ఎలా అయితే స్టార్ అట్రాక్షన్ గా ఉన్నాడో బిగ్ బాస్ కన్నడకు కిచ్చా సుదీప్ కూడా అలాగే నిలుస్తున్నాడు. దశాబ్ద కాలానికిపైగా ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఏకధాటిగా 11 సీజన్లు హోస్ట్ చేసిన తర్వాత ఇక తాను ఈ షో చేయబోనని చెప్పి అభిమానులను షాక్ కు గురి చేశాడు. తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఆదివారం (అక్టోబర్ 13) రాత్రి సుదీప్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
"బిగ్ బాస్ కన్నడ 11కు మీరు ఇస్తున్న రెస్పాన్స్ కు థ్యాంక్స్. ఈ షోపై, నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు టీవీఆర్ (టెలివిజన్ రేటింగ్) నిదర్శనం. పదేళ్ల పాటు కలిసి చేసిన ప్రయాణం చాలా గొప్పగా సాగింది. ఇక ఇప్పుడు నేను జీవితంలో నా తర్వాతి దశపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది.
బిగ్ బాస్ కన్నడ హోస్ట్ గా ఇదే నా చివరి సీజన్. చాలా ఏళ్లుగా బిగ్ బాస్ ఫాలో అవుతున్న వాళ్లు, కలర్స్ వాళ్లు నా ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారని అనుకుంటున్నాను. ఈ సీజన్ ను అత్యుత్తమంగా మారుద్దాం. నేను కూడా మీకు సాధ్యమైనంత వినోదాన్ని అందిస్తాను. అందరికీ థ్యాంక్స్" అంటూ కిచ్చా సుదీప్ ట్వీట్ చేశాడు.
బిగ్ బాస్ కన్నడ.. సుదీప్ సుదీర్ఘ ప్రయాణం
బిగ్ బాస్ కన్నడ తొలి సీజన్ 2013లో మొదలైంది. అప్పటి నుంచీ కిచ్చా సుదీపే ఈ షో హోస్ట్ గా ఉంటూ వస్తున్నాడు. మధ్యలో 2021లో బిగ్ బాస్ కన్నడ మినీ సీజన్, తర్వాత 2022లో బిగ్ బాస్ కన్నడ ఓటీటీ సీజన్లు కూడా వచ్చాయి. ఇక సెప్టెంబర్ 29 నుంచి కలర్స్ కన్నడలో బిగ్ బాస్ కన్నడ స్ట్రీమింగ్ అవుతోంది. హెవెన్ అండ్ హెల్ థీమ్ తో ఈసారి ఈ రియాల్టీ షో వచ్చింది.
అయితే సుదీప్ లేని బిగ్ బాస్ కన్నడను ఊహించుకోవడం కష్టం అంటున్నారు అతని అభిమానులు. సుదీప్ ఈ అనౌన్స్‌మెంట్ చేయగానే చాలా మంది షాక్ కు గురవుతూ కామెంట్స్ చేశారు. నువ్వు లేని ఈ షో చూడలేమని కొందరు అభిమానులు సుదీప్ పోస్టుపై కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు సుదీప్ ప్రస్తుతం బిల్లా రంగా బాషా అనే మూవీ చేయబోతున్నాడు. అనూప్ భండారీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మధ్యే సుదీప్ 51వ పుట్టిన రోజు సందర్భంగా ఓ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఇదే కాకుండా ప్రస్తుతం మ్యాక్స్ అనే మరో మూవీలోనూ కిచ్చా సుదీప్ నటిస్తున్నాడు.