Pallavi Prashanth Arrest: బిగ్‍బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్
20 December 2023, 20:43 IST
- Pallavi Prashanth Arrest: బిగ్‍బాస్ టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్‍ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఇంట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటికి వచ్చాయి.
Pallavi Prashanth: బిగ్‍బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్
Pallavi Prashanth Arrest: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ విజేత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యేందుకు కారణమయ్యారని, పోలీసుల ఆదేశాలు ధిక్కరించారనే ఆరోపణలతో నమోదైన కేసులో ప్రశాంత్‍ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని గజ్వేల్ మండలం కొలుగూర్ గ్రామానికి వెళ్లి అతడి ఇంట్లోనే పల్లవి ప్రశాంత్‍ను అరెస్ట్ చేశారు. వివరాలివే..
బిగ్‍బాస్ విజేతగా నిలిచి ప్రశాంత్ బయటికి వచ్చిన సమయంలో హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాల్లో గొడవ జరిగింది. ఈ సందర్భంగా కొందరు కొన్ని ఆర్టీసీ బస్సులు, ప్రేవేటు వాహనాలను ధ్వంసం చేశారు. ఆ చర్యకు పాల్పడింది పల్లవి ప్రశాంత్ అభిమానులే అని కేసులు నమోదయ్యాయి. అలాగే, ఆ సమయంలో అక్కడి రావొద్దని చెప్పిన పోలీసుల ఆదేశాలను ప్రశాంత్ ధిక్కరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
హైడ్రామా
డిసెంబర్ 17న బిగ్‍బాస్ ఫినాలే జరగగా.. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచారు. అమర్ దీప్ రన్నర్ అయ్యారు. ఫినాలే పూర్తయ్యాక అన్నపూర్ణ స్టూడియోస్ బయటికి ప్రశాంత్, అమర్ వచ్చారు. అప్పటికే ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరారు. ఆ సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా కొందరు ఇతర కంటెస్టెంట్‍ల కారు అద్దాలు పగులగొట్టారు. కొన్ని ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. కాగా, అక్కడి నుంచి వెళ్లిన పల్లవి ప్రశాంత్.. పోలీసులు ఆదేశించినా మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చారని సమాచారం. దీని వల్ల గొడవ మరింత తీవ్రమైందనే ఆరోపణ ఉంది.
అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన గొడవ అంశంలో పల్లవి ప్రశాంత్‍పై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్‍ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అతడు అందుబాటులో లేడని తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలోనే తాను ఇంట్లోనే ఉన్నానంటూ ప్రశాంత్ నేడు ఓ వీడియో పోస్ట్ చేశారు. అది జరిగిన కొన్ని గంటలకే ప్రశాంత్‍ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈ పల్లవి ప్రశాంత్ వ్యవహారం హైడ్రామాలా కొనసాగుతోంది.