Pallavi Prashanth Video: పరారీ వార్తలపై స్పందించిన పల్లవి ప్రశాంత్.. లేెటెస్ట్ వీడియో వదిలిన బిగ్‍బాస్ విన్నర్
20 December 2023, 15:24 IST
- Pallavi Prashanth: బిగ్‍బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విషయంలో రచ్చరచ్చ సాగుతోంది. పోలీసులు అతడిపై కేసులు నమోదు చేయటంతో పరారీలో ఉన్నాడని సమాచారం చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు ప్రశాంత్.
పల్లవి ప్రశాంత్
Pallavi Prashanth: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వ్యవహారంలో టిస్టులు కొనసాగుతున్నాయి. టైటిల్ గెలిచాక అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన గొడవ విషయంలో ప్రశాంత్ సహా మరికొందరిపై పోలీసు కేసులు నమోదయ్యాయని సమాచారం బయటికి వచ్చింది. దీంతో పల్లవి ప్రశాంత్.. అరెస్టు కాకుండా పరారీలో ఉన్నాడని పుకార్లు వచ్చాయి. తమ కుమారుడి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని, ఎక్కుడున్నాడో తెలియదని స్వయంగా ప్రశాంత్ తల్లిదండ్రులే మీడియాకు చెప్పారు. అయితే, తానెక్కడికీ పోలేదని, ఇంట్లోనే ఉన్నానంటూ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు పల్లవి ప్రశాంత్. వివరాలివే..
తాను ఎక్కడికి పోలేదని, ఇంటి వద్దనే ఉన్నానని లేటెస్ట్ వీడియోలో పల్లవి ప్రశాంత్ చెప్పారు. తాను పరారైనట్టు వస్తున్న సమాచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేశారు. తన ఇంటి వద్దే వీడియో తీసి మరీ తాను ఇక్కడే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. ఇంటికు వచ్చిన కొందరితో కూడా తాను ఇంటి వద్దే ఉన్నానని చెప్పించారు ప్రశాంత్. తనను కలిసేందుకు వచ్చిన వారి కోసం ప్రశాంత్ ఇంట్లోనే ఉన్నారని అక్కడి వారు చెప్పారు.
తనను కలుద్దామని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరిని ఈ వీడియోలో పరిచయం చేశారు ప్రశాంత్. వారు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అతడు పోస్ట్ చేశారు. తాను ప్రస్తుతం ఫోన్ వాడడం లేదని అన్నాడు. అయితే, ప్రశాంత్ ఇంట్లోనే ఉంటే.. అతడు అందుబాటులో లేడని వారి తల్లిదండ్రులు ఎందుకు మీడియాతో చెప్పారోనన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా పల్లవి ప్రశాంత్ వ్యవహారం రచ్చరచ్చగా మారుతోంది.
మరోవైపు తనపై నెగెటివిటీని కావాలానే పెంచుతున్నారనేలా మరో వీడియో కూడా పోస్ట్ చేశారు పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ గెలిచాడని చాలా మంది ఘన స్వాగతం పలికితే.. ఆ సంతోషం కాసేపు కూడా లేకుండా కొందరు చేస్తున్నారని అతడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా.. ప్రజలు తనను నమ్ముతున్నారని అన్నారు.
బిగ్‍బాస్ టైటిల్ గెలిచాక భద్రతా కారణాల వల్ల అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాలకు రావొద్దని పోలీసులు చెప్పినా.. పల్లవి ప్రశాంత్ దాన్ని ధిక్కిరంచి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ గొడవలు జరిగాయి. కొందరు ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర కంటెస్టెంట్లు, ప్రైవేట్ వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ విధ్వంసానికి పాల్పడింది ప్రశాంత్ అభిమానులే అని తెలుస్తోంది. ఈ విషయంపై పల్లవి ప్రశాంత్‍తో పాటు మరికొందరిపై కేసు నమోదైనట్టు సమాచారం. అయితే, పల్లవి ప్రశాంత్‍పై అసలు కేసే నమోదు కాలేదని అతడి తరఫు లాయర్ చెబుతుండడం కొసమెరుపు.