Madha Gaja Raja: 2013లో షూటింగ్ కంప్లీట్ - 2024లో రిలీజ్ - అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ రొమాంటిక్ మూవీ రికార్డ్
11 July 2024, 14:26 IST
Madha Gaja Raja: అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ మదగజరాజ షూటింగ్ పూర్తయిన పదేళ్ల థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ హీరోగా నటించాడు.
అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్
Madha Gaja Raja: సాధారణంగా ఓ సినిమా షూటింగ్ పూర్తయిన రెండు, మూడు నెలలకు థియేటర్లలో రిలీజ్ కావడం కామన్. ఏవైనా ఇబ్బందులు, వివాదాలు ఎదురైతే ఏడాదో, రెండేళ్ల లోపు ఆ సమస్యలను సాల్వ్ చేసుకొని తమ సినిమాలను దర్శకనిర్మాతలు థియేటర్లలోకి తీసుకొస్తుంటారు. కానీ సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ఓ రొమాంటిక్ కామెడీ మూవీ ఏకంగా షూటింగ్ పూర్తయిన పదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తోంది.
మదగజరాజ...
విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్, అంజలి హీరోహీరోయిన్లుగా సుందర్ దర్శకత్వంలో మదగజరాజ పేరుతో 2012లో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ మొదలైంది. తొలుత ఈ సినిమాలో శృతిహాసన్, హన్సికతో పాటు తాప్సీని హీరోయిన్‌గా తీసుకోవాలని సుందర్ సి అనుకున్నారు. ఆ టైమ్‌లో డేట్స్ సర్ధుబాటు కాక ఈ ముగ్గురు బిజీగా ఉండటంతో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్‌లతో ఈ సినిమాను పట్టాలెక్కించారు.
మదగజ రాజా మూవీలో ఐటెంసాంగ్‌లో సదా నటించింది. కోలీవుడ్ హీరో ఆర్య గెస్ట్ రోల్‌లో నటించాడు. సోనూసూద్ సంతానంతో పాటు పలువురు తమిళ నటులు కీలక పాత్రల్లో కనిపించారు.
2013లో షూటింగ్ పూర్తి...
2013లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అదే ఏడాది ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు. నిర్మాతలు తనకు ఇస్తానన్న రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారని కమెడియన్ కమ్ హీరో సంతానం మదగజరాజ నిర్మాతలపై కోర్టును ఆశ్రయించారు. ఆ వివాదం కారణంగా సినిమా రిలీజ్ వాయిదాపడింది. ఆ సమస్యను పరిష్కరించి సినిమాను రిలీజ్ చేయాలని విశాల్ కూడా ప్రయత్నించారు. కానీ అతడి ప్లాన్ ఏవి వర్కవుట్ కాలేదు.
విశాల్ బ్యానర్ ద్వారా...
తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు విశాల్, సుందర్ సి కలిసి ప్రయత్నాలు చేస్తోన్నట్లు సమాచారం. ఒరిజినల్ ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను విశాల్ తీసుకున్నట్లు తెలిసింది. తన బ్యానర్ మీదనే ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో మదగజరాజా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం విశాల్‌తో పాటు అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్‌లకు తమిళంతో పాటు తెలుగులో మంచి క్రేజ్ ఉండటం ఈ సినిమాకు కలిసిరావొచ్చునని అంటున్నారు. మరోవైపు సుందర్ సి గత మూవీ అరాణ్మణై 4 తమిళంలో వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది కోలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. అరాణ్మణై 4 సక్సెస్ కూడా మదగజరాజకు కలిసి రావచ్చునని కోలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.
హీరోయిన్ కమ్ విలన్...
ప్రస్తుతం తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో హీరోయిన్‌గా కనిపిస్తోంది. మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ రోల్స్ చేస్తోంది. అంజలి కూడా అగ్ర కథానాయకుల సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తోంది. అంజలి లీడ్ రోల్‌లో నటించిన తెలుగు వెబ్‌సిరీస్ బహిష్కరణ జూలై 19న రిలీజ్ అవుతోంది. జీ5 ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.