Thriller OTT: ఓటీటీలోకి అనన్య నాగళ్ల క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ - రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్!
04 December 2024, 14:01 IST
Thriller OTT: అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించిన పొట్టేల్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. యువచంద్ర హీరోగా నటించిన ఈ మూవీకి సాహిత్ మొత్కూరి దర్శకత్వం వహించాడు.
థ్రిల్లర్ ఓటీటీ
Thriller OTT: అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ పొట్టేల్ ఓటీటీలోకి వస్తోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సాహిత్ మొత్కూరి దర్శకత్వం వహించాడు. యువచంద్ర హీరోగా నటించిన ఈ మూవీలో అజయ్, నోయల్ కీలక పాత్రల్లో నటించారు.
రెండు నెలల తర్వాత...
థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత పొట్టేల్ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో ఈ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
డిసెంబర్ సెకండ్ వీక్ లేదా మూడో వారంలో పొట్టేల్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలిసింది.
కూతురి చదువు కోసం...
తన కూతురి చదువుకు, 1970 -80 కాలం నాటి సామాజిక కట్టుబాట్లకు మధ్య నలిగిపోయిన ఓ తండ్రి కథకు ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి పొట్టేల్ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ సాహిత్ మొత్కూరి. అజయ్, యువచంద్ర, అనన్య నాగళ్ల యాక్టింగ్‌తో పాటు కాన్సెప్ట్ బాగుందంటూ ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి.
ఈ చిన్న సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ప్రమోషన్స్ డిఫరెంట్‌గా చేయడం, యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాతో పాలు పలువురు సెలిబ్రిటీలో ఈ ప్రమోషన్స్‌లో భాగం కావడం పొట్టేల్‌కు కలిసివచ్చింది.
పొట్టేల్ మూవీ కథ...
గుర్రం గట్టు ఊరి గ్రామదేవత బాలమ్మ తనకు పూనుతున్నట్లుగా నటిస్తూ అందరిని చెప్పుచేతుల్లో పెట్టుకుంటాడు చిన్న పటేల్ (అజయ్). చిన్న పటేల్ చేసే అక్రమాలను ఎదురించాలని ప్రయత్నిస్తుంటాడు గంగాధరి (యువచంద్ర). కానీ గంగాధరి మాటల్ని ఊరివాళ్లు పట్టించుకోరు. పెద్దలను ఎదురించి బుజ్జమ్మను (అనన్య నాగళ్ల) పెళ్లిచేసుకుంటాడు గంగాధరి. వారికి కూతురు సరస్వతి పడుతుంది. తన కూతురిని పటేల్‌కు తెలియకుండా చదివిస్తుంటాడు గంగాధరి.
గంగాధరి కూతురు సరస్వతి చదువుకుంటున్న విషయం తెలుసుకున్న చిన్న పటేల్ బాలమ్మ దేవతకు జాతరలో బలిచ్చే పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర టైమ్‌లోగా పొట్టేల్‌ను తీసుకురావాలని గంగాధరిని ఊరినుంచి చిన్న పటేల్ వెలివేస్తాడు. మాయమైన పొట్టేల్ గంగాధరికి దొరికిందా?గంగాధరి కూతురిని చంపాలని చిన్న పటేల్ ఎందుకు అనుకున్నాడు? అన్నదే పొట్టేల్ మూవీ కథ.
మూడు సినిమాలు…
తెలుగులో యాక్టింగ్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది అనన్య నాగళ్ల. ఈ ఏడాది తంత్ర, పొట్టేల్‌తో పాటు డార్లింగ్ సినిమాలు చేసింది. తెలుగు వెబ్‌సిరీస్ బహిష్కరణలో కీలక పాత్ర చేసింది.