Adipurush VFX Trolls: ఆదిపురుష్ వీఎఫ్‌ఎక్స్‌తో మాకు సంబంధం లేదు: వీఎఫ్‌ఎక్స్ వాలా
04 October 2022, 9:43 IST
- Adipurush VFX Trolls: ఆదిపురుష్ వీఎఫ్‌ఎక్స్‌తో తమకు సంబంధం లేదని అమెరికాకు చెందిన వీఎఫ్‌ఎక్స్ వాలా సంస్థ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ మూవీ టీజర్, అందులోని వీఎఫ్‌ఎక్స్‌పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఆ సంస్థ ఇలా చెప్పడం విశేషం.
ఆదిపురుష్ టీజర్ లో ఓ సీన్
Adipurush VFX Trolls: ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాపై అంతకంటే భారీ అంచనాలే ఉన్నాయి. రామాయణ నేపథ్యంలో వస్తున్న మూవీ కావడం, అందులోనూ రాముడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తుండటంతో ఆదిపురుష్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో ఉంది.
అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ లుక్‌పై ట్రోల్స్ రాగా.. టీజర్ రిలీజ్ తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా టీజర్‌లోని వీఎఫ్‌ఎక్స్ లక్ష్యంగా సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం మొదలైంది. పక్కా కార్టూన్ మూవీలాగా ఉందంటూ చాలా మంది విమర్శించారు. ఇక గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు చీప్ కాపీలాగా ఉందని కూడా మరికొందరు ట్రోల్ చేశారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్ అందించిందని చెబుతున్న వీఎఫ్‌ఎక్స్‌వాలా(VFXwaala) కంపెనీ క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ టీజర్‌లో తాము పనిచేయలేదని, సినిమాతో ఇక తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ సంస్థ అధికారిక ప్రకటనను ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విటర్‌లో షేర్ చేశాడు.
"ఆదిపురుష్ స్పెషల్ ఎఫెక్ట్స్‌పై తాము పనిచేయలేదు/చేయడం లేదు అని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ స్టూడియో ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా స్పష్టం చేస్తోంది. కొంతమంది మీడియా వాళ్లు అడిగిన కారణంగా తాము ఈ విషయాన్ని ఆన్ రికార్డు చెబుతున్నాం అని ఆ సంస్థ అధికారిక ప్రకటన చెబుతోంది" అన్నది ఆ ప్రకటన సారాంశం.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ప్రభాస్ లుక్ విషయంలోనే కాదు.. రావణుడిగా సైఫ్ లుక్‌పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. అతన్ని పద్మావత్ సినిమాలో ఖిల్జీ క్యారెక్టర్ పోషించిన రణ్‌వీర్ సింగ్‌లాగా చూపించారన్న విమర్శలు ఉన్నాయి. 3డీలో వస్తున్న ఈ ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది.