Allu Aravind: శ్రీతేజ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి అల్లు అరవింద్.. రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ
18 December 2024, 17:44 IST
Allu Arjun Father Allu Aravind: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అరవింద్.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించాడు.
అల్లు అరవింద్
పుష్ప 2 ప్రీమియర్ షో వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను బుధవారం అల్లు అరవింద్ పరామర్శించారు. డిసెంబరు 4న రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో వేయగా.. అక్కడికి అల్లు అర్జున్‌తో పాటు చిత్ర యూనిట్ వచ్చింది. దాంతో అల్లు అర్జున్‌ను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పరామర్శకి అందుకే వెళ్లని అల్లు అర్జున్
ఈ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై గత శనివారం ఉదయం విడుదల అయ్యాడు. జైలు నుంచి విడుదలై తర్వాత శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్దామని అనుకున్నాడట. కానీ.. కేసు కోర్టులో ఉండటంతో వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు అల్లు అర్జున్ తెలిపాడు. దాంతో అల్లు అర్జున్‌కి బదులుగా అతని తండ్రి అల్లు అరవింద్ ఈరోజు ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించాడు.
శ్రీతేజ్ పరిస్థితిపై అల్లు అరవింద్ వాకబు
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు అడిగి తెలుసుకున్న అల్లు అరవింద్.. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చాడు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయాడని.. రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని అల్లు అరవింద్ మరోసారి స్పష్టం చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత శ్రీతేజ్ తండ్రి మాట్లాడుతూ.. తాను కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే.
రూ.1500 కోట్లకి చేరువలో పుష్ప 2
పుష్ప 2 మూవీ ఇప్పటి వరకూ రూ.1,469 కోట్లు వసూల్లు రాబట్టింది. ఇందులో సగానికిపైగా హిందీ నుంచే వసూలు కావడం గమనార్హం. తెలుగు, తమిళ్, బెంగాలీ, కన్నడ, మలయాళం, బెంగాలీలో భాషల్లోనూ పుష్ప2 రిలీజై బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.