Allu Arjun at National awards 2023: తగ్గేదేలే అంటూ నేషనల్ అవార్డుల్లో సందడి చేసిన అల్లు అర్జున్
17 October 2023, 14:37 IST
- Allu Arjun at National film awards 2023: తగ్గేదేలే అంటూ నేషనల్ అవార్డుల్లో సందడి చేశాడు అల్లు అర్జున్. మంగళవారం (అక్టోబర్ 17) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ అవార్డుల సెర్మనీ జరుగుతోంది.
నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకునే ముందు తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్
Allu Arjun at National film awards 2023: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తగ్గేదేలో అంటూ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో సందడి చేశాడు. పుష్ప ది రైజ్ మూవీకిగాను బెస్ట్ యాక్టర్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ నిలిచిన విషయం తెలిసిందే. మంగళవారం (అక్టోబర్ 17) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగుతోంది.
ఈ నేషనల్ అవార్డు అందుకోవడానికి సోమవారం (అక్టోబర్ 16) అల్లు అర్జున్ ఢిల్లీ వెళ్లాడు. అవార్డు అందుకునే ముందు అతడు రెడ్ కార్పెట్ పై డీడీ నేషనల్ ఛానెల్ తో మాట్లాడాడు. పుష్పలాంటి ఓ కమర్షియల్ సినిమాకు ఈ అవార్డు అందుకోవడం తనకు డబుల్ అచీవ్‌మెంట్ అని బన్నీ అనడం విశేషం.
"చాలా సంతోషంగా ఉంది. మాటల్లో వర్ణించలేను. ఇదో గొప్ప గౌరవం. అందులోనూ ఓ కమర్షియల్ సినిమాకు ఈ అవార్డు అందుకోవడం నాకు డబుల్ అచీవ్ మెంట్" అని అల్లు అర్జున్ అన్నాడు. ఈ సందర్భంగా పుష్ప మార్క్ డైలాగ్ చెప్పాల్సిందిగా అతన్ని కోరగా.. తగ్గేదేలే అంటూ తనదైన స్టైల్లో బన్నీ చెప్పాడు. 69వ నేషనల్ అవార్డుల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున్ ఈ అవార్డు అందుకోనున్నాడు.
మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా నేషనల్ అవార్డు పంట పండిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఏకంగా ఆరు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్ పై ఈ మూవీ డైరెక్టర్ రాజమౌళి మాట్లాడాడు. "నా తొలి లక్ష్యం ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడమే. అవార్డులు నాకు బోనస్ లాంటివి. అయితే జాతీయ స్థాయిలో అవార్డు రావడం అది కూడా ఆరు అవార్డులు గెలుచుకోవడం అంటే నా సినిమాలోని టెక్నీషియన్లు, వాళ్ల మూడేళ్ల శ్రమను గుర్తించినట్లే. చాలా చాలా సంతోషంగా ఉంది" అని రాజమౌళి అన్నాడు.
ఇక ఉత్తమ తెలుగు సినిమాగా నేషనల్ అవార్డు గెలుచుకున్న ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కూడా అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వచ్చాడు. ఈ సందర్భంగా అతడు కూడా రెడ్ కార్పెట్ పై తెలుగులో మాట్లాడాడు. చాలా సంతోషంగా ఉందంటూ ఈ సినిమా ప్రొడ్యూసర్, నటీనటులకు అతడు థ్యాంక్స్ చెప్పాడు.