Allu Arjun at Madam Tussauds: మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడు ఇతడే
Allu Arjun at Madam Tussauds: మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ లో అల్లు అర్జున్ మైనపు బొమ్మ కొలువుదీరింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా బన్నీ మరోసారి చరిత్ర సృష్టించాడు.
Allu Arjun at Madam Tussauds: టాలీవుడ్ ఐకాన్ స్టార్, బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డు గెలిచిన తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ మరోసారి చరిత్ర సృష్టించాడు. ఈసారి దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అతని మైనపు బొమ్మ కొలువు దీరింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా బన్నీ నిలిచాడు.
అల్లు అర్జున్ మైనపు బొమ్మను ఈ ఏడాది చివర్లో ఆవిష్కరిస్తారు. తాజాగా మ్యూజియం నిర్వాహకులు మైనపు బొమ్మ కోసం అతని కొలతలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది మొదట్లోనూ దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులను అల్లు అర్జున్ కలిశాడు. అతని స్టాచూ కోసం ఏకంగా 200 కొలతలు తీసుకోవడం విశేషం.
అచ్చూ మనిషిని పోలినట్లుగా మైనపు బొమ్మలను తయారు చేయడంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు పేరుగాంచారు. దీంతో పర్ఫెక్ట్ స్టాచూ కోసం వాళ్లు చాలా జాగ్రత్తగా, అణువణువూ కొలతలు తీసుకుంటారు. తనకు ఈ అరుదైన ఘనత దక్కుతుండటంపై అల్లు అర్జున్ స్పందించాడు. ఇది చాలా గర్వకారణమని అన్నాడు.
తాను చిన్నతనంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి వెళ్లానని, అయితే ఏదో ఒక రోజు తన మైనపు బొమ్మ అక్కడ కొలువుదీరుతుందని ఊహించలేదని బన్నీ చెప్పాడు. పుష్ప ది రైజ్ మూవీలో నటనకుగాను ఈ మధ్యే అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డు గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ చేస్తున్నాడు.
పుష్ప మూవీతోనే పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఈ స్టైలిష్ స్టార్.. ఇప్పుడు మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు బొమ్మతో మరో రేంజ్ కు వెళ్లాడు. అతని వ్యాక్స్ స్టాచూని మ్యూజియంలో చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.