Vishal on National Awards: నేషనల్ అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా: విశాల్ సంచలన కామెంట్స్
Vishal on National Awards: నేషనల్ అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా అంటూ తమిళ స్టార్ నటుడు విశాల్ సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పుడతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Vishal on National Awards: ఈ మధ్యే ప్రకటించిన నేషనల్ అవార్డులపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళ నటుడు విశాల్ అయితే సంచలన కామెంట్స్ చేశాడు. వాటిని తాను నమ్మనని, ఒకవేళ తనకు ఆ అవార్డులు వచ్చినా చెత్త బుట్టలో పడేస్తానని అని అనడం గమనార్హం. జైభీమ్ లాంటి సినిమాను కాదని పుష్ప మూవీకి అవార్డు ఇవ్వడంపై విశాల్ మండిపడ్డాడు.
తాజా అవార్డుల్లో తమిళ సినిమాలను జ్యూరీ పట్టించుకోకపోవంపై అక్కడి నటులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జైభీమ్, కర్ణన్, సర్పట్టాలాంటి సినిమాలకు అవార్డులు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. అలా జరగలేద. దీంతో ఈ నేషనల్ అవార్డులపై తమిళ నటుడు విశాల్ తీవ్రంగా స్పందించాడు. డెక్కన్ క్రానికల్ తో అతడు మాట్లాడాడు.
"ఆ అవార్డులను నేను అసలు నమ్మను. సినిమాను ప్రేక్షకులకు ఇచ్చేదే అత్యంత గొప్ప అవార్డు. ప్రేక్షకులు ఇచ్చేదే నిజాయతీతో కూడిన అవార్డు. ఆ ప్రేక్షకుల మద్దతుతోనే నేను ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. అదే నాకు గొప్ప అవార్డు. ఒకవేళ నేను నటించిన సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చినా నేను వాటిని చెత్తబుట్టలో పడేస్తాను" అని విశాల్ అన్నాడు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో ఎన్నికలు, రాజకీయాల్లోకి ఎంట్రీపై కూడా విశాల్ స్పందించాడు. జీవితంలో ఏదైనా జరగొచ్చు అని అతడు అనడం విశేషం. పందెం కోడి, పొగరు, అభిమన్యులాంటి సినిమాలతో తెలుగు వాళ్లకు కూడా విశాల్ దగ్గరయ్యాడు. ఇక నేషనల్ అవార్డుల విషయానికి వస్తే.. ఈసారి తెలుగు సినిమాలకు మంచి ప్రాధాన్యత దక్కింది.
బెస్ట్ యాక్టర్ గా తొలిసారి ఓ తెలుగు నటుడైన అల్లు అర్జున్ నిలవడంతోపాటు ఆర్ఆర్ఆర్ కోసం కీరవాణి, ప్రేమ్ రక్షిత్ లకు, ఉప్పెన కోసం చంద్రబోస్ కు అవార్డులు వచ్చాయి. అటు జైభీమ్ మూవీకి అవార్డు రాకపోవడంపై టాలీవుడ్ నటులు నాని, రానా కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.