తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kasthuri Controversy: తెలుగు వారిపై నోరుజారిన నటి కస్తూరి.. వివాదం ముదరడంతో దిద్దుబాటు తిప్పలు

Kasthuri Controversy: తెలుగు వారిపై నోరుజారిన నటి కస్తూరి.. వివాదం ముదరడంతో దిద్దుబాటు తిప్పలు

Galeti Rajendra HT Telugu

04 November 2024, 19:53 IST

google News
  • Actress Kasthuri Controversy Comments: తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు నటి కస్తూరి. సుదీర్ఘకాలంగా సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తున్న కస్తూరి.. తెలుగు వారిని అవమానిస్తూ మాట్లాడి వివాదంలో చిక్కుకుంది. 

నటి కస్తూరి
నటి కస్తూరి (Instagram)

నటి కస్తూరి

సీనియర్ నటి కస్తూరి తెలుగు వారిపై నోరుజారి వివాదంలో ఇరుక్కుంది. తమిళనాడులో జరిగిన ఓ మీటింగ్‌లో తెలుగు వారిని చులకన చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కస్తూరి.. ఇప్పుడు వివాదం రాజుకోవడంతో దిద్దుబాటు చర్యలకి దిగింది. కానీ.. ఆమె మాట్లాడిన తీరుపై మండిపడుతున్న తెలుగు వారు ఇండస్ట్రీ నుంచి ఆమెని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కస్తూరి ఏం మాట్లాడిందంటే?

తమిళనాడుకి మూడు శతాబ్దాల క్రితం అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు అక్కడికి వచ్చారని చెప్పుకొచ్చిన కస్తూరి.. ఇప్పుడు ఆ తెలుగు వారే తమది తమిళ జాతి అని చెప్పుకుంటున్నారంటూ హేళన చేసింది. తెలుగు వారి కంటే ముందు తమిళనాడుకి వచ్చిన బ్రాహ్మణులను మాత్రం తమిళులు కాదంటూ మాట్లాడుతున్నారని.. అలా చెప్పడానికి మీరు ఎవరు? అంటూ వెటకారంగా ప్రశ్నించింది.

వాస్తవానికి కస్తూరి ద్రవిడ వాదులని టార్గెట్‌‌గా చేసుకుని ఆవేశంగా మాట్లాడింది. కానీ.. ఈ క్రమంలో తెలుగు వారిని తెరపైకి తెచ్చి వివాదంలో చిక్కుకుంది. ఇదే మీటింగ్‌లో ద్రవిడ వాదులపై నోరు పారేసుకున్న కస్తూరి.. వారిని రెచ్చగొట్టేలా ఇతరుల భార్యలపై మోజుపడొద్దు అంటూ వెటకారం చేసింది.

ఒకరి కంటే ఎక్కువ మందిని భార్యలు చేసుకోవద్దని ఉచిత సలహాలు కూడా ఇచ్చింది. బ్రాహ్మణులు ఇలా సూచనలు చేస్తుండటంతోనే ద్రవిడ వాదులకి కోపం వచ్చి బ్రాహ్మణులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కస్తూరి చెప్పుకొచ్చింది.

కస్తూరిపై మండిపడుతున్న తెలుగు ప్రజలు

కస్తూరి మాటలపై తెలుగు వారు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఆమెను వెంటనే సీరియస్, సినిమాల నుంచి తప్పించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దాంతో తప్పిదాన్ని గ్రహించిన కస్తూరి.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తన వ్యాఖ్యల్ని కావాలనే వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని.. వారి వెనుక డీఎంకే పార్టీ ఉందంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ.. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

వివరణ ఇచ్చుకున్న కస్తూరి

తెలంగాణ నాకు పుట్టినిల్లు, ఆంధ్రా నాకు మెట్టినిల్లు అంటూ ఒక న్యూస్ ఛానల్‌తో చెప్పుకొచ్చిన కస్తూరి.. తెలుగు వారంటే తనకి చాలా ఇష్టమంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. పనిలో పనిగా డీఎంకే నేతల్ని బ్రాహ్మణుల్ని రకరకాలుగా అవమానిస్తున్నారని విమర్శించింది. ఓవరాల్‌గా తెలుగు వారి గురించి తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేసింది. మరి తెలుగు ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం