APSRTC Special Buses : టూరిస్టులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ఆంధ్రా కశ్మీర్ 'లంబసింగి'కి ప్రత్యేక సర్వీసులు
టూరిస్టులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్తం చెప్పింది. ఆంధ్రా ఊటీగా పేరొందిన లంబసింగికి విశాఖపట్నం ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీకెండ్స్ లో ఈ సర్వీసులు నడవనున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఆన్ లైన్ లో టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
పర్యాటకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి లంబసింగికి ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. లంబసింగి మన్యంలో పచ్చని చెట్లు, పచ్చని వెదురు పొదలతో ప్రకృతి అందాలు విరజిల్లుతాయి. శీతాకాలం వచ్చిందంటే మన్యం ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. శీతాకాలం,
మరోవైపు కార్తీక మాసం కావడంతో మంచు పొరలతో ఊటీని తలపిస్తోంది లంబసింగి. లంబసింగి పొగ మంచు అందాలు చూసేందుకు ఇదే సరైన సమయం. ఆంధ్రా ఊటీగా పిలిచే ఈ ప్రాంతం పర్యటకులను రారమ్మని పిలుస్తోంది. మన్యంలో కురుస్తున్న మంచు తుంపరలు, మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందు చేసే అటవీ అందాలు, అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం చూడాలంటే ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి వెళ్లాల్సిందే. ఇప్పటికే మన్యంలో అనేక పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. ఇటువంటి ప్రకృతి అందాలను విరజిమ్మే ప్రదేశాలను చూసేందుకు ఏపీఎస్ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది.
ప్యాకేజీ వివరాలు…
కార్తీక మాసం పురస్కరించుకుని పిక్నిక్‌లకు లంబసింగినకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్సులు శని, ఆదివారాల్లో తెల్లవారుజామున 3 గంటలకు విశాఖపట్నం ద్వారకా బస్సుస్టేషన్ నుండి బయలుదేరుతాయి. లంబసింగి, తాజంగి డ్యామ్, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, మోదమాంబ గుడి (పాడేరు), కాఫీ తోటలు చూసి వచ్చే విధంగా టూర్ ప్లాన్ చేశారు. టిక్కెట్టు ధర ఒక్కొక్కరికి అల్ట్రా డీలక్స్ రూ.800, ఎక్స్‌ప్రెస్ రూ.650గా నిర్ణయించారు.
టిక్కెట్ కావల్సిన వారు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే ద్వారకా బస్సు స్టేషన్, విశాఖపట్నం రిజర్వేషన్ కౌంటర్ నందు కూడా బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇతర వివరాల కోసం 9959225602, 9052227083, 9959225594, 9100109731 ఫోన్ నెంబర్‌లను సంప్రదించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు తెలిపారు. ఈ సదవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని కోరారు. అలాగే కార్తీక మాసంలో విజ్ఞాన విహార యాత్రలకు అద్దె ప్రాతిపదికన బస్సులు ఇస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు గ్రూపుగా వస్తే వారు కోరిన రోజున టూర్ స్పెషల్స్ బట్టి బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం