Aavesham Review: ఆవేశం రివ్యూ - ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ ఎలా ఉందంటే?
17 April 2024, 9:28 IST
Aavesham Review: ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన మలయాళం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ కామెడీ మూవీ ఆవేశం థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ మలయాళం మూవీకి జీతూ మాధవన్ దర్శకత్వం వహించాడు.
ఫహాద్ ఫాజిల్ ఆవేశం రివ్యూ
Aavesham Review: ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన మలయాళం మూవీ ఆవేశం ఇటీవల థియేటర్లలో విడుదలైంది. రొమాంచం ఫేమ్ జీతూ మాధవన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. రిలీజైన ఐదు రోజుల్లోనే యాభై కోట్ల వరకు వసూళ్లను రాబట్టిన ఈ మలయాళం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
గ్యాంగ్‌స్టర్ రంగా కథ...
శాంతన్ (రోషన్ శాన్‌వాజ్), బీబీ (మిథున్ జై శంకర్), అజు(హిప్‌స్టర్) మలయాళీ స్టూడెంట్స్. ఇంజనీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగళూరు వస్తారు. కాలేజీలో సీనియర్ అయిన కుట్టీని ఎదురిస్తారు ముగ్గురు. అజు, శాంతన్, బీబీపై పగను పెంచుకున్న కుట్టీ ర్యాగింగ్ పేరుతో ముగ్గురిని దారుణంగా కొడతాడు. బట్టలు ఊడదీసి చిత్రహింసలు పెడతాడు. కుట్టీపై రివేంజ్ తీర్చుకోవడానికి లోకల్ గ్యాంగ్‌స్టర్ రంగా రావు అలియా రంగాతో (ఫహాద్ ఫాజిల్) స్నేహం చేస్తారు అజు, బీబీ, శాంతన్. ఈ ముగ్గురిని తన గ్యాంగ్‌లో చేర్చుకుంటాడు రంగా.
వారిని సోదరులుగా నమ్ముతాడు. . హాస్టల్‌లో ఇబ్బంది ఉండటంతో తన ఇంటిని వారికి ఇచ్చేస్తాడు రంగా. అజు, శాంతన్, బీబీలను ర్యాగింగ్ చేసిన కుట్టీ అండ్ టీమ్‌ను తన గ్యాంగ్‌తో కలిసి కాలేజీలోని స్టూడెంట్స్ అందరికి రంగా చితక్కొడతాడు. రంగా మనుషులు కావడంతో అజు, బీబీ, శాంతన్‌లకు కాలేజీలో ఎదురేలేకుండాపోతుంది. రంగా టీమ్‌లో చేరిన అజు, బీబీ, శాంతన్ జీవితాలు చివరకు ఏమయ్యాయి? రంగాతో తిరిగి తమ చదువును నిర్లక్ష్యం చేసిన ఈ ముగ్గురు ఇంజినీరింగ్‌ను మధ్యలోనే వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది.
రంగా చేసిన నేరాల గురించి అతడు అనుచరుడు అంబన్ (సాజిన్ గోపు) చెప్పినవి కట్టుకథలు కాదు నిజాలు అని ఈ ముగ్గురికి ఎప్పుడు తెలిసింది? తమకు సాయం చేసిన రంగానే చంపాలని బీబీ, అజు, శాంతన్ ఎందుకు అనుకున్నారు? వారి కుట్రను తెలుసుకున్న రంగా ఈ ముగ్గురిని ఏం చేశాడు? రంగాపై పగతో రగిలిపోతున్న మరో గ్యాంగ్‌స్టర్ రెడ్డి (మన్సూర్ అలీఖాన్) ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
రొటీన్ గ్యాంగ్‌స్టర్ ఫార్ములాకు భిన్నంగా...
గ్యాంగ్‌స్టర్, యాక్షన్ సినిమాలు చాలా వరకు సీరియస్‌గా యాక్షన్ అంశాలతో నిండి ఉంటాయి. హీరో చేసే భారీ ఫైట్లు, ఛేజింగ్‌లు, రక్తపాతంతో సాగుతుంటాయి. ఆ రొటీన్ గ్యాంగ్‌స్టర్ ఫార్ములా సినిమాలకు పూర్తి భిన్నంగా ఆవేశం సాగుతుంది.
మదర్ సెంటిమెంట్...
ఆవేశం గ్యాంగ్‌స్టర్ మూవీనే అయినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు మదర్ సెంటిమెంట్‌తో ఉద్వేగాన్ని పంచేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అంతర్లీనంగా చదువుకునే వయసులో పగ పేరుతో అడ్డదారులు పట్టిన ఓ ముగ్గురు కుర్రాళ్లు ఆ నేరమయ ప్రపంచం నుంచి ఎలా బయటపడ్డారన్నది చూపించాడు. పగ, ప్రతీకారాలను తల్లి ప్రేమ ఎలా ఓడించిందన్నది దర్శకుడు ఆలోచనాత్మకంగా చూపించాడు.
వన్ మెన్ షో...
ఆవేశం మూవీ ఫహాద్ ఫాజిల్ వన్ మెన్ షోగా చెప్పవచ్చు. రంగా అనే గ్యాంగ్‌స్టర్‌గా డిఫరెంట్ బాడీలాంగ్వేజ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ఫహాద్ ఫాజిల్ అదరగొట్టాడు. సినిమాలో ఫహాద్ ఫాజిల్ ఎక్కడ కూడా ఫైట్ చేయడు. కానీ యాక్షన్ ఎపిసోడ్స్‌లో అతడు చేసే హడావిడి మాత్రం నవ్విస్తుంది.
తన చుట్టుపక్కల వారిని ఎలర్ట్ చేస్తూ ఫైట్ చేస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడం బాగుంది. చాలా ఆవేశంగా అతడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఫన్నీగా అనిపిస్తాయి విలన్స్‌ను హీరో కొట్టకపోవడానికి గల కారణాన్ని మదర్ సెంటిమెంట్‌తో ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు దర్శకుడు.
యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్...
ఫహాద్ ఫాజిల్ కామెడీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. యాక్షన్ సీన్స్‌ను హాలీవుడ్ లెవెల్‌లో మార్షల్ ఆర్ట్స్ కలగలపుతూ డిజైన్ చేసుకోవడం బాగుంది. కుట్టీ గ్యాంగ్‌ను రంగా బ్యాచ్ చితక్కొట్టే కాలేజీ యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోతుంది. క్లైమాక్స్ యాక్షన్ సీన్ కూడా బాగుంది.
రంగా ఎంట్రీ సీన్‌తో...
అజు, బీబీ, శాంతన్ పరిచయం, ఇంజినీరింగ్ కాలేజీలో వారు చేరే సీన్స్‌తోనే సినిమా మొదలవుతుంది. సీనియర్స్ ర్యాగింగ్‌ను ఎదుర్కోవడానికి వారు వేసిన ప్లాన్స్ ఫెయిలై...చివరకు కుట్టీ గ్యాంగ్ చేతిలో తన్నులు తినడం రివేంజ్ కోసం గ్యాంగ్‌స్టర్స్‌ను వెతుకుతూ రంగాను కలిసే సీన్‌తోనే అసలు కథ మొదలవుతుంది. అందుకు సింబాలిక్‌గా సినిమా టైటిల్‌ను కూడా అప్పడే స్క్రీన్‌పై వేశాడు దర్శకుడు.
యాక్షన్ ఎపిసోడ్స్‌తో...
రంగా గ్యాంగ్‌లో మెంబర్స్‌గా చేరిన అజు, శాంతన్, బీబీ తమ రివేంజ్ తీర్చుకోవడంతో ఫస్ట్ హాఫ్‌ను ఎండ్ చేశారు. వాటితో పాటు రంగా ఫ్లాష్‌బ్యాక్‌ను అంబన్ చెప్పే సీన్స్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేశారు. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఫహాద్ ఫాజిల్ లుక్ కొత్తగా ఉంది.
రంగా వల్ల తమ చదువుకు పాడవుతుందనే నిజం తెలుసుకున్న ముగ్గురు స్టూడెంట్స్ అతడిని వదిలించుకోవడానికి చేసిన ప్రయత్నాలు, రంగా గ్యాంగ్‌లో చేరడం వల్ల వారు పడిన ఇబ్బందలు చుట్టూ సెకండాఫ్‌ను నడిపించాడు. చివరకు రంగాను చంపేస్తేనే తమ చదువు సక్రమంగా సాగుతుందని అనుకున్న వారు ఏం చేశారన్నది క్లైమాక్స్‌లో చూపించాడు.
ఈజీగా గెస్‌చేసేలా...
ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్, క్యారెక్టరైజేషన్ మినహా ఆవేశం కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు. అమాయకులు గ్యాంగ్‌స్టర్ వరల్డ్‌లోకి ఎంటరవ్వడం, అక్కడ ఎదుర్కొనే ఇబ్బందులతో గతంలో దక్షిణాదిలో చాలా సినిమాలొచ్చాయి. క్లైమాక్స్ కూడా ఈజీగా గెస్ చేసేలానే ఉంటుంది. కామెడీ కూడా అన్ని చోట్ల వర్కవుట్ కాలేదు.
కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ...
రంగా పాత్రలో ఫహాద్ ఫాజిల్ జీవించాడు. అతడి కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా ఆవేశం నిలుస్తుంది. కంప్లీట్ వైట్ అండ్ వైట్ డ్రెస్సింగ్ స్టైల్, గోల్డ్ చైన్స్, రింగ్‌లతో క్యారెక్టర్ లుక్, బాడీలాంగ్వేజ్‌ను కొత్తగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేవాడు డైరెక్టర్. రంగా తర్వాత ఈ సినిమాలో అతడి అనుచరుడు అంబన్ పాత్ర హైలైట్ అయ్యింది.
ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని అంబన్ పాత్ర చేసిన సాజిన్ గోపుపైనే ఉంటాయి. తన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. రంగా అనుచరుల్లో ముసలాయన చేసే ఫైట్స్ కూడా విజిల్స్ వేయిస్తాయి. అజు, బీబీ, శాంతన్ క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ కూడా సహజంగా నటించారు. రెడ్డిగా మన్సూర్ అలీఖాన్ కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు.
ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ కోసం...
ఆవేశం న్యూఏజ్ గ్యాంగ్‌స్టర్ కామెడీ మూవీ. ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ కోసం మిస్ కాకుండా చూడాల్సిన మూవీ. కథ, కథనాల గురించి ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే మంచి టైమ్‌పాస్ చేస్తుంది.