తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Devineni Uma: దేవినేని ఉమాకు టిక్కెట్ గల్లంతు.. అయ్యో పాపం అనని టీడీపీ నేతలు, స్వయంకృతమే కారణమా…

Devineni Uma: దేవినేని ఉమాకు టిక్కెట్ గల్లంతు.. అయ్యో పాపం అనని టీడీపీ నేతలు, స్వయంకృతమే కారణమా…

Sarath chandra.B HT Telugu

27 March 2024, 11:06 IST

google News
    • Devineni Uma: కృష్ణా జిల్లా రాజకీయాల్ని దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన దేవినేని ఉమాకు కనీసం టిక్కెట్ లేకుండా పోయింది. టిక్కట్లు దక్కని సీనియర్ల జాబితాలోకి ఉమా చేరినా, సానుభూతి చూపే నాయకులు కూడా లేకుండా పోయారు.
ఎన్నికల ప్రచారం చేసుకున్నా ఉమాకు భంగపాటు తప్పలేదు...
ఎన్నికల ప్రచారం చేసుకున్నా ఉమాకు భంగపాటు తప్పలేదు...

ఎన్నికల ప్రచారం చేసుకున్నా ఉమాకు భంగపాటు తప్పలేదు...

Devineni Uma: తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుల్లో ఒకరైన దేవినేని ఉమా పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఎన్నికల పొత్తులు, సమీకరణల్లో భాగంగా దేవినేని ఉమాకు టీడీపీ TDP అధిష్టానం మొండి చేయి చూపింది. చివరి నిమిషం వరకు మైలవరం టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నా దేవినేని ఉమాకు భంగపాటు తప్పలేదు.

మైలవరం Mylavaram కాకపోతే పెనమలూరు Penamaluru తో సర్దుకుందామన్నా అవకాశం లేదని చెప్పేశారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటానికి కొద్ది రోజుల ముందు టీడీపీలో చేరిన మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు టిక్కెట్ దక్కింది.

వసంత కృష్ణ ప్రసాద్‌కు Vasanth Krishna Prasad టిక్కెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన దేవినేని ఉమా స్వతంత్ర అభ‌ర్థిగా పోటీ చేస్తానని హడావుడి చేస్తున్నా పెద్దగా స్పందన రావడం లేదు. రైలు ప్రమాదంలో దేవినేని రమణ మరణించిన తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లో ఎదిగిన ఉమా దాదాపు పాతికేళ్లుగా జిల్లాలో మరో నాయకుడిని ఎదగనివ్వకుండా చేశారనే ఆరోపణలున్నాయి.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో Krishna District ఒక్కరితో కూడా ఉమాకు సఖ్యత లేకపోవమే ఇందుకు నిదర్శనం. సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినా అందరిని కలుపుకుని పోవడంలో విఫలం అయ్యారు.

కృష్ణా జిల్లా టీడీపీ నాయకుల్లో ఒకప్పటి కొడాలి నాని, వల్లభనేని వంశీతో మొదలు పెడితే గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, శ్రీరాం తాతయ్య, బొండా ఉమా,బోడె ప్రసాద్, కేశినేని నాని ఇలా టీడీపీ నాయకుల్లో ఒక్కరితో కూడా దేవినేని ఉమాకు సఖ్యత లేదు. కేశినేని నానికి పోటీగా కొన్నేళ్లుగా కేశినేని చిన్ని టీడీపీలో హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఎదుగుతున్న నాయకుడిని కూడా కనీసం తన వైపు ఉండేలా జాగ్రత్త పడలేకపోయారు.

కేశినేని చిన్ని, మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ మధ్య అవగాహనతో కుదరడంతోనే దేవినేని ఉమా టిక్కెట్ చంద్రబాబు చింపేశారని ప్రచారం జరుగుతోంది. మైలవరం టిక్కెట్ కేటాయిస్తే ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామ, తిరువూరు నియోజక వర్గాల బాధ్యత తాను తీసుకుంటానని వసంత కృష్ణ ప్రసాద్ హామీ ఇవ్వడం కూడా అతనికి కలిసొచ్చింది.

విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో సుజనా చౌదరి పోటీ చేసే అవకాశం ఉంది. మిగిలిన నియోజక వర్గాల్లో విజయవాడ సెంట్రల్ , జగ్గయ్యపేట, విజయవాడ తూర్పు ఉన్నాయి. విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్‌ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. దీంతో లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థికి నియోజకవర్గాల ఎన్నికల భారం తప్పిందని అంచనా వేస్తున్నారు.

దేవినేని ఉమాకు టిక్కెట్ కేటాయిస్తే ఆ భారాన్ని కూడా ఎంపీ అభ్యర్థి మోయాల్సి వచ్చేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు తర్వాత చిన్న చంద్రబాబుగా చలామణీ అయిన దేవినేని ఉమా జిల్లా నేతల్ని హీనంగా చూసేవారని గుర్తు చేస్తున్నారు.

పార్టీ పదవిలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఏ ఒక్కరికి సాయం చేయకపోవడం, మిగిలిన నేతలు చంద్రబాబుకు దగ్గర కాకుండా జాగ్రత్త పడుతుండటమే వారంతా ఏకం చేయడానికి కారణమైందని చెబుతున్నారు. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత దేవినేని కుటుంబానికి ప్రాతినిధ్యం లేకుండా అభ్యర్థుల జాబితా ఉండేదని కాదని జిల్లా నేతలు గుర్తు చేస్తున్నారు.

గత ఎన్నికల్లో దేవినేని అవినాష్‌ గుడివాడ నుంచి ఉమా మైలవరం నుంచి పోటీ చేశారు. ఇద్దరూ ఓటమి పాలయ్యారు. అవినాష్‌ ఓటమి వెనుక కూడా దేవినేని ఉమా హస్తం ఉందనే ప్రచారం జరిగింది. విజయవాడ నుంచి తప్పించి గుడివాడ కేటాయించడం వెనుక ఉమా ప్రభావం ఉందనే ప్రచారం కూడా జరిగింది.

ప్రస్తుతం అవినాష్ వైసీపీలో ఉంటే, ఉమాకు కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా దక్కలేదు. అంతా స్వయంకృతం అని టీడీపీ నేతలు కనీసం సానుభూతి చూపడానికి కూడా ఆసక్తి చూపడం లేదు.

తదుపరి వ్యాసం