Mylavaram TDP : మారుతున్న 'మైలవరం' రాజకీయం... టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వసంత, దేవినేని ప్లేస్ మారబోతుందా..?
02 March 2024, 12:43 IST
- MLA Vasantha Venkata Krishna Prasad : మైలవరం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతా అనుకున్నట్లే వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు.
టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత
MLA Vasantha Venkata Krishna Prasad : అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓవైపు వైసీపీ సుదీర్ఘ కసరత్తు చేస్తుండగా… టికెట్లు దక్కవని నిర్ధారించుకుంటున్న పలువురు నేతలు జెండాలను మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. వైసీపీని వీడారు. శనివారం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు వసంత కృష్ణప్రసాద్. పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
గత కొంతకాలంగా మైలవరం రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే వసంత ఎప్పుడైతే పార్టీ మారుతారనే చర్చ జరిగిందో…. అప్పట్నుంచి సమీకరణాలు వేగంగా మారుతూ వచ్చాయి. టీడీపీ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమా ఈ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఈ సీటు నుంచే గెలిచిన ఉమా… మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత చేతిలో ఓడిపోయారు.
వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా కుటుంబాల మధ్య విబేధాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. రాజకీయంగా తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మట్టి తవ్వకాల విషయంలో ఎమ్మెల్యే వసంతపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు దేవినేని. కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య అధిపత్యపోరు నడుస్తున్న నేపథ్యంలో… ఎన్నికలు సమీపిస్తున్న వేళ…. ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడి… తెలుగుదేశంలోకి రావటంతో టికెట్ ఎవరికి దక్కబోతుందనేది టాక్ ఆఫ్ ది మైలవరంగా మారింది.
టికెట్ ఎవరికి…?
వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ కే టికెట్ దక్కవచ్చని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు దేవినేని మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తాను మైలవరం నుంచే బరిలో ఉంటానని చెబుతున్నారు. అయితే ఇప్పటికే పార్టీ అధినాకయక్వం ఇరు నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మైలవరంలో వసంతను బరిలో దింపి… దేవినేని మరోచోట పోటీ చేయించాలని టీడీపీ అధిేనేత చంద్రబాబు భావిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వసంతకు టికెట్ కేటాయిస్తే దేవినేని మద్దతుగా నిలుస్తాడా…? వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు మైలవరం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది వైసీపీ అధినాయకత్వం. ఇక్కడ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలను బీసీ సామాజికవర్గానికి చెందిన తిరుపతి రావు యాదవ్ ను నియమించింది వైసీపీ హైకమాండ్. జెడ్పీటీసీగా ఉన్న తిరుపతిరావు యాదవ్ ను ఇంఛార్జుగా నియమించిన వైసీపీ… ఇక్కడ పూర్తిగా బీసీ కార్డు అస్త్రంతో ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. అయితే వచ్చే ఎన్నికల్లో అత్యంత హాట్ సీటుగా ఉన్న మైలవరంలో… ఎవరి వ్యూహాలు వర్కౌట్ అవుతాయనేది చూడాలి….!