Swara Bhasker: ‘ఈవీఎంల వల్లనే నా భర్త ఫహద్ అహ్మద్ ఓడిపోయాడు’: స్వర భాస్కర్
23 November 2024, 19:25 IST
Swara Bhasker: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్త ఫహద్ అహ్మద్ ఓడిపోవడంపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ స్పందించారు. ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ 16 నుంచి 19 రౌండ్లను రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. 99% బ్యాటరీ ఉన్న ఈవీఎం లు ఓపెన్ చేసిన తరువాతే తన భర్త మెజారిటీని కోల్పోయారని ఆరోపించారు.
భర్త ఫహద్ అహ్మద్ తో స్వర భాస్కర్
Swara Bhasker: మహారాష్ట్రలోని అణుశక్తి నగర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) సమగ్రతను బాలీవుడ్ నటి, రాజకీయ వ్యాఖ్యాత స్వర భాస్కర్ ప్రశ్నించారు. ఆ నియోజకవర్గంలో స్వర భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ బీజేపీ బలపరిచిన ఎన్సీపీ-అజిత్ పవార్ అభ్యర్థి సనామాలిక్ చేతిలో ఓడిపోయారు.
ఈవీఎంలదే తప్పు..
"#AnushaktiNagar విధాన్ సభలో ఎన్సిపి-ఎస్పీ @FahadZirarAhmad స్థిరమైన ఆధిక్యం తరువాత... 17, 18, 19 రౌండ్లలో అకస్మాత్తుగా 99 శాతం బ్యాటరీ ఛార్జర్ ఈవీఎంలు తెరుచుకోవడంతో బీజేపీ బలపరిచిన ఎన్సీపీ-అజిత్ పవార్ అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చారు. రోజంతా ఓటింగ్ జరిగిన యంత్రాల్లో 99 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా ఉంటుంది? 99 శాతం ఛార్జింగ్ బ్యాటరీలు ఉన్న ఈవీఎంలలో బీజేపీకి, దాని మిత్రపక్షాలకు ఎందుకు ఓట్లు ఎక్కువ వస్తున్నాయి.?’’ అని స్వర భాస్కర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
99% బ్యాటరీ పవర్ ఉన్న ఈవీఎంలు
అణుశక్తి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె భర్త, ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి ఫహద్ అహ్మద్ ఎన్సీపీ (అజిత్ పవార్) అభ్యర్థి సనా మాలిక్ చేతిలో ఓడిపోయారు. సనా మాలిక్ ప్రముఖ రాజకీయ నాయకుడు నవాబ్ మాలిక్ కుమార్తె. అణుశక్తి నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపులో 15 రౌండ్ల వరకు ఫహాద్ అహ్మద్ కు, సనా మాలిక్ కు దాదాపు సమానంగా ఓట్లు వచ్చాయని, కొంత వరకు తన భర్త ఫహాద్ కు మెజారిటీ ఉందని,కానీ, అకస్మాత్తుగా 16 వ రౌండ్ నుంచి 19వ రౌండ్ వరకు సనా మాలిక్ కు భారీ మెజారిటీ లభించిందని స్వర భాస్కర్ ఆరోపిస్తున్నారు. ఈవీఎంల వల్లనే తన భర్త ఓడిపోయాడని ఆమె ఆరోపించారు. 16 నుంచి 19 రౌండ్లలో 99% బ్యాటరీ పవర్ ఉన్న ఈవీఎంలను ఓపెన్ చేశారని, రోజంతా ఓటింగ్ లో ఉన్న ఈవీఎంల బ్యాటరీలకు 99% ఛార్జింగ్ ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు. మరోవైపు, ఈవీఎంల అవకతవకలను ప్రస్తావిస్తూ 16, 17, 18, 19 రౌండ్లలో పోలైన ఓట్లను రీకౌంటింగ్ చేయాలని ఫహద్ అహ్మద్ డిమాండ్ చేశారు.